ఓ బొజ్జ గణపయ్య విఘ్నాలు తీర్చయ్యా
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:38 AM
సకలవిఘ్నాలు తొలగించే గణేశుడి నవరాత్రి ఉత్సవాలు శనివారం మొదలవనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక అలంకరణలతో మండపాలు సిద్ధంకాగా, వివిధ రూపాల్లోని వినాయక విగ్రహాలను మండపాలకు తరలించారు.
ధాన్యపురాశులు గలగలలాడేలా చూడాలని కర్షకుల వేడుకోలు
మట్టిగణపతులే మహాగణపతుల ని పర్యావరణవేత్తల సూచనలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): సకలవిఘ్నాలు తొలగించే గణేశుడి నవరాత్రి ఉత్సవాలు శనివారం మొదలవనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక అలంకరణలతో మండపాలు సిద్ధంకాగా, వివిధ రూపాల్లోని వినాయక విగ్రహాలను మండపాలకు తరలించారు. శనివారం ఉదయం విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చల్లంగ చూడాలని, పలు కోర్కెల చిట్టాతో గణాధిపతుడిని వేడుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
ఇటీవల వరుణుడు కన్నెర్రజేయడంతో వరదలతో నష్టపోయిన తమను ఒడ్డున వేయాలని, ఈ ఏడాదైనా పంటలు పండి ధాన్యపురాశులతో గాదెలు నిండేలా కరుణించాలని అన్నదాతలు ప్రార్థిస్తున్నారు. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు దిగిరావాలని సామాన్యులు, మధ్యతరగతి జీవులు వేడుకుంటుండ గా, ప్రభుత్వాలు తమ మొర ఆలకించి వేతనాలు పెంచాలని, పీఆర్‌సీ ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అష్టకష్టాలు పడ్డామని, పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమకు గుర్తిం పు కలిగించేలా ప్రభుత్వ పెద్దల మనసు మారి పదవులిచ్చేలా విఘ్నేశుడు దయచూపాలని రాజకీయనేతలు వేడుకుంటున్నారు. ఈ ఏడాది కలిసివచ్చేలా ఆశీర్వదించాలని ప్రతిపక్షాల నాయకులు పూజించేందుకు సిద్ధమయ్యా రు. తొలి పూజలందుకునే గణేశుడుకి తమ మొర విన్నవిస్తే శుభఫలితం కలుగుతుందనే ఆశాభావంతో భక్తు లు ఈ గణేశ్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ధాన్యపురాశులు పండేలా ఆశీర్వదించు స్వామీ
కరువుతో గత ఏడాది వర్షా లు లేక, సాగునీరందక పంట లు ఎండి, వేసిన పైర్లు చేతికంద క నష్టపోయిన రైతాంగం ఈ ఏడాది పంటలు బాగా పండి, ధాన్యపురాశులు నిండేలా ఆశ్వీరించాలని కోరుకుంటోంది. ఇటీవల వర్షాల ప్రభావంతో ఏర్పడి న నష్టం నుంచి బయటపడేసి పంటలు చేతికందేలా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని రైతులు ప్రార్థిస్తున్నారు.
పదవుల యోగం కల్పించు స్వామి
గణేశుడి చల్లని చూపులతో పదవీయోగం కల్పించాలని పలువురు అధికారపార్టీ నేతలు ప్రార్థిస్తున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడామని, ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని, తమ కష్టాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించేలా విఘ్నేశ్వరుడు ప్రేరణ కల్పించి పదవీయోగం కల్పించాలని ఆశావహులు ప్రార్థన చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన ఫలితాలు దక్కించుకోలేకపోయామని, తమ కష్టాన్ని గుర్తించి ప్రజలు మద్దతుగా ఉండేలా ఆశీర్వదించాలని తొలి పూజలందుకునే గణేశుడిని ప్రతిపక్ష నాయకులు వేడుకుంటున్నారు.
చుక్కలనంటిన ధరలను తగ్గించు దేవా..
కూరగాయలు, వంటనూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో మూడుపూటలా కడుపునిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ ధరలను దించి గణేశుడు దయచూపాలని మధ్యతరగతి, సామాన్యులు వేడుకుంటున్నారు. చారెడు జీతం, బారె డు ఖర్చులతో జీవనం గడ్డుగా మారిన పరిస్థితుల నుంచి ఒడ్డున పడేయాలని కోరుతున్నారు.
కాలుష్యరహితంగా వేడుకలు నిర్వహించాలి
లోక కల్యాణం కోసం నిర్వహించే వినాయకచవితిని కాలుష్యరహితంగా నిర్వహించేలా ఏటా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. గణేశ్ విగ్రహాల ప్రతిష్ఠ లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) ప్రతిమల స్థానంలో మట్టిగణపతి విగ్రహాల ను ప్రతిష్ఠించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పలు స్వ చ్ఛంద సంస్థలు, జనవిజ్ఞానవేదిక లాంటి సంస్థలు మట్టివినాయకుల ఆవశ్యకత ను, పీవోపీ బొమ్మలతో ఏర్పడే కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నాయి. ప్రధానంగా పీవోపీ గణేశ్ ప్రతిమలతో నీటి కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుంద నే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే అంతంతమాత్రంగానే జలవనరులు ఉన్న జిల్లాలో పీవోపీతో తయారుచేసిన గణేశ్ ప్రతిమలు ఎంతో హానికరమైనవని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, సింథటిక్ కలర్స్‌తో చేసిన విగ్రహాలను చెరువు ల్లో, నదుల్లో కలపడం వల్ల (నిమజ్జనం చేయడం)ఆ జలాలు కలుషితమవుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా పీవోపీలో 300 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద జిప్సంను వేడి చేసి తయారు చేస్తారని, ఇది నీటిలో కలిసినప్పుడు మళ్లీ జిప్సంగా మారుతుందని, ఇది చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. మరోవైపు విగ్రహాలకు రంగులు వేస్తున్న కలర్‌లో విషపూరిత భారీ లోహాలుంటున్నాయని, ఇవి కూడా పర్యావరణానికి హాని చేస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు. పీవోపీ విగ్రహాల తయారీలో ఉపయోగించే కలర్‌లో జిప్సమ్, సల్ఫర్, పాస్ఫరస్, మెగ్నీషియం, మెర్క్యురీ, లెడ్, కాడ్మియమ్, ఆర్సెనిక్, కార్బన్, వంటి రసాయనాలతో క్యాన్సర్ సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినాయక విగ్రహాలను కాలుష్యరహిత బంకమట్టితో, సహజ రంగులైన పసుపు, కుంకుమ, గంధం, బియ్యంపొడితో తయారుచేసుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో సుమారు 3వేల విగ్రహాలు
భువనగిరి టౌన్: వినాయక చవితి సం దర్భంగా జిల్లాలో సుమారు 3వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. నవరాత్రు ల పేరిట నిర్వాహకులు సుమారు రూ.20కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు.
మట్టిగణపతే గట్టి గణపతి : కనుకుంట్ల విద్యాసాగర్, జనవిజ్ఞానవేదిక రాష్ట్రకమిటీ సభ్యుడు
వినాయక చవితిని కాలుష్యరహితంగా జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పీవోపీ, రసాయనాలుండే రంగులతో గణేశ్ బొమ్మలను ప్రతిష్ఠించడం, మళ్లీ వాటిని నీటిలో నిమజ్జనం చేస్తుండడంతో వాటి నుంచి వెలువడే రసాయనాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. ఇవి నీటిలో ఆక్సిజన్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో జలచరాలకు మనుగడ లేకుండాపోతోంది. అంతేగాక ఈ నీటిని వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు సోకుతాయి. అన్నివిధాలా హానికరం కాని మట్టి గణపతులను ప్రతిష్ఠించి గణేశ్ వేడుకలు నిర్వహించుకుంటే పర్యావరణానికి హితం కలుగుతుంది. వీలైనంత వరకు అన్ని గ్రామాల్లో ఒక్క మట్టిగణపతినే ప్రతిష్ఠించి పూజలు జరుపుకునే దిశగా యువత చైతన్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాం.
విఘ్నాలు తొలగించే వినాయకుడిని భక్తితో పూజించాలి : రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతీ ఏడాది మాదిరిగానే తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలన్నారు. ప్రతీ మండపంలో నిర్వహకులు భక్తి గీతాలను మాత్రమే పెట్టాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా : హనుమంతు కే.జెండగే, కలెక్టర్
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సంప్రదాయ రీతిలో నిర్వహించాలి. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. మండపాల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికసంస్థలు పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధచూపాలి. వర్షాలు కురుస్తున్నందున విద్యుదాఘాతం, తదితర ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలి.
శాంతియుతంగా నిర్వహించాలి : ఎం.రాజే్‌షచంద్ర, డీసీపీ
నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి. శాంతిభద్రతలకు భంగం కలిగించరాదు. నిర్వహణలో నిబంధనలను పాటించాలి. వదంతులను నమ్మకూడదు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతీ మండపంలో రాత్రి పూట తప్పనిసరిగా నిర్వాహకులు నిద్రించాలి. ప్రతీ మండపం యూనిట్‌గా భద్రత ఏర్పాటు చేస్తున్నాం. నిమజ్జనంలో డీజేలను నిషేదించాం. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తాం. ప్రతీ మండపం వివరాలను స్థానిక పోలీసులకు తెలపాలి.
Updated Date - Sep 07 , 2024 | 12:38 AM