రుణాలు లక్ష్యానికి మించి
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:11 AM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వానాకాలంలో బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. కొత్త రుణాలతో పాటు రెన్యువల్స్ కూడా చేయడంతో లక్ష్యం మించింది.
కొత్త రుణాలతో పాటురెన్యువల్స్ కూడా అధికమే
నల్లగొండ జిల్లాలో వానాకాలంలో రూ.7,399కోట్లు మంజూరు
యాసంగిలో రూ.2,204.31కోట్లు
సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 80శాతం మేర పూర్తి
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వానాకాలంలో బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. కొత్త రుణాలతో పాటు రెన్యువల్స్ కూడా చేయడంతో లక్ష్యం మించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో బ్యాంకర్ల రుణ లక్ష్యం దాటింది.
వానాకాలంలో పంట రుణాలు అధికంగా ఇవ్వడంతో సీజన్‌లో రైతులకు ప్రయోజనం చేకూరింది. బ్యాంకర్లు అత్యధికంగా పంట రుణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చివుంటే రైతులు పంట రుణాలు తక్కువగా తీసుకునే అవకాశాలు ఉండేవి. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎలా మంజూరు చేసిందో అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుబంధు నిధులను ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ తరువాత రైతు భరోసాపై రైతులతో, అధికారులతో విస్తృతంగా చర్చించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేసి నా, అది నేటికీ అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వం ఒక్కో సీజన్‌లో ఎకరాకు రూ.5వేల వరకు రైతుబంధు ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7500 చొప్పున ఏడాదికి రెండు పంటలకు, మొత్తం ఎకరానికి రూ.15వేల వరకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఇది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. బ్యాం కు రుణాలు మాత్రం పెద్ద మొత్తంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది.
నల్లగొండ జిల్లాలో రూ.7,399కోట్లు
నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్‌లో బ్యాంకర్లు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించారు. జిల్లా వ్యాప్తంగా రూ.3,301కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా, అంతకు మించి రూ.7, 399కోట్లు పంపిణీ చేశారు. రూ.4,098కోట్లు అధికంగా బ్యాంక ర్లు రుణాలు మంజూరు చేశారు. ఎప్పటికప్పుడూ జిల్లాలో మండల, నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తూ లీడ్ బ్యాంకు అధికారులు లక్ష్యాన్ని అధిగమించేలా కృషి చేశారు. రుణమాఫీ జరగడంతో తిరిగి కొత్త రుణాలు ఇచ్చేందుకు కలిసి వచ్చింది. సుమారు రూ.1,600కోట్ల మేర రైతులకు రుణమాఫీ జరిగింది. దీంతో 2లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.2లక్షలకు పైగా రుణం ఉంటే ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయో ప్రభుత్వం స్పష్టతలేదు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు, బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. ఈ రుణాలకు సంబంధించి రుణమాఫీ విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. వానాకాలం సీజన్‌కు ముందునుంచే రుణాల పంపిణీ జరిగింది. పంటలకు రుణపరిమితి అధికంగా ఉండటంతో లక్ష్యాన్ని చేరడం సులువైంది. సూర్యాపేట జిల్లాలో రూ.2,614కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.2,268కోట్లు రుణాల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 80శాతం మేర పంపిణీ పూర్తయింది. ఈ రెండు జిల్లాలో కూడా గతంకంటే అధికంగానే రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు.
యాసంగి రుణాల పంపిణీకి ప్రణాళిక
అఽధికార యంత్రాంగం యాసంగి సీజన్‌లో రుణాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నాన్ ఆయకట్టు ప్రాంతంలో సీజన్ మొదలైంది. ఈ సారి యాసంగి సీజన్‌లో రూ.2,204.31కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రుణపరిమితి కింద వరికి ఎకరాకు రూ.50వేల వరకు రుణమిస్తున్నారు. ఈ యాసంగిలో కేవలం వరిపంట అధికంగా సాగుకానుంది. మెట్టపంటలు అధికంగా ఉండవు. ఈ నేపథ్యంలో వరి సేద్యం కోసం రుణాలు విరివిగా ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే వానాకాలంలో వరితో పాటు పత్తి, మెట్ట పంటలు సాగుకానున్నందున రూ.3,301కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించారు. యాసంగిలో మాత్రం కేవలం వరి పంట సేద్యం అవుతున్నందున లక్ష్యాన్ని తక్కువగా విధించారు. ఈసారి సాగర్ ఆయకట్టుతో పాటు మూసి, డిండితో పాటు మైనర్ ప్రాజెక్టుల కింద వరిసాగు అధికం కానుంది. కొంత మేరకు భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడంతో యాసంగి సీజన్‌లో బోరు బావుల కింద కూడా వరి సేద్యం కానుంది. వరిసాగు కూడా ఖర్చు అధికం కానుంది. కూలీలు, పొలాల దున్నకం, విత్తనాలు, ఎరువుల వాడకం అధికంగా ఉండనుండంతో ఎకరాకు రూ.50వేల వరకు రుణాన్ని బ్యాంకర్లు మంజూరు చేయనున్నారు.
కొత్త, రెన్యూవల్స్‌తో పెరిగిన రుణాలు :శ్రామిక్, నల్లగొండ జిల్లా ఎల్‌డీఎం
ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని మించి జిల్లాలో రుణ పంపిణీ జరిగింది. బ్యాంకర్ల సహకారంతో రుణాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో కొత్త రుణాలతో పాటు రెన్యూవల్స్‌ను అధికంగా చేయడం వల్ల వానాకాలంలో రూ.7,399కోట్లు రైతులకు మంజూరు చేశాం. ఇదంతా రుణమాఫీ కావడంతోనే జరిగింది. కొత్త రుణాలతో పాటు రుణాల రెన్యూవల్స్ కూడా కావడంతో లక్ష్యానికి మించి రుణపంపిణీ జరిగింది.
Updated Date - Nov 25 , 2024 | 12:11 AM