వర్షాలకు గూడ రాలుతోంది
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:42 AM
అదనుతప్పి కురుస్తున్న వర్షాలతో రైతన్న ఆగమవుతున్నాడు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యేది వరి, పత్తి పంటలే. ఈఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండున్నర మాసాలు గడిచాక,ఈ నెల లో కురిసిన వర్షాలు మినహా అంతకు ముందుకు భారీ వానలే లేవు.
అన్నదాతకు కునులేకుండా చేస్తున్న పత్తి
వరికి గొట్టం రోగం
అదునుతప్పి కురుస్తున్న వానలకు దెబ్బతింటున్న పంటలు
మోత్కూరు,సెప్టెంబరు 6: అదనుతప్పి కురుస్తున్న వర్షాలతో రైతన్న ఆగమవుతున్నాడు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యేది వరి, పత్తి పంటలే. ఈఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండున్నర మాసాలు గడిచాక,ఈ నెల లో కురిసిన వర్షాలు మినహా అంతకు ముందుకు భారీ వానలే లేవు. ఈ నెలలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, జిలాల్లో ప్రధానంగా మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల తదిత ర మండల్లాలో నేటికీ చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. బిక్కేరువాగులో నూ నీరు ప్రవహించలేదు. జిల్లాలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు లేకపోవడం తో వర్షాధారంపైనే పంటలు సాగవుతున్నాయి. మెట్టపంటలతోపాటు చెరువులు, కుంటలు, బావులు, బోర్లపై ఆధారపడి రైతులు వరిసాగు చేస్తున్నా రు. నేటికీ చెరువులు, కుంటలు నిండకపోవడంతో బావులు, బోర్లలో భూ గర్భ జలాలు పెరగలేదు. దీంతో వరినాట్లు వేయలేకపోవడంతో నార్లు ముదురుతున్నాయి. వచ్చిపోయే చినుకులకు మడులు తడిపి, దున్ని నాటువేసినా ఆ తర్వాత ఎండలకు ఎండిపోతున్నాయి. అదును ప్రకారం వర్షాలు లేక పత్తి, కంది చేలు కుంటుపడ్డాయి. ఈ వర్షాలు పత్తి చేలకు జీవం పోసినా, గూడ (మొగ్గ) రాలి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
గూడ రాలుతున్న పత్తి
జిల్లాలో 1.04లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. జూలైలో భారీ వర్షాలు లేక, భూమి లోతుగా తడవక పత్తి చేలు వాడి అంతగా ఎదుగుదల లేదు. పత్తి మొలకెత్తిన మూడు మాసాల్లోనే పూర్తిగా ఎదగాలి. అప్పుడే సరైన దిగుబడి వస్తుంది. ఆగస్టులోనూ సరైన వర్షాలు లేక మరో సారి పత్తి చేలు వాడిపోయాయి. చేలు పూత, కాత దశలో ఉన్నాయి. ఆగస్టులో వర్షాలు లేక వాడిపోయిన చేలకు ఇటీవల కురిసిన వర్షాలు జీవం పోసినప్పటికీ గూడ (మొగ్గ) విపరీతంగా రాలిందని పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. గూడ రాలడంతో 15 నుంచి 20శాతం దిగుబడి తగ్గుతుందని, పత్తి చేలకు తెగుళ్లు కూడా సోకుతున్నాయి, మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి పంటను దెబ్బతీస్తున్న గొట్టం రోగం
జిల్లాలో ఇప్పటికీ వరినాట్లు 70శాతం కూడా పూర్తికాలేదు. రైతులు ఇంకా వరినాట్లు వేస్తూనే ఉన్నారు. వచ్చిపోయే చినుకులకు రోజుకో మడి చొప్పున తడిపి, దున్ని నాటు వేయగా వర్షాలు లేక ఎండలు వచ్చినప్పుడు బావులు, బోర్ల నుంచి నీరు అందక వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. ఎండిపోగా మిగిలిన వరి నాట్లకు కూడా గొట్టం రోగం సోకి వరి చేలు ఎర్రబారుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వరి, మెట్ట పంటల సాగు ఏమాత్రం లాభసాటిగా లేదంటున్నారు. గూడ రాలిన పత్తి చేలకు ప్రభుత్వం ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ఉచితంగా ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పంటలు దెబ్బతింటున్నాయి : మర్రి మధు, రైతు మోత్కూరు
నాకున్న భూమితో పాటు ఇతరుల భూమి కౌలుకు తీసుకుని 20 ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలల్లో 20శాతం గూడ రాలింది. గతంలో నాన్ బీటీ పత్తి కావడంతో నెలల తరబడి దిగుబడి వచ్చేది. ఇప్పుడు బీటీ పత్తి కావడంతో మొదట మైల పత్తి ఏరిన తర్వాత మరో రెండు, మూడు సార్లు ఏరితే పత్తి దిగుబడి ముగుస్తుంది. ఈ వర్షాలకు గూడ రాలడంతో దిగుబడి 20శాతం తగ్గినట్టే. ఏడు ఎకరాలు వరి నాటు వేయగా, రెండు ఎకరాల నాటు ఎండింది. వర్షాకాలమే అయినా నీళ్లు అందక బావి మళ్లీ పూడిక తవ్విస్తున్నా. గూడ రాల్చిన పత్తి చేలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ఉచితంగా ఎరువులు, క్రిమి సంహారక మందులు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి.
Updated Date - Sep 07 , 2024 | 12:42 AM