టెన్షన్... టెన్షన్...
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:37 AM
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్ర మ ఏర్పాటుపై రామన్నపేటలో బుధవారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనలు, నిరసనల మధ్య ముగిసింది.
ఉద్రిక్తత నడుమ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ
అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
సబ్ కోర్టు నిర్మాణం చేసే వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ చేపట్టొద్దు
వేదిక ముందు అఖిలపక్షాల ధర్నా
(ఆంధ్రజ్యోతి,రామన్నపేట): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్ర మ ఏర్పాటుపై రామన్నపేటలో బుధవారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనలు, నిరసనల మధ్య ముగిసింది. రామన్నపేట సమీపంలో 63.8ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అంబుజా కంపెనీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పరిశ్రమ ఏర్పాటుపై బుధవారం రామన్నపేటలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించింది. అదనపు కలెక్టర్ బెన్‌షోలోమ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి జిల్లా అధికారి సంగీత హాజరయ్యారు. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ, సిమెంట్ ఫ్యాక్టరీ గోబ్యాక్ అంటూ పెద్దఎత్తున ప్రజలు నినాదాలు చేశారు. ఆందోళనకారులు అంబుజా గోబ్యాక్, అంబుజా వద్దురా..! రామన్నపేట ముద్దురా అంటూ రామన్నపేట, సిరిపురం, కొమ్మాయిగూడెం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు, ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆందోళన చేపడుతున్న ప్రజల వద్దకు వచ్చి మీ అభిప్రాయాలను సభా ప్రాంగణంలో తెలియజేయాలని సూచించడంతో ఆందోళనకారులు ఒక్కొక్కరుగా వెళ్లి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డ్రైపోర్ట్ పేరుతో రైతులను మోసం చేసి 350 ఎకరాల పచ్చని వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని, ఇప్పుడు కాలుష్య ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబ్ కోర్టు ఏర్పాటు స్థల సమీపంలో ఏర్పాటు చేయవద్దు ..
ఇటీవల రామన్నపేటకు సబ్ కోర్టు మంజూరైందని పరిశ్రమకు అతి సమీపంలోనే కోర్టుకు కేటాయించిన భూమి ఉందని త్వరలోనే కోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అదనపు కల్టెర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వివిధ మండలాల నుంచి వచ్చే కక్షిదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు ఫ్యాక్టరీ అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అవసరమైతే ఈ విషయంపై హైకోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిపారు.
నిరసన సభకు అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కాలుష్య కారక సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే చేతి, కుల వృత్తులు, వ్యవసాయం తదితర పనులు పూర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వేదిక ఎదుట అఖిలపక్షాల ధర్నా
ప్రజాభిప్రాయ సేకరణ కంటే ముందు వేదిక వద్ద అఖిలపక్ష నాయకులు, రైతులు, ప్రజలు ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీ లు ధరించి, ప్లకార్డుతో అంబుజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వివిధ గ్రామాల ఉంచి మహిళలు స్వచ్ఛందంగా ట్రాక్టర్లపై తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలపై యు వకులు, రైతులు సుమారుగా 3 వేల మంది హాజరయ్యారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ బెన్ షోలోమ్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని ఈ సభలో ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, ఆమో దం మేరకే ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతిస్తామ ని చెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రాంగణంలో అంబుజా ఫ్యాక్ట రీ వారు మంచినీరు, భోజన సౌకర్యం ఏర్పాటు చేసినా మాపిల్లల భవిష్యత్తు నాశనంచేసే ఈ ఫ్యాక్టరీ కనీసం నీరు కూడా తాగమని పేర్కొంటూ వెనుతిరిగి వెళ్లారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు పా ల్గొని నిరసన వ్యక్తం చేశారు. కాలుష్య కారక సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే చేతి, కుల వృత్తులు, వ్యవసాయం తదితర పనులు పూర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదనపు కలెక్టర్ కాన్వాయిని అడ్డుకున్న ప్రజలు
ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన సభలో సభ లో ముక్తకంఠంతో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయవద్దని అభిప్రాయం తెలిపారు. అయితే ప్ర జాభిప్రాయ సేకరణకు హాజరైన అదనపు కలెక్టర్ త మ అభిప్రాయం ప్రకటించకుండా వేదిక నుంచి వెళ్తుండగా ప్రజలు ఆయన కాన్వాయిని అడ్డగించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ పి.మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ లాల్ బహద్దూర్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మల్లయ్య, అఖిలపక్షాల నాయకులు ఎండీ జహంగీర్, మేక అశోక్‌రెడ్డి, సిరిగిరెడ్డి మల్లారెడ్డి, కల్లూరి మల్లేశం, జినుకల ప్రభాకర్, పూస బాలకిషన్, గంగుల రాజిరెడ్డి, ఎండి రేహన్, పెంటయ్య, నర్సింహ, గాదె శోభారాణి, గోదాసు శిరీష, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేటలో బంద్
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ బుధవారం రామన్నపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు, హోటళ్లు, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ కార్యక్రమం అనంతరం దుకాణాలు తెరిచారు. నెల రోజులుగా సిమెం ట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని వివిధ రూపాల్లో ప్ర జలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మోత్కూరుకు మాజీ ఎంపీ తరలింపు
మోత్కూరు: రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పట్టణం వెలుపలే అరెస్టు మోత్కూరు పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలిసి బీఆర్‌ఎ స్ మండల నాయకులు పోలీ్‌సస్టేషన్ వెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల సుమారు పదిహేను గ్రామాల ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కిశల్యమవుతామని ఆందోళన వ్య క్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని గొంతు చించుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పకుండా అరెస్టు చేయించడమేమిటని ఆయన ప్రశ్నించారు. రెండు, మూడు గంటల పాటు ఆయన్ను మో త్కూరు పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రమేష్, జంగ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పిచ్చయ్య, నాయకులు కొండ సోంమల్లు, మర్రి అనిల్‌కుమార్, పరమేష్, విద్యాసాగర్, శోభన్‌బాబు, శ్రీను, ఇంద్రశేఖర్, నరేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమను ఆపకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం : చిరుమర్తి
చిట్యాలరూరల్: రామన్నపేట శి వారులో ప్రజలకు ఇబ్బందులు కలి గే సిమెంటు పరిశ్రమను ప్రభుత్వం ఆపకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హె చ్చరించారు. నల్లగొండ జిల్లా చిట్యా ల మండలం వట్టిమర్తి శివారులో హోటల్ వద్ద మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్న నార్కట్‌పల్లి సీఐ, చిట్యాల, నార్కట్‌పల్లి ఎస్‌ఐలు పోలీసు సిబ్బందితో అడ్డుకుని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు, ఎస్‌ఐలు ధర్మా, క్రాంతికుమార్, సిబ్బంది కలిసి చిరుమర్తి లింగయ్యను ఎత్తుకుని పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ అభిప్రాయాన్ని చెప్పేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అనంతరం ఆయన్ను నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
Updated Date - Oct 24 , 2024 | 01:37 AM