ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:00 AM
ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేలా ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది.
రైతులకు రాయితీపై మొక్కల పంపిణీ
ఈ ఏడాది 2,500ఎకరాల విస్తీర్ణం లక్ష్యం
ఇప్పటివరకు 950 ఎకరాల్లో సాగు
పంట సాగుతో ఏటా రూ.73వేల ఆదాయం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేలా ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగుచేపట్టేలా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది జిల్లాలో 2,500ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగుచేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 950 ఎకరాలకు ప్రభుత్వం మొక్కలు మంజూరు చేసింది.
వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలతోపాటు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుకు రైతులను ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. ఉద్యానశాఖతో పాటు రాష్ట్ర సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ (టీఎస్ ఆయిల్‌ఫె డ్) అధికారులు రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో రెండేళ్లలో 3,500 ఎకరాల వరకు ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా ఈ పంట సాగును మరింత విస్తరించనున్నారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు మోత్కురు మండలం దత్తప్పగూడెంలో నర్సరీ కూడా ఏర్పాటుచేశారు. ఎకరాకు 57 మొక్కల చొప్పున నాటేందుకు 3.30లక్షలకు పైగా మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. ప్రస్తుతం సిరాడ్, ఎంఎల్-161 అనే రకాల మొక్కలు పెంచుతున్నారు. మండలాల వారీగా ఆసక్తి ఉన్న రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. చవుడు నేలలు తప్ప మిగతా అన్ని నేలలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలం. ఈ నేపథ్యంలో రైతుల భూములు పరిశీలించి, మొక్కలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,500ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నది లక్ష్యం కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 950ఎకరాల్లో సాగుకు మొక్కలు మంజూరు చేశారు.
ఆయిల్‌పామ్ సాగు ఇలా
ఉద్యాన పంటల్లో ముఖ్యమైనది ఆయిల్‌పామ్. ఈ పంట ద్వారా రైతులకు ఆదాయం కూడా ఎక్కువే. ఆయిల్‌పామ్ సాగుకు అనువైన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఈ పంట సాగుతో రైతులు సంవత్సరానికి నికరంగా రూ.73వేల ఆదాయాన్ని పొందవచ్చు. టేనేరా హైబ్రిడ్ ప్రపంచంలోనే అధికం గా పండించే ఏకైక వంగడం. ఏ కాలంలోనైనా మొక్కలు నాటుకోవచ్చు. నాటేందుకు 12-14నెలల వయసు కలిగి, 1 నుంచి 1.3మీటర్ల ఎత్తు, 13ఆకులతో కాండం, మొదలు మంచిగా ఉన్న మొక్కలను ఉపయోగించాలి. మొ క్కలు నాటేటప్పడు 9/9/9 మీటర్ల దూరంతో త్రికోణాకారంలో హెక్టారుకు 143, ఎకరాకు 57మొక్కలు వచ్చేట్టు నాటుకోవాలి. 60 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతు తీసిన గుంతల్లో వీటిని నాటాలి. ఆయిల్‌పామ్ పంటకు నెలకు 150 మి.మీ, ఏడాదికి, 1800- 3000 మి.మీ వర్షపాతం అవసరం. సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 22-24డిగ్రీల సెల్సియస్. సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 29-33 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఆయిల్‌ఫామ్ సాగుచేసుకోవచ్చు. సూర్యరశ్మి రోజుకు కనీసం ఐదుగంటలు ఉండాలి. దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం. కానీ, నీరు నిల్వని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రీయ పదార్థం కలిగి, నీరు తేలిక గా ఇంకే గుణం ఉండాలి. ఆయిల్‌పామ్ అధిక దిగుబడి ఇచ్చేందుకు సమృద్ధిగా సాగునీరు అవసరం. వేసవిలో కూడా పుష్కలంగా నీరు అందించే బోరుబావుల కింద సాగు చేయడం మేలు. ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో మూడు నుంచి నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చు. సీజన్ బట్టి పాదు ల్లో తగినంత తేమ ఉండేలా నీరు అందించాలి. నీటి కొరత వల్ల ఆకుల ఉత్పత్తి తగ్గి, పెరుగుదల సన్నగి లి, తదుపరి కాలంలో ఎక్కు వ మగ పుష్పాలు వచ్చి, తద్వారా దిగుబడి. తగ్గిపోతుంది. పాదుల్లో మురుగునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. మూడేళ్లు పైబడిన ఆయిల్‌పామ్ మొక్కలకు వర్షాకాలంలో దాదాపు 100-150 లీటర్లు, శీతాకాలంలో 160-170 లీట ర్లు, వేసవికాలంలో 215-265 లీటర్లు నీటిని ప్రతీ రోజు అందించాలి. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండి, వడగాల్పులు ఉంటే 300-350 లీటర్లు అందించాలి. డ్రిప్ విధానంలో సాగునీరు అందించడం ఉత్తమమైన పద్ధతి. ఒక్కో చెట్టుకు ఎరువులను మూడు నెలల వ్యవధితో మూడుసార్లు వేసుకోవాలి. మూడో సంవత్సరంలో సిఫార్సు చేసిన ఎరువులు వేయాలి. నాలుగో ఏడాది నుంచి ఎరువుల అవసరం ఉండదు. మొదటి దఫా ఎరువును నాటిన మూడు నెలల తర్వాత మాత్రమే వేయాలి. రెండో దఫా ఎరువులతో పాటు 50-100 కిలోగ్రామలు పశువుల ఎరువుల లేదా 100కిలో గ్రాముల పచ్చిరొట్ట వేయాలి. 5కిలోల వేపపిండి వేసుకోవాలి. కలుపు తీసిన పాదుల్లో చెట్టు మొదలు నుంచి రెండు అడుగుల దూరంలో పీచువేర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో పాదుచుట్టూ ఎరువులు చల్లి వెంటనే నీరు అందించాలి.
తప్పనున్న కోతుల బెడద
హైదరాబాద్ నగరానికి జిల్లా చేరువలో ఉన్నా ఇక్కడి రైతులు కూరగాయల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కోతులు బెడద అధికంగా ఉంది. కోతు లు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూరగాయ ల పంటల సాగకు రైతులు జంకుతున్నారు. అందుకే కోతుల బెడద లేని ఆయిల్‌పామ్‌కు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఈ పంట సాగులో తెగుళ్లు, చీడపీడలు చాలా తక్కువ. ప్రకృతి వైపరీత్యాలను సైతం సమర్థంగా తట్టుకుంటుంది. కోతు లు, అడవి పందులు బెడద కూడా ఉండదు. జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపురం, వలిగొండ, ఆత్మకూరు, గుండాల, రామన్నపేట, మోత్కురు తదితర మండలాల్లో రైతులు ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. అయితే అన్ని మండలాల్లో ఈ పంట సాగును విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రాయితీపై మొక్కల పంపిణీ
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాకు ఒక కోర్డినేటర్‌తో పాటు కొన్ని మండలాలకు కలిపి ఫీల్డ్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. ఆయిల్‌పామ్ పంటలో మొదటి మూడేళ్లు అంతర్ పంటగా కూరగాయలు, మొక్కజొన్న, వేరుశనగ, అరటి, జామ, బొప్పాయి సాగుచేయవచ్చు. అందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇంపోర్టెడ్ ఆయిల్‌పామ్ మొక్కలైతే ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.193 చొప్పున, ప్రభుత్వం హెక్టారుకు 150 మొక్కలకు రూ.29,000 రాయితీ ఇస్తోంది. ఒక్కో మొక్కకు రైతు వాటా కింద రూ.20 డీహెచ్‌ఎ్‌సవో పేరున డీడీ తీయాలి. తోటల నిర్వహణకు మొదటి నాలుగేళ్లు ఎకరాకు ప్రభుత్వం రూ.5,250చొప్పున రాయితీ ఇస్తుంది. అదేవిధంగా అంతర్ పంటల కోసం మొదటి నాలుగేళ్లు హెక్టారుకు రూ.4200 చొప్పున రాయితీ ఇస్తుంది. బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఉంది. ఆసక్తి ఉన్న రైతులు జిల్లా ఉద్యాన, ఆయిల్‌ఫెడ్‌శాఖ అధికారులను సంప్రదించాలి.
కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుచేసిన ఆయిల్‌పామ్ దిగుబడిని స్థానికంగా మార్కెటింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో, 5-9 ఏళ్ల వయసు ఉన్న తోటల నుంచి సాలీనా హెక్టారుకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. వచ్చే ఐదేళ్లలో పెద్ద మొత్తంలో ఆయిల్‌పామ్ దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సుదూర ప్రాం తాల్లో ఉన్న కంపెనీలకు తరలించాలంటే రైతులపై రవాణా భారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వలిగొండ, రామన్నపేట మండలాల్లో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పామాయిల్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం యోచించింది. తాజాగా, ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కంపెనీని ఏ ప్రాంతంలో ఏర్పాటుచేస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
రైతులకు అవగాహన
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ సాగు ద్వారా రైతులకు వచ్చే దిగుబడి, నికర ఆదాయాన్ని వివరిస్తున్నాం. జిల్లాలో ఈ ఏడాది 2,500ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. ఇప్పటివరకు 950 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతులు ఇచ్చాం. ఈ పంట సాగుకు ముందుకొచ్చే రైతులను ప్రొత్సహించి, మొక్కలు పంపిణీ చేస్తాం. ఆయిల్‌పామ్ గెలల కొనుగోలులో దళారీ వ్యవస్థ లేదు. నేరుగా ప్రభుత్వరంగసంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. మొక్కల పెంపకానికి, అంతర్‌పంటల కోసం ప్రభుత్వం నాలుగేళ్లు రాయితీలు కల్పిస్తుంది. రైతులకు డ్రిప్ సౌకర్యం కోసం రాయితీ కూడా ఉంది.
Updated Date - Nov 15 , 2024 | 01:00 AM