ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ర్యాగింగ్‌ సరదా శ్రుతిమించితే

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:44 AM

ర్యాగింగ్‌ దురలవాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి వెలుగుచూసింది. నల్లగొండ మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ చేసిన ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదైన ఉదంతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ర్యాగింగ్‌ దురలవాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి వెలుగుచూసింది. నల్లగొండ మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ చేసిన ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదైన ఉదంతం సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఉన్న ఈ ర్యాగింగ్‌ అలవాటు కాలక్రమేణ కనుమరుగు కాగా, మెడికల్‌ కళాశాలల్లో కొనసాగుతూనే ఉంది. ఎంతో కష్టపడి ఉన్నత లక్ష్యాలతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ర్యాగింగ్‌ అలవాటుతో చక్కటి భవిష్యతను నాశనం చేసుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలగకపోవడంతో పాటు పెత్తందార్లమాదిరిలా వ్యవహరిస్తుండటం జూనియర్లకు చిరాకు తెప్పిస్తోంది. శ్రుతిమించిన చోట ఫిర్యాదు చేస్తే ఏదో సరదా కోసం చేసిన ర్యాగింగ్‌ భవిష్యత విద్యాభ్యాసాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్‌)

గతంలో జూనియర్లు, సీనియర్లతో కలిసిపోయేందుకు సరదాగా ఆటపట్టించేవారు. అయితే ఇది కాస్తా శ్రుతి మించిపోతుండటంతో అప్పటి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలో చాలాచోట్ల ర్యాగింగ్‌ మాట వినిపించడం లేదు. అయితే మెడికల్‌ కళశాల్లో మాత్రం అక్కడక్కడ వెలుగుచూస్తోంది. సీనియర్లు, జీనియర్లను ర్యాగింగ్‌ చేయడం పరిపాటిగా మారింది. అయితే ర్యాగింగ్‌ సంఘటనలు జరుగుతున్నా కళాశాల నిర్వాహకులు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. అటు కళాశాల గౌరవానికి తోడు ఇటు విద్యార్థుల భవిష్యతను దృష్టిలో పెట్టుకుని విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే ర్యాగింగ్‌ విసృంకళంగా మారడంతో సున్నిత మనస్తత్వం కలిగిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాల ఆనందం కోసం ర్యాగింగ్‌ చేస్తున్న విద్యార్థులు ఆ తర్వాత పరిణామాలను మరిచిపోతున్నారు. ఒక్కోసారి తమ చర్యల వల్ల చక్కటి విద్యాభ్యాసం చేయాల్సిన భవిష్యతను కోల్పోయే ప్రమాదమూ ఉంది.

సీనియర్ల తీరుతోనే

మెడికల్‌ కళాశాలల్లో జూనియర్లతో సీనియర్లు స్నేహంగా మెలగడంలేదు. ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రికార్డులు రాయాలని, విద్యకు సంబంధించి పెండింగ్‌ పని ఉంటే చేసిపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కాలక్షేపం కోసం డ్యాన్సులు చేయాలని, పాటలు పాడాలని జూనియర్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సీనియర్ల చర్యలను జూనియర్లు సరాదాగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. తమపట్ల కొంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నారనుకుంటే సమస్యల్లేవు. సీనియర్ల రికార్డులు, ఇతర విద్యకు సంబంధించిన పనులు చేయాలని కోరితే జూనియర్లు చేయడం వల్ల విద్యలో రాణించే అవకాశముంది. సీనియర్లతో కలిసిపోతే విద్యకు సంబంధించి వారి నుంచి కొంతమేర నేర్చుకునే అవకాశాలూ లేకపోలేదు. అయితే సున్నితంగా చెప్పాల్సిన పనులు కూడా బెదిరింపులుగా ఉండటంతో జూనియర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళాశాలల్లో విద్యార్థులు మానసికంగా ధృడంగా ఉండేలా వారికి ప్రత్యేక మానసిక నిపుణులతో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.

సూర్యాపేటలో సత్ఫలితాలిస్తున్న చర్యలు

ర్యాగింగ్‌కు చెక్‌పెట్టేందుకు సూర్యాపేట మెడికల్‌ కళాశాల నిర్వాహకుల చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రస్తుతం 750 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాల ప్రారంభ బ్యాచ విద్యార్థులు ఈఏడాది వారి ఎంబీబీఎస్‌ విద్యను పూర్తి చేయనున్నారు. కళాశాలలో ఇటీవల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులు కొన్ని నెలల పాటు కలవకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల తరగతులు, డైనింగ్‌ సమయాలు వేర్వేరుగా ఏర్పాటుచేశారు. అంతేకాకుండా సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులకు హాస్టళ్లు కూడా వేరుగా ఏర్పాటుచేశారు. దీంతో చాలామేరకు ర్యాగింగ్‌ను అరికడుతున్నారు. రాత్రి సమయాల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు హాస్టళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాయి. వీటికి తోడు విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా ప్రత్యేకంగా కళాశాలల్లో డ్రాప్‌ బాక్సును ఏర్పాటుచేశారు. నేరుగా వారి ఇబ్బందులను తెలపలేని విద్యార్థులు డ్రాప్‌ బాక్సులో ఫిర్యాదులు వేయవచ్చు. దీని ద్వారా కూడా వారి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. కళాశాల్లో విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. అదేవిధంగా కళాశాల ప్రాంగణంలోనే ప్రిన్సిపాల్‌,ఇతర హెచవోడీలు, అధ్యా పకుల నివాసగృహాలు ఏర్పాటుచేశారు. రాత్రి 9గంటల వరకు విద్యార్థులు వారి హాస్టళ్లకు చేరుకునేలా చర్యలు చేపడుతున్నారు.

నాలుగేళ్ల కిందట

నాలుగేళ్ల క్రితం సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో కొందరు విద్యార్థులు ఓ విద్యార్థితో అమర్యాదగా ప్రవర్తించారు. అంతేకాకుండా అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో సంబంధిత బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన విద్యార్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో పాటు కళాశాల నుంచి కొన్ని నెలల పాటు వారిని సస్పెండ్‌ చేశారు.

యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు

మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ జరగకుండా యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో పోలీస్‌ అధికారి, సీనియర్‌ విద్యార్థులు, విద్యార్థినులు, హాస్టళ్ల వార్డెన్లు, వివిధ విభాగాలకు చెందిన 10 మంది హెచవోడీలు ఉన్నారు. వీరంతా కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సీనియర్‌ విద్యార్థులతో జూనియర్‌ విద్యార్థులకు పరిచయ కార్యక్రమం ఏర్పాటుచేస్తారు. ర్యాగింగ్‌ చేయవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి సమయంలో ర్యాగింగ్‌ కమిటీలోని కొంతమంది సభ్యులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి విద్యార్థుల కదలికలను గమనిస్తుంటారు. అదేవిధంగా హాస్టల్‌ గదుల్లో ఉండాల్సిన సంఖ్య ప్రకారం విద్యార్థులు ఉన్నారా లేరా అనే విషయాలను కూడా గమనిస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థిని ఇబ్బందులు పెడుతున్నట్లు గమనిస్తే వెంటనే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు.

బాధితులు ఫిర్యాదు చేస్తే..

ర్యాగింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలకు తీసుకోవచ్చు.

నెలల పాటు కళాశాలల నుంచి సస్పెండ్‌ చేయ్యొచ్చు.

రిమార్కులతో స్టడీకండక్ట్‌ను జారీ చేయొచ్చు.

కొన్ని సందర్భాల్లో అడ్మిషనను రద్దు చేసే అవకాశమూ లేకపోలేదు.

ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు

కళాశాలల్లో ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నాం. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు కొన్నాళ్ల పాటు కలవకుండా చర్యలు తీసుకున్నాం.తరగతి,డైనింగ్‌ సమయాలు వేర్వేరుగా ఏర్పాటుచేశాం. జూనియర్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టల్‌లో ఒక ఫ్లోర్‌ను కేటాయించాం. ర్యాగింగ్‌ సంఘటనలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నాం. వాట్సాప్‌, ఈమెయిల్‌, డ్రాప్‌ బాక్సు ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాం. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.

డాక్టర్‌ ఎం.జయలత, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, సూర్యాపేట.

Updated Date - Nov 20 , 2024 | 12:44 AM