ముదిమి వయసులో మూలుగుతూనే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 11:54 PM
వారంతా వాచ్‌మెన్‌లు.. వయోభారంతో శరీరం సహకరించకపోయినా కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రివేళ ఎముకలు కొరికే చలిలోనూ కాపలా ఉద్యోగాలు చేస్తున్నారు.
చలికి వణుకుతున్నా కుటుంబ భారం మోయక తప్పని పరిస్థితి
ఇంటికి ఆసరాగా ఉంటామని వాచ్‌మన్లుగా విధులు
అరకొర వేతనాలతో శ్రమదోపిడీ
ప్రశ్నిస్తే ఉన్న ఉద్యోగమూ ఉండదనే ఆందోళన
చలికోట్లు, మఫ్లర్లు కూడా ఇవ్వని యాజమాన్యాలు
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వృద్ధ కాపలాదారుల అవస్థలు వెలుగులోకి...
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): వారంతా వాచ్‌మెన్‌లు.. వయోభారంతో శరీరం సహకరించకపోయినా కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రివేళ ఎముకలు కొరికే చలిలోనూ కాపలా ఉద్యోగాలు చేస్తున్నారు. 16 డిగ్రీల చలిలో పాతికేళ్ల యువకులు సైతం గజగజా వణుకుతున్న వాతావరణంలో ఈ వృద్ధ వాచ్‌మెన్‌లు కళ్లల్లో ఒత్తులు వేసుకొని కాపలా కాస్తున్నారు. ఈదురుగాలిని తట్టుకొని ఒక చేతి లో కర్ర, మరో చేతిలో లైటు పట్టుకొని, గొంతులో వణుకు వస్తున్నా దిగమింగుకొని పనిచేస్తున్నారు.
చలిని తట్టుకునేందుకు, ఈదురుగాలుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన చలికోట్లు (స్వెట్టర్లు), మఫ్లర్లు, బూట్లు, కాసేపు మేనువాలిస్తే కప్పుకోవడానికి రగ్గులు, గొంగడి వంటివేవీ వాచ్‌మన్‌లకు అందుబాటులో లేవు. గజగజా వణికే చలిలో ఏజెన్సీలిచ్చిన డ్రస్సు ధరించి కొందరు వారు విధులు నిర్వర్తించాల్సిన చోట స్టూల్‌పైనే కూర్చొని కాపలా కాస్తుంటే, మరికొందరు లైటు, కర్ర పట్టుకొని వారి బీట్‌చుట్టూ పహారా కాస్తున్నారు. భవన నిర్మాణాల వద్ద ఉండే వాచ్‌మెన్‌ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ ఉండే వాచ్‌మెన్‌లు 60 ఏళ్లకు పైబడ్డవారే కావడంతో చలికి వణుకుతున్నారు. చలిని తట్టుకునే ఎలాంటి సదుపాయాలు వీరికి కూడా అందుబాటులో లేవు. పైగా రాత్రివేళ పని ప్రదేశం వద్ద ఏదైనా వస్తువు చోరీకి గురైతే ఉదయం మళ్లీ యజమానుల నుంచి చివాట్లను ఎదుర్కోవాల్సిన దయనీయ స్థితి వీరిది. వాచ్‌మెన్‌లకు కనీస వేతనాలివ్వకపోగా, పనిప్రదేశాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించకుండా శ్రమదోపిడీ చేస్తున్న దుస్థితి ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెలుగు చూసింది. నల్లగొండ పట్టణంలోనే కా దు, ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి,చౌటుప్పల్ పట్టణాల్లో పలువురువృద్ధులు వా చ్‌మన్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటీఎంల వద్ద,దుకాణ సముదాయాల వద్ద, భవన నిర్మా ణ పనులవద్ద,అపార్ట్‌మెంట్లవద్ద, గేటెడ్ క మ్యూనిటీ వెంచర్ల వద్ద పనిచేస్తున్న వాచ్‌మెన్‌ల అందరి పరిస్థితి ఒకేలాగే ఉంది.
అరకొర వేతనాలు
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో సెక్యురిటీ ఏజెన్సీల పరిధిలో పనిచేసే వాచ్‌మన్‌లు శ్రమదోపిడీకి గురవుతున్నారు. వీరిలో రాత్రిపూట వాచ్‌మన్‌గా ఉద్యోగం నిర్వర్తించేవారు ఎక్కువ పనిగంటలు కూడా పనిచేస్తున్నారు. ఏటీఎంల వంటి చోట్ల 8గంటల పాటు పనిచేస్తే నెలకు రూ.8,000 ఇస్తున్నారు. షోరూమ్‌లు, ఇతర దుకాణాల వద్ద సాయంత్రం 7 నుంచి ఉదయం 7గంటల వరకు పనిచేస్తే రూ.10వేల నుంచి రూ.12వేలు యజమానులు చెల్లిస్తున్నారు. రాత్రివేళ పనిచేసే వాచ్‌మన్‌లు సుమారు 55 ఏళ్ల వయసుకు పైబడ్డవారే ఉన్నారు. అయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంత ఆసరాగా ఉంటామనే ఉద్దేశంతో తక్కువ వేతనాలకైనా పనిచేస్తున్నారని. నెలకు కేవలం రెండు రోజులే సెలవులిస్తారని, అంతకుమించి సెలవులు తీసుకుంటే వేతనంలో కోత విధిస్తారని పలువురు వాచ్‌మన్‌లు ‘ఆంధ్రజ్యోతి’ ఎదుట వాపోయారు.
భవన నిర్మాణాల వద్ద, అపార్ట్‌మెంట్ల వద్ద..
నల్లగొండతో పాటు మిర్యాలగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఇతర పట్టణాల్లో భవన నిర్మాణాల వద్ద పనిచేసే వాచ్‌మన్‌ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ పూర్తిగా వయోవృద్ధులనే వాచ్‌మన్‌లుగా నియమించుకుంటున్నారు. వృద్ధాప్యంలో బలమైన పనులు చేయలేక, కుటుంబ పోషణ నిమిత్తం పలువురు వృద్ధులు ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రివేళ నిద్రపోకుండా కాపలా ఉండడంతో పాటు, నిర్మాణాల వద్ద ఉండే ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇనుము, ఇతర సామగ్రి ఎవరూ దొంగలించకుండా తరచూ పారాహుషార్ అంటూ లైట్ వేస్తూ, ఆర్పుతూ కేకలు వేయడంతో పాటు, నిద్రపోకుండా కాపలాగా ఉంటున్నారు. నల్లగొండ పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన సందర్భంగా సుమారు 20వరకు నిర్మాణ ప్రాంతాలు, మరో 10 అపార్ట్‌మెంట్ల వద్ద గమనించగా మొత్తానికి మొత్తం 60ఏళ్ల పైబడ్డ వయసున్న వారే వాచ్‌మన్‌లుగా పనిచేస్తున్న విషయం తేలింది. తీవ్రమైన చలి, జోరుగా కురిసే వానల్లో సైతం రాత్రి వేళ నిద్రపోకుండా కఠినంగా మెలుకువ ఉండి పనిచేసే వీరికి వేతనాల విషయానికి వస్తే నెలకు రూ.6వేల నుంచి రూ.7వేలకు మించి ఇవ్వని దయనీయస్థితి ఉంది.
కనీస వసతులు కరువు
పని ప్రదేశాల వద్ద, భిన్న వాతావరణ పరిస్థితుల్లో సైతం పనిచేస్తున్న వాచ్‌మన్‌లకు కనీస వేతనాలే కాదు, కనీస వసతులు సైతం అందుబాటులో ఉంచడం లేదు. తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో వీళ్లే బాటిళ్లలో నీరు తెచ్చుకొని వాడుకుంటున్నారు. వాష్‌రూమ్‌లుగానీ, గార్డ్‌రూమ్స్‌గానీ వీరికి ఉండడం లేదు. కనీసం శీతాకాలంలో చలి తట్టుకోవడానికి అవసరమైన రగ్గులు, స్వెట్టర్లు, మఫ్లర్ల వంటి వాటిని కూడా సరఫరా చేయలేదు. అత్యంత దుర్భరమైన పరిస్థితిలో వాచ్‌మన్‌లుగా వయోవృద్ధులు పనిచేస్తున్నారు. పలు భవన నిర్మాణాల వద్ద అక్కడే పక్కన తడికలు అడ్డుపెట్టుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని కొందరు, మొదటి ఫ్లోర్ శ్లాబ్ పడ్డాక, దాని కిందనే మంచం ఏర్పాటుచేసుకొని మరి కొందరు చలిలో సైతం మెలకువగా ఉండి కాపలాకాస్తున్నారు.
డ్యూటీ సమయంతా మేల్కొని ఉండాల్సిందే : జి.సురేందర్, 52ఏళ్లు, ఏటీఎం కాపలాదారు, నల్లగొండ
నేను ఏటీఎం వద్ద కాపలాదారుడిగా పనిచేస్తున్నా. షిప్టుకు 8గంటల సమయం పనిచేయాల్సి ఉంటుంది. రాత్రి డ్యూటీ అయినా ఆ 8గంటలు కుర్చీపై కూర్చొని మెలకువగా ఉండాల్సిందే. స్వెట్టర్లు, రగ్గులు మాకు ఎవరిస్తారు? చలి వేసినా తప్పడం లేదు. సొంతంగా కొనుగోలుచేసే స్థోమత మాకు లేదు.
బతుకుదెరువు కోసం తప్పడం లేదు : జెరిపోతుల సైదులు, 70 ఏళ్లు, అర్జాలబావి, నల్లగొండ
నాకు 70 ఏళ్లు. అయినా వాచ్‌మన్‌గా పనిచేయక తప్పడం లేదు. రాత్రిపూట బిల్డింగు పనివద్ద కాపలా ఉంటే నెలకు రూ.7వేలు ఇస్తారు. ఈమధ్య చలిబాగా పెరిగింది. కానీ, పనికి రాక తప్పడం లేదు. పనికి రాకపోతే పూటగడవదు. ఈ వృద్ధాప్యంలో వేరే పనిచేయలేను. అందుకే ఎలాగో ఓర్చుకొని వాచ్‌మన్‌గా పని చేస్తున్నా. రగ్గులు, చలికోట్లు మాకెవరిస్తారు. ఉన్న దుప్పట్లతో సర్దుకోవాల్సిందే.
చలైనా, వానైనా డ్యూటీ తప్పదు : మారగోని సూరయ్య, 53 ఏళ్లు, గడ్డికొండారం, తిప్పర్తి మండలం
నేనుకొన్నేళ్లుగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నా. రాత్రంతా డ్యూటీ చేస్తే నెలకు రూ.11వేల వేతనమిస్తారు. చలైనా, వానైనా పహారా తప్పదు. రాత్రివేళ కళ్లల్లో ఒత్తులు వేస్కొని మేల్కొని ఉండాల్సిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ మేమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాత్రంతా షోరూమ్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. స్వె ట్టర్లు, రగ్గులు ఏమీ ఇవ్వరు. కేవలం యూనిఫాం మాత్రమే ఇస్తారు. పెరిగిన వయ సు చలికి తట్టుకోలేకపోతున్నా, కుటుంబ బాధ్యతలతో పనిచేయక తప్పడం లేదు.
పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది : గుండె ఎల్లయ్య (62), ఉల్సాయిపాలెం, నల్లగొండ జిల్లా
రెక్కాడితేనే డొక్కాడే కుటుంబం మాది. ఇక్కడే గుడిసె వేసుకొని ఉంటున్నాం. రాత్రి పూట వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. రూ.7500 వేతనం ఇస్తున్నారు. నా భార్య, నేను ఇక్కడే పనిచేస్తున్నాం. ఇద్దరం పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. పని వెతుక్కోవడమే తప్ప, సదుపాయాలు, వసతులు అడిగే పరిస్థితి మాకు ఉండదు. చలికాలమైనా, వానాకాలమైన సర్దుకొని పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. అంతకంటే మేం చేసేదేమీలే దు. చలికోట్లు, రగ్గులు కొనుగోలు చేసే స్థోమత మాకు లేదు. ఎవరైనా పాతవి ఇస్తే వాటినే ధరిస్తున్నాం.
Updated Date - Dec 17 , 2024 | 11:54 PM