నాటక సాహిత్యంపై పరిశోధనలు పెరగాలి
ABN, Publish Date - Mar 27 , 2024 | 11:38 PM
నాటక సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండు రోజుల తెలుగు నాటకం - సాహిత్య సమాలోచన అనే అంశంపై తొలిరోజు నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సాహిత్య పరిశోధకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి
నల్లగొండ కల్చరల్, మార్చి 27: నాటక సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండు రోజుల తెలుగు నాటకం - సాహిత్య సమాలోచన అనే అంశంపై తొలిరోజు నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటక సాహిత్యంపై పరిశోధనలు జరగడం లేదని, ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించేలా ఉంటాయన్నారు. విద్యార్థులను పరిశోధకులుగా, సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు. చాలామంది నాటక రచయితల రచనలు నేటి సాహిత్య లోకానికి అందడం లేదన్నారు. అలాంటివారి సాహిత్యాన్ని వెలికితీసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కార గ్రహీత డాక్టర్ ఎం.పురుషోత్తమచార్యులు మాట్లాడుతూ నాటక రచయితతో పాటు నటులు, నాటక ప్రయోక్తలందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ నాటకం జనరంజకం అవుతుందన్నారు. రమ్యమైన దృశ్య కావ్యమని ఇలాంటి కావ్యాలు రాసిన రచయితలు తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య సాగీ కమలాకర్‌శర్మ మాట్లాడుతూ నాటకరంగం మనోరంజకమైనదని నేడు సినిమాల ప్రభావంతో నాటకరంగ సంస్థలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటక సంస్థలను, నటులను ఆదరించాల్సిన అవసరం నేటి ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కర్మిల్ల లావణ్య, తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ కౌండిన్య, ఎన్.లవేందర్‌రెడ్డి, వెల్దండి శ్రీధర్, గోవర్ధన గిరి, సైదులు, ప్రభాకర్, లింగస్వామి, రమ్య, అంజయ్య, దుర్గాప్రసాద్‌లతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Mar 27 , 2024 | 11:38 PM