వృద్ధురాలిని మోసగించి రూ.2కోట్ల ఆస్తి కొట్టేసి
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:42 AM
నిరక్షరాస్యురాలైన వృద్ధురాలికి చెందిన కోట్ల రూ పాయల ఆస్తిని కాజేసేందుకు రక్తసంబంధీకులే అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారు. వృద్ధురాలికి చెందిన భూమిలో కొంతభాగమే కొనుగోలు చేసిన సదరు బంధువులు, మొత్తం భూమిని కాజేశారు.
33గుంటలు కొనుగోలుచేసి 2.37ఎకరాలకు రిజిస్ట్రేషన్
మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు
తహసీల్ ఆఫీస్‌లో హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించారు : బాధితురాలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): నిరక్షరాస్యురాలైన వృద్ధురాలికి చెందిన కోట్ల రూ పాయల ఆస్తిని కాజేసేందుకు రక్తసంబంధీకులే అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారు. వృద్ధురాలికి చెందిన భూమిలో కొంతభాగమే కొనుగోలు చేసిన సదరు బంధువులు, మొత్తం భూమిని కాజేశారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ ఉద్యోగి ఈ మొత్తం వ్యవహారంలో చక్రంతిప్పగా, చివరికి వాస్తవం బోధపడి సదరు వృద్ధురాలు లబోదిబోమంటోంది. తనకు న్యాయం చేయాలని తిప్పర్తి పోలీ్‌సస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాజాగా కలెక్టర్‌కు, నల్లగొండ డీఎస్పీకి కూడా వినతిపత్రం అందజేసింది.
నల్లగొండ రూరల్ మండలం చిన్నసూరారం రెవెన్యూ పరిధిలో నకిరేకల్-నాగార్జునసాగర్ జాతీయరహదారికి పక్కన కర్ర శ్రీరాములమ్మకు చెందిన భూమిని రక్తసంబంధీకుడు, వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కొనుగోలు చేసినదానికంటే అదనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీరాములమ్మ 70 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులైన వృద్ధురాలు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఏకైక కుమారుడు 2023లో అకాలమరణం చెందాడు. ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధురాలికి ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులు ఆమె ఆస్తిని కాజేసేందుకు మోసానికి పాల్పడ్డారు. ఆమె వద్ద 33 గుంటల భూమిని కొనుగోలుచేసి ఆ మేరకు మాత్రమే డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ సమయంలో ఆమె పేరున ఉన్న 2.37 ఎకరాల భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించకున్నారు. వృద్ధురాలు నిరక్షరాస్యులవడం, రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారి సైతం వివరాలను తెలపకపోగా, తొందరపెట్టి వేలిముద్రలు వేయించారు.
శ్రీరాములమ్మకు సూరారం రెవెన్యూ శివారులో సర్వేనెంబర్లు 638/1, 640/0, 641/అ, 641/ఆలో మొత్తం 2.37 ఎకరాల భూమి ఉంది. ఇటీవల నిర్మించిన నకిరేకల్-నాగార్జునసాగర్ జాతీయరహదారి-565 ఆమె భూమిలోంచి వెళ్తోంది. ఈ రహదారికి తూర్పు వైపున సర్వేనెంబర్ 638/1లోని 33 గుంటల భూమిని ఆమె బంధువు తల్లమల్ల హుస్సేన్ ఎకరాకు రూ.50లక్షల చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఏడాది జూలై 28న గ్రామపెద్దల సమక్షంలో అగ్రిమెంట్ చేసుకొని టోకెన్ అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు చెల్లించాడు. ఆగస్టు 23న మరో రూ.15లక్షల సొమ్ము చెల్లించాడు. అక్టోబరు 17న రిజిస్ట్రేషన్ సమయంలో సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో హడావిడిగా రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఆ రోజు బాధ్యతల్లో డిప్యూటీ తహసీల్దార్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారని వృద్ధురాలు తెలిపింది. ఆ సమయంలో రూ.21లక్షలు ఇచ్చారని, 33గుంటల విక్రయానికి సంబంధించి ఇంకా రావాల్సిన రూ.3.75లక్షలను భూమి కొలిచిన అనంతరం ఇస్తామని నమ్మబలికి హడావిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపింది. తనకు చదువురాని విషయాన్ని ఆసరాచేసుకొని 33గుంటలకు బదులు తన మొత్తం భూమి 2.33ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని శ్రీరాములమ్మ కన్నీటిపర్యంతమైంది. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో డాక్యుమెంట్లతోపాటు మరో రెండు ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వృద్ధురాలు తెలిపింది. అక్టోబరు 30న పాస్‌బుక్ వివరాలను సరిచేయించుకునేందుకు గ్రామస్థుల సహకారంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మొత్తం భూమి హుస్సేన్ పేరున బదిలీ అయిన విషయం ఆమెకు తెలిసింది. ఒక్క రోజు తేడాతో మొత్తం భూమిని అతడు, కుమారులతో పాటు, మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేశాడని ఈ నెల 4న తిప్పర్తి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బి.సాయిప్రశాంత్ విచారణ చేపట్టారు. వృద్ధురాలు, హుస్సేన్ మధ్య 33గుంటల భూమి విక్రయానికి సంబంధించి మాత్రమే అగ్రిమెంట్ ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నల్లగొండ పట్టణంలోని డీటీపీ సెంటర్ నిర్వాహకుడిని విచారించి, ఖాళీ పత్రాలలో ఏ సమాచారం నింపాలో వాట్స్‌పలో పంపిన మరో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసే ఉద్యోగి పంపిన మెసేజ్‌ను ట్రేస్ చేసి వృద్ధురాలిని మోసం చేసిన విషయాన్ని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు హుస్సేన్, అతడి ఇద్దరు కుమారులపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ వివరాలివ్వాల్సిందిగా తహసీల్దార్‌కు లేఖరాశారు. ఆ వివరాలు వచ్చాక పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని ఎస్‌ఐ బి.సాయిప్రశాంత్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అదేవిధంగా వృద్ధురాలు తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇష్టపూర్వకంగా ఆస్తిని విక్రయించిందని, మొత్తం సొమ్ము చెల్లించాకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, తమపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని హుస్సేన్, అతడి కుమారులు పేర్కొంటున్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:42 AM