నల్లగొండ జిల్లా కళాకారులకు జాతీయ అవార్డులు
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:32 AM
నల్లగొండ జిల్లాకు చెందిన కవి, గాయకుడు, ప్రజావాగ్గేయకారుడు చింతల యాదగిరిని జాతీయ అవార్డు వరించింది. బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.
నల్లగొండ టౌన, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లాకు చెందిన కవి, గాయకుడు, ప్రజావాగ్గేయకారుడు చింతల యాదగిరిని జాతీయ అవార్డు వరించింది. బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. యాదగిరి సాహిత్య రంగంలో చేసిన కృషికిగాను జాతీయ సాహిత్య రత్న అవార్డును ఈ నెల 15వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అందించనున్నారు. ఈ మేరకు అకాడమీ తరపున ఆయనకు ధ్రువీకరణపత్రాన్ని హైదరాబాదులో అందజేశారు. 33 ఏళ్ల కిందట బాల కార్మిక వ్యవస్థపై చింతల యాదగిరి రాసి పాడిన ‘నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో..’ అన్న పాట లక్షలాది మంది బాల కార్మికులను బడిబాట పట్టించింది. గడిచిన మూడు దశాబ్దాలుగా యాదగిరి తన పాటలతో సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను ఈ జాతీయ అవార్డు దక్కింది.
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్టు కొండేటి శీనయ్య అలియాస్ నివాస్ అనే యువకుడికి కూడా జాతీయ కళారత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. నివాస్ గ్రానైట్ ఫలకలపై చిత్రాలు చెక్కడంలో ప్రసిద్ధుడు. దేశవ్యాప్తంగా ఈ కళారంగానికి నివాస్ అందిస్తున్న సేవలకు ఆయనకు జాతీయ కళా రత్న అవార్డు ఇస్తున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందించింది. జిల్లాకు చెందిన ఇరువురికి జాతీయస్థాయి అవార్డులు రావడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 03 , 2024 | 12:32 AM