ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ ప్రక్షాళనకు అన్నీ ఆటంకాలే!

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:02 AM

కాలుష్యకాసారంగా మారిన జీవనది మూసీ ప్రక్షాళనకు ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. 2005 నుంచి మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినా ఒక్కటీ ముందుకుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం కార్యాచరణ అమలుకు పూనుకు న్న నాటి నుంచి రాజకీ య వివాదాలు కొనసాగుతున్నాయి.

2005 నుంచి మొదలైన కార్యాచరణ

ప్రభుత్వాలు మారినా ముందుకు సాగని పనులు

కేంద్రం మద్దతు అంతంతే

తాజాగా చేపట్టిన మూసీ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): కాలుష్యకాసారంగా మారిన జీవనది మూసీ ప్రక్షాళనకు ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. 2005 నుంచి మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినా ఒక్కటీ ముందుకుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం కార్యాచరణ అమలుకు పూనుకు న్న నాటి నుంచి రాజకీ య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వమైనా ఆటంకాలను అధిగమించి ఇచ్చిన మాట మేరకు మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉమ్మ డి జిల్లా మూసీ పరివాహక రైతాంగం కోరుతోంది.

మూసీ ప్రక్షాళన చేయకపోతే పరివాహకమంతా రోగాలమయంగా మారుతుందని, జీవజాతుల ఉనికికి ప్రమాదమని శాస్త్రవేత్తల హెచ్చరికలు, కాగ్‌ నివేదికలు, సామాజికసంస్థల అధ్యయనాల మేరకు 2005 నుంచి మూసీ ప్రక్షాళన పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతీ సందర్భంలో మూసీ ప్రక్షాళన అంశం తెరపైకి రావడం, నిధులకొరత, మూసీ పరివాహకంలో ఆక్రమణల తొలగింపుపై స్థానికుల అభ్యంతరాలు, రాజకీయ ప్రతిబంధకాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఆగిపోవడం పరిపాటిగా మారింది. హైదరాబాద్‌ దిగువన ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలు, సామాజికవేత్తలు మాత్రం ఎప్పటికప్పుడు మూసీ ప్రక్షాళన చేపట్టాలనే అంశానికి కట్టుబడి ఉన్నా, ఆటంకాలను నిరోధించలేకపోతున్నారు. దీంతో మూసీ ప్రక్షాళన ముందుకు సాగడం లేదు.

మూసీ నది ప్రక్షాళనకు 2005లో శ్రీకారం చుట్టారు. మొత్తం 287 కిలోమీటర్ల ప్రవాహం ఉన్న మూసీ నది హైదరాబాద్‌ మహానగరంలో ప్రవహించే దాదాపు 58కిలోమీటర్ల పరిధిలో 90 శాతం మేర కాలుష్యానికి గురవుతోంది. ఓ వైపు మహానగరం నుం చి వచ్చే మురుగునీరు, మరోవైపు నగరం చుట్టూ విస్తరించిన పారిశ్రామికవాడల్లోని దాదాపు 12వేల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపూరిత వ్యర్థరసాయనాలు కలవకుండా శుద్ధి చేయడం, మరోవైపు నది కుచించుకుపోయేలా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో ఉన్న ఆక్రమణలు తొలగించడం, మహానగర చెత్త, ఇతర వ్యర్థాలు నదిలో కలపకుండా నిరోధించడం వంటి ప్రఽధాన పనులు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత మురుగునీటి శుద్ధికి ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు. 2005లో కేంద్రం నిధులు రూ.330 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా కలిపి నాలుగు ఎస్టీపీలను నిర్మించాలని తలపెట్టారు. వీటిపై అప్పటి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడం, స్థానికుల నుంచి ఇబ్బందులు, ఉద్యమాలు, తదితర కారణాలతో 2013 వరకు ప్రాజెక్టు ముందుకు సాగలేదు. చివరకు 2013 నాటికి ఈ నాలుగు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మళ్లీ 2016లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ప్రక్షాళనతో పాటు మూసీ సుందరీకరణ చేపట్టాలనే లక్ష్యంతో రూ.16,653కోట్ల అంచనాలతో మూసీ రివర్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో మూసీ నది నీటి ప్రక్షాళన నిమిత్తం 31 ఎస్టీపీలను నిర్మించేందుకు రూ.3,866కోట్లు ప్రతిపాదించారు. పాత ఎస్టీపీలు, వాటిలో నిర్మాణం పూర్తయిన ఎస్టీపీలు కలిపి మొత్తం 25 ప్రస్తుతం పనిచేస్తుండగా, వీటి ద్వారా సుమారు 775ఎంఎల్‌డీ నీరు శుద్ధి అవుతోంది. ఇంకా 1,200ఎంఎల్‌డీ మురుగునీరు, మరో 1,650 ఎంఎల్‌డీ పారిశ్రామిక వ్యర్థాలు ఇంకా మూసీలో కలుస్తూనే ఉన్నాయి.

ప్రక్షాళనకు కేంద్రం మద్దతు కరువు

మూసీనది ప్రక్షాళన ప్రాజెక్టు 2005 నుంచి మొదలుకాగా, కేంద్ర ప్రభుత్వ మద్దతు ఆశించినరీతిలో దక్కడం లేదనే విమర్శలు ఉన్నా యి. 2006లో ప్రభుత్వభాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు రూ. 330కోట్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కలిపి అప్పటి ప్రభు త్వం నాలుగు ఎస్టీపీలను నిర్మించింది. ఈ నాలుగు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు 2013లో పూర్తయ్యాయి. ఆ తర్వాత కేంద్రం ఎలాంటి నిధు లు ఈ ప్రాజెక్టుకు ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్ర రోడ్లుభవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వినతిపత్రం అందజేశారు. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు రూపొందించాలని, అందుకు కేంద్రం నిధులివ్వాలని ఆయన కోరారు. మూసీ ప్రక్షాళనను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ప్రతిపాదించినా కేంద్రం కొర్రీలు వేసిందే తప్ప నిధులివ్వలేదని మాజీ ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. తాజాగా, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మూసీ ప్రక్షాళనకు కేంద్రమంత్రికి విన్నవించారు. కేంద్రం నిధుల విషయంలో ఏం హామీ ఇస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇస్తేనే ఆశించిన రీతిలో మూసీ ప్రక్షాళన ముందుకు సాగుతుందని, రైతుల విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా నిధులిచ్చేందుకు బీజేపీ నేతలు కృషి చేయాలనే సూచనలు వస్తున్నాయి.

రాజకీయ వివాదంలో తాజా ప్రాజెక్టు

అనివార్యంగా చేపట్టాల్సిన మూసీ ప్రక్షాళన కార్యక్రమం తరచూ రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రస్తుతం మూసీ ప్రక్షాళనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా, దాన్ని కొన సాగిస్తే రానున్న రెండు, మూడేళ్లలోనైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరివాహక ప్రాంతానికి పట్టిన కాలుష్యపీడ విరగడవుతుందని రైతులు భావిస్తున్నారు. అయితే తాజా, ప్రాజెక్టులో మొదటి దశలో హైదరాబాద్‌ పరిధిలో మూసీ నదిలో బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టగా అది రాజకీయ వివాదంగా పరిణమించింది. ఆక్రమణల తొలగింపుతో పాటు, మూసీ నీటి ప్రక్షాళన కోసం ప్రభుత్వం మరో 39 ఎస్టీపీలను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం రూ.3,849కోట్ల నిధులు కేటాయించింది. అయితే తాజా, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఏమేరకు ముందుకు సాగుతుందనే సందిగ్ధం ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈసారి ఆటంకాలను పరిష్కరిస్తూ మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిందేనని ఉమ్మడి జిల్లా మూసీ పరివాహక రైతాంగం కోరుతోంది.

Updated Date - Oct 18 , 2024 | 01:02 AM