ప్రజాపాలన.. ప్రగతి బాటన
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:54 AM
తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్‌ఎస్ రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. స్వరాష్ట్రంలో మూడోసారి హాట్రిక్ కొట్టాలని ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డింది. 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపాలైంది.
ఏడాది ప్రజా పాలనలో ఒక్కో అడుగు ముందుకు
రాజకీయంగా భువనగిరిపై‘చేయి’
మూసీ ప్రక్షాళనకు పూనుకున్న సీఎం
ఆలయ అభివృద్ధిపై దృష్టి
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి) : తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్‌ఎస్ రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. స్వరాష్ట్రంలో మూడోసారి హాట్రిక్ కొట్టాలని ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డింది. 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరించింది. జిల్లాలోని రెండు ని యోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపొందా రు. భువనగిరి నుంచి 40 ఏళ్ల తరువాత కాంగ్రెస్ అభ్యర్థి కుం భం అనిల్‌కుమార్‌రెడ్డి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఆలేరు సైతం హస్తగతమైంది. ప్రజాపాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుండగా, హామీల మేరకు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షల వరకు పెంపు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుల రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియమకాలు, ఉద్యోగుల బదిలీలు వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కుల గణనకు సైతం శ్రీకారం చుట్టింది.
అవిశ్వాసాలకు తెర.. పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసానికి తెరలేపింది. బీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరగా, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మునిసిపాలిటీల్లో అవిశ్వాసం లేకుండా పోయింది. భువనగిరి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గి కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఆలేరు చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస మాత్రం వీగింది. ఇక పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 31తో ముగియగా, గ్రామీణంలో ప్రత్యే అధికారుల పాలన మొదలైంది. జిల్లాలో మొత్తం 421 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అదేవిధంగా ఈ ఏడాది జూలై 4తో మండల ప్రజా పరిషత్, జూలై 5తో జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసింది. వీటికి సైతం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ హామీ.. దేవుళ్ల యాత్రతో రాజకీయ దుమారం
సార్వత్రిక ఎన్నికలకు ఈ ఏడాది ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కాగా, ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 21న గుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తానని, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నానని ప్రకటించారు. అదేవిధంగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. పంట రుణమాఫీపై మాజీ మంత్రి హరీ్‌షరావు చేపట్టిన దేవుళ్ల యాత్రతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలైంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి రైతులను మోసం చేశారని, పాపపరిహారం కల్పించాలని లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఓ పూజారితో పూజలు చేయించడం రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీ్‌షరావుతోపాటు పలువురిపై పోలీసు కేసులు నమోదైంది. బీఆర్‌ఎస్ నేతలు ఆలయాన్ని అపవిత్రం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆలయ శుద్ధి నిర్వహించారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపైనా కేసులు నమోదయ్యాయి.
సీఎం మూసీ బాట
మూసీ ప్రక్షాళనకు పూనుకున్న ప్రభుత్వం అందులో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, సంగెం శివన్న సంకల్పం తీసుకుని మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వలిగొండ మండలం సంగెం బ్రిడ్డి నుంచి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర నిర్వహించి మూసీ ప్రక్షాళన ఆవశ్యకతను వివరించారు. వివిధ కులవృత్తులు, రైతులతో మమేకం అయ్యారు. మూసీ ఉప్పొంగినప్పుడు సంగెం-వలిగొండ, జూలూరు-పెద్దరావులపల్లి అండర్ బ్రిడ్జిలు మునుగుతుండటంతో ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా మూసీ నది ఒడ్డున వెలసిన భీమలిగం శివన్నను దర్శించుకునేలా ఇక్కడ పనులు నిర్వహించేందుకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గుట్టపైకి ఆటోలు
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన 2022 మార్చి 28న జరగ్గా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొండపైకి ప్రైవేట్ వాహనాల అనుమతిని రద్దు చేస్తూ దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో కార్మికులు రెండేళ్లపా టు వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. దీని పై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇవ్వగా,అధికారంలోకి రాగానే కొండపైకి పలు నిబంధనలతో ఆటోలను అనుమతించారు.
బంగారం తాపడం పనులు షురూ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి. బంగారం తాపడం మొత్తం 10వేల చదరపు అడుగులు చేపట్టాల్సి ఉండగా, 60కిలోల బంగారం అవరసం. విరాళా ల ద్వారా 10.500కిలోలు, రూ.20కోట్లతో 26కిలోలు, దేవస్థానానికి చెందిన 13కి లోల గోల్డ్‌బాండ్స్, దేవస్థానం వద్ద ఉన్న 2కిలోల బంగారం, 776కిలోల వెండి బంగారం తాపడం కోసం వినియోగించారు. అదేవిధంగా భక్తులు విరాళాల ద్వారా ఇచ్చిన నగదును వినియోగించేలా సెప్టెంబరు 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
‘గిరిప్రదక్షిణ’ ప్రారంభం
గుట్టలో 2016 వరకు గిరిప్రదక్షిణ ఉంది. ఆ తరువాత ఆలయ పునర్నిర్మాణ పనులతో గిరిప్రదక్షిణకు ఆటంకం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది జూన్ 15 నుంచి గిరి ప్రదక్షిణను అమలు చేస్తోంది. గుట్ట చుట్టూ 2.5కిలోమీటర్ల మేరకు అందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా సంప్రదాయ దుస్తులు(డ్రె్‌సకోడ్)ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం 2023 డిసెంబరు 28న శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈ ఏడాది జనవరి 6వరకు దరఖాస్తులు తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,18,807 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 14 కేంద్రాలు, 17 మండలాల్లో 37 కేంద్రాలు ఏర్పాటుచేసి 51 బృందాలతో దరఖాస్తులు స్వీకరించారు. అందుకు జిల్లాలో 1,961 కౌంటర్లను ఏర్పాటుచేశారు. ప్రతీ రోజు రెండు షిఫ్టుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులు తీసుకున్నారు.
ట్రిపుల్‌ఆర్ స్పీడప్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తలపెట్టిన రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణం వేగవంతమైంది. ఉత్తరభాగం నిర్మాణంలో భాగంగా జిల్లాలో 1,900 ఎకరాల భూసేకరణకు అధికారులు సర్వే నిర్వహించి, హద్దురాళ్లు సైతం నాటారు. ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ ప్రకారం ఉత్తరభాగం మొత్తం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 19మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా వెళ్తోంది. అదేవిధంగా జిల్లాలో 34 గ్రామాల మీదుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ ఏర్పాటును ఎన్‌హెచ్‌ఏ అధికారులు పరిశీలిస్తున్నారు.
‘గంధమల’్ల కుదింపు
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణ సామర్థ్యాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వాయర్ నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. రిజర్వాయర్‌ను తొలుత 9.8 టీఎంసీలుగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు 232 ఎకరాల అటవీ భూమిని సేకరించింది. పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలకు 4,162ఎకరాల భూమి అవసరం కాగా, రిజర్వాయర్ వల్ల 4,027ఎకరాల భూమితో పాటు 1,568ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేయడంతో 4.28టీఎంసీలకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించారు. వీరారెడ్డిపల్లిని ముంపు నుంచి తప్పించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతిపాదనల్లో గంధమల్ల ముంపు గ్రామంగా ఉండగా, తాజాగా ప్రభుత్వం 1.5టీఎంసీల సామార్థ్యానికి తగ్గించడంతో ముంపు లేకుండా భూసేకరణ 1,000 ఎకరాలకు పరిమితమైంది.
పరిహారం చెల్లింపు.. పునరావాస జాప్యం
నృసింహసాగర్(బస్వాపూర్) రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు పరిహారంతో పాటు పునరావాసం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో భువనగిరి మండలంలోని బీఎన్.తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీనాయకుడితండా, చొంగల్‌నాయకుడితండా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. వీరికి పరిహారంతో పాటు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు రిజర్వాయర్ కట్టపై నిరసన దీక్షలు కూడా చేపట్టారు. బీఎన్.తిమ్మాపూర్ నిర్వాసితుల కోసం భువనగిరి మండలంలోని హుస్సేనాబాద్‌లోని సర్వేనెంబర్ 107లో గల 95ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 95ఎకరాల్లో లేఅవుట్‌లో రోడ్లు, ఇళ్లస్థలాలు, పార్కులు, సామాజిక అవసరాల కోసం ప్లాన్ సిద్ధం చేసి, అభివృద్ధి చేపట్టారు. ప్లాట్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. అందుకు ఇంకా రూ.42కోట్లు అవసరం. లక్ష్మీనాయకుడితండా, చొంగల్ నాయకుడితండా నిర్వాసితులకు దాతర్‌పల్లిలోని సర్వేనెంబర్ 297లో ప్రభుత్వం పునరావాసం చేపట్టాల్సి ఉంది.
ఊర్లు ఖాళీ చేస్తేనే రిజర్వాయర్‌లోకి నీరు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్‌లో నృసింహసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తోంది.16వ ప్యాకేజీ కింద ఆయకట్టు, సాగు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల కోసం ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 11.39 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్‌ను...7టీఎంసీల సామ ర్ధ్యం వరకు పనులు పూర్తి చేశారు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణంతో బీఎన్.తిమ్మాపూర్, లక్ష్మీనాయకుడి తండా, చొంగల్ నాయకుడి తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. రిజర్వాయర్‌లోకి నీరు మళ్లించిన పక్షంలో ఈ గ్రామాలు ముంపుకు గురికానున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్‌లోకి నీరును వదిలలేని పరిస్థితి నెలకొంది.
నిధుల వేటలో ఎమ్మెల్యేలు
జిల్లాలో బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్, దేవాదుల ఎత్తిపోతల పథకం, తపా్‌సపల్లితో పాటు, పలు కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. సాగునీటి పరంగా చేపట్టాల్సిన పనులకు రూ.కోట్లలో చెల్లింపులు చేయాల్సి ఉంది. బస్వాపూర్ రిజర్వాయర్‌తో పాటు పలుచోట్ల ప్రధాన కాల్వల పనులు చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా నూతనంగా పలు పనులు చేపట్టాల్సి ఉంది. అందుకోసం నిధులకు ఎమ్మెల్యేలు మంత్రులు, సీఎంకు విన్నవిస్తున్నారు.
గుట్టలో పాత ఆచారాల పునరుద్ధరణ
స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కొండపై ప్రభుత్వం పాత ఆచారాలను పునరుద్ధరించింది. 2022 మార్చి 28న ఆలయ ఉద్ఘాటన అనంతరం కొండపై పాత ఆచారాలను గత ప్రభుత్వం పక్కనపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల స్వామివారి సన్నిధిలో టెంకాయ కొట్టేస్థలాన్ని, విష్ణుపుష్కరిణిలో భక్తులకు స్నానాలు చేసేందుకు అనుమతిని ఇచ్చింది. రాత్రి వేళ భక్తులు నిద్ర చేసేందుకు క్యూ కాంప్లెక్స్‌లో గతంలో శివాలయం(తాత్కాలికంగా) ఉన్న స్థలంలో డార్మెటరీ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి 11న స్వామివారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం హాజరవ్వగా, ఆయనకు చిన్న పీట వేశారని దుమారం రేగింది. దీంతో ప్రొటోకాల్ వివాదం ఏర్పడగా, ఒకే సైజు మరో 10 పీటలను ఆలయ అధికారులు కొనుగోలు చేశారు. ఆ తరువాత అప్పటి వరకు ఇన్‌చార్జి ఈవోగా కొనసాగుతున్న రామకృష్ణారావుపై బదిలీ వేటు వేసి ఆయన స్థానంలో భాస్కర్‌రావును ప్రభు త్వం నియమించింది.
టీటీడీ తరహాలో పాలకమండలి
లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిపాలనా విధానాన్ని మార్చాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యోచించినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, భక్తులకు పలు సౌకర్యాలు కల్పించడంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Dec 03 , 2024 | 12:54 AM