గుడ్డు ప్రియులకు గడ్డుకాలం
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:54 AM
కోడిగుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ ధర రూ.7కు పైగా చేరింది. చలికాలంలో ధర పెరగడం సాధారణమే. అయినా ఇంత స్థాయిలో పెరగడం అరుదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరాంతంలో క్రిస్మస్, ఆంగ్ల సంవత్సర వేడుకలు ఉన్నాయి.
రూ.7కు పైగా పెరిగిన ధర
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కేక్‌ల తయారీ కోసం అధికంగా వినియోగం
కొంత కృత్రిమ కొరత
ఇబ్బంది పడుతున్న ప్రజలు
(ఆంధ్రజ్యోతి, భూదాన్‌పోచంపల్లి, సూర్యాపేటటౌన్): కోడిగుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ ధర రూ.7కు పైగా చేరింది. చలికాలంలో ధర పెరగడం సాధారణమే. అయినా ఇంత స్థాయిలో పెరగడం అరుదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరాంతంలో క్రిస్మస్, ఆంగ్ల సంవత్సర వేడుకలు ఉన్నాయి. ఈ ఉత్సవాలకు అధికంగా వినియోగించే కేకుల తయారీలో గుడ్డు వాడకం ఎక్కువ. దీంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కిరాణా దుకాణాల్లో రూ.7.50 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. మరో పక్క కార్తీక మాసానికి ముందు కోడి మాంసం కిలో ధర రూ.230 నుంచి రూ.240 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180 నుంచి రూ.200 వరకు ఉంది. మాంసం ధర తగ్గి, గుడ్డు ధర మాత్రం విపరీతంగా పెరిగింది. నెలాఖరుకు మాంసం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
గుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల క్రితం డజన్ గుడ్లు రూ.72 ఉండగా, ప్రస్తుతం రూ.90కి పైగా చేరింది. సూ ర్యాపేట జిల్లాలో నిత్యం 4.50లక్ష నుంచి 5.20లక్షల వరకు గుడ్ల విక్రయం జరుగుతోంది. పట్టణంలో నిత్యం 60వేల నుంచి 80వే ల వరకు విక్రయిస్తున్నారు. గతంలో రోజంతా విక్రయించే గు డ్లు ఇప్పుడు కేవలం మూడు గంటల్లోనే విక్రయించడం గమనార్హం. పౌష్ఠికాహారంగా గుడ్డు తీసుకోవాలని ప్రచారం చేయ డం, ప్రజల్లో అవగాహన పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణం. ఒక కుటుంబం వారంలో ఒక రోజు మాంసాన్ని విక్రయిస్తే కొందరు ప్రతీ రోజు గుడ్డును వినియోగిస్తున్నారు. జిల్లాలో 10కి పైగా కోళ్లఫాంలు ఉన్నా యి.అందులో 8లక్షలకుపైగా కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సుమారు 3లక్షల నుంచి 4లక్ష లవరకు విజయవాడ,గుంటూరుతో పాటు ఇత ర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
కేకుల కోసం ఆర్డర్లు..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఒక బేకరీ నిర్వహకుడు డిసెంబరు 31 వేడుకను దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల నుంచి కేకుల తయారీలో నిమగ్నమయ్యాడు. అందుకోసం సదరు బేకరీ నిర్వాహకుడు ప్రతీరోజు 200పైగా కోడిగుడ్లను ఆర్డర్ ఇస్తున్నా డు. జిల్లా కేంద్రంలో సుమారు 100వరకు బేకరీలు ఉన్నాయి. అంతేగాక క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో కేకుల విక్రయాలు పెరుగుతుండడంతో కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థులకు నూతన మెనూ ప్రకటించగా, అందులో ప్రతీ రోజు గుడ్లు ఇవ్వాల నే నిబంధన పెట్టింది. దీంతో డిమాండ్ పెరిగింది.
కృత్రిమ కొరత..
గుడ్ల ధరలు ఏటా నవంబరు, డిసెంబరు నెలలో కొంత పెరుగుతాయి. చలి కాలంలో గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వేసవి కాలంలో గుడ్లు 10 నుంచి 12 రోజుల్లో విక్రయించాలి. అదే చలికాలంలో 20 రోజుల వరకు తాజాగా నే ఉంటాయి. దీంతో కోళ్లఫారం నిర్వాహకులు చలికాలంలో గుడ్లను విక్రయించకుండా జనవరి వరకు నిల్వ ఉంచుతుండటంతో కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌తోపాటు ధర పెరుగుతోంది.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఇబ్బందులే
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇచ్చేందుకు ఏజెన్సీలు ఆపసోపాలు పడుతున్నాయి. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.5 చెల్లిస్తుండగా అదనంగా రూ.2కు పైగా ధర పెరగడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నల్లగొండ జిల్లాలో 1,483 వంట ఏజెన్సీలు, సూర్యాపేట జిల్లాలో 917 ఏజెన్సీలు, యాదాద్రి జిల్లాలో 729 మధ్యాహ్న భోజన ఏజెన్సీలున్నాయి. 2.11 లక్షల మంది విద్యార్థులున్నారు. ఏళ్ల నుంచి పాత ధరలే అమలవుతుండటంతో ఏజెన్సీలకు ఇబ్బందులు తప్పడం లేదు. మెనూ ప్రకారం వారంలో మూడు గుడ్లు ఇవ్వాలి. ఇప్పటికే కూరగాయల ధరలు పెరగడంతో వంట ఏజెన్సీలు ఇబ్బందులు పడుతుండగా, గుడ్డ ధర పెరుగుదలతో మరింత ఆర్థికభారం పడుతోందని ఏజెన్సీ నిర్వాహకులు గగోలుపెడుతున్నారు. అంతేగాక ఏజెన్సీలకు కూరగాయలు, గుడ్డు బిల్లును ప్రత్యేకంగా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఆరు మాసాలుగా గుడ్ల బిల్లులు రావడం లదేని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
కోడిగుడ్డు ధర పెరుగుదల ఇలా
నెల ధర (ఒకటి)
ఆగస్టు రూ.5.70
సెప్టెంబరు రూ.6.25
అక్టోబరు రూ.6.29
నవంబరు రూ.6.50
డిసెంబరు రూ.7.20
గతంలో ఎన్నడూ లేదు : వెంకటేష్, సూర్యాపేట
ప్రతీ రోజు గుడ్డు తింటున్నాం. రోగ నిరోధక శక్తి పెరుగుదలకు ఉదయం, సాయంత్రం కూర ఎదైనా గుడ్డు తప్పకుండా వాడుతున్నాం. మాంసం ధర, కూరగాయల ధరలు పెరగడంతో గుడ్లే కొనుగోలు చేస్తున్నాం. ధరలు పెరగడంతో కొంత ఇబ్బంది పడుతున్నాం.
అధికంగా కొనుగోలు చేస్తున్నారు: రాము, దుకాణ నిర్వాహకుడు, సూర్యాపేట
ప్రస్తుతం కోడిగుడ్డును అధికంగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో రూ.6 ధర ఉండగా, ప్రస్తుతం రూ.8 వరకు విక్రయిస్తున్నాం. గుడ్లకు డిమాండ్‌తోపాటు ఉత్పత్తి లేక ధరలు పెరిగాయి.
Updated Date - Dec 17 , 2024 | 12:54 AM