తరుగు పేరుతో కోతలు వద్దు
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:42 AM
జిల్లాలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైస్‌మిల్లుల వద్ద తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించవద్దని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వసతులు కల్పించాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
భువనగిరి కలెక్టరేట్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైస్‌మిల్లుల వద్ద తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించవద్దని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సమర్థంగా ధాన్యం కొనుగోలు జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. జిల్లాలో ప్రణాళికల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. దొడ్డురకం ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకరావొద్దన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద తరుగు పేరుతో కోతలు విధించవద్దని సూచించారు.
ధాన్యం నిల్వలకు కొరత లేదు
జిల్లాలో ధాన్యం నిల్వకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఐకేపీ, పీపీసీ సెంటర్లకు వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. కొంతవరకు తేమ శాతం ఉండడంతో మిల్లర్లతో సమావేశం నిర్వహించామన్నారు. తేమశాతం ఎక్కువ ఉన్న సెంటర్లలో నిల్వ ఉంచకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లాలో అవసరమైన స్టోరేజీ సామర్థ్యం ఉందని, ఎక్కడైన సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. మిల్లర్లనుంచి కూడా ఎలాంటి సమస్య లేదన్నారు. కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. వీరారెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వనజాత, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జగదీశ్ కుమార్, వ్యవసాయ అధికారి గోపాల్, మార్కెటింగ్ అధికారి సబిత పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 12:42 AM