నకిలీల మాయాజాలం
ABN, Publish Date - Oct 18 , 2024 | 01:03 AM
మార్కెట్‌లో లభిస్తున్న వాటిలో అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోలేని పరిస్థితి దాపురించింది.
మార్కెట్‌లో లభిస్తున్న వాటిలో అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోలేని పరిస్థితి దాపురించింది. దేశాని కి వెన్నముకగా ఉన్న వ్యవసాయ రంగం నేడు నకిలీల ముప్పును ఎదుర్కొంటోంది. పంటల సాగులో ప్రధాన భూమిక పోషించే రసాయన మందులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్లో నకిలీ మందులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ డుబ్లికేట్ దందా చేస్తున్న వ్యాపారులు లాభాలు గడిస్తుంటే, పంట సాగులో నిరంతరం శ్రమిస్తున్న రైతులు ఆర్థికంగా ఆర్థికంగా చితికిపోతున్నారు.
- ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ(వ్యవసాయం)
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఖరీదైన మందు ల పేరుతో నకిలీ మందులు రాజ్యమేలుతున్నా యి. లీటర్ రెండు వేల నుంచి ఆపై ధరలు ఉన్న రసాయన మందుల కంపెనీ లేబుళ్లు, డబ్బాలతో సహా నకిలీలను తయారు చేస్తున్నారు. అసలు, నకిలీలను గుర్తించే బార్‌కోడ్‌లను కూడా గుర్తించలేనంతగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ రైతులు వీటిని గుర్తించే అవకా శం లేదు. రెండు రోజుల కిందట నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ ఫెస్టిసైడ్ దుకాణంలో ప్రముఖ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ దోమ మందులను ఓ రైతు కొనుగోలు చేశాడు. ఆ మందుపై అనుమానంతో కంపెనీ ప్రతినిధుల ను సంప్రదించాడు. వారు అవి నకిలీవని తేల్చి అధికారులకు ఫిర్యాదు చేశారు.
తక్కువ ధరకు విక్రయిస్తూ
ప్రధాన కంపెనీ మందు ధర రూ.5 వేలు ఉండగా నకిలీ మందులు రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. తక్కువ ధర వస్తుందనే ఆలోచనతో రైతులు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన కంపెనీల మందులు విక్రయిస్తే దుకాణదారులకు మిగులు పాటు నామమాత్రంగా ఉంటుంది. నకిలీలు విక్రయిస్తే 50 శాతం లాభం ఉంటుంది. దీంతో చాలామంది వ్యాపారులు ఏళ్ల తరబడి నకిలీల విక్రయాలకు చేపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతిపెద్ద మార్కెట్ అయిన మిర్యాలగూడ పట్టణంతో పాటు సాగర్ నియోజకవర్గం, హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో వ్యాపారులు నకిలీల మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
సరిహద్దులో ఉండటంతో..
నకిలీ మందులు గుంటూరు కేంద్రంగా తయారు చేస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉంటాయి. దీంతో అక్కడి నుంచే అన్నిరకాల నకిలీ మందులు దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలో పంటల సాగు ఉండటం వ్యాపారులకు వరంగా మారింది. ఏళ్ల తరబడి నకిలీల దందా సాగిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతు అన్నదాతలను ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. అయినప్పటికీ వ్యాపారులను అడ్డుకునే వారే కరవయ్యారు. రైతులు గుర్తించి కంపెనీల ప్రతినిధులకు ఫిర్యాదు చేస్తే తప్ప నకిలీలపై వ్యవసాయాధికారుల పర్యవేక్షణ కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయో మందులకు అడ్డేలేదు
నకిలీ మందుల తరువాత ప్రధానంగా మార్కెట్‌ను శాసించేది బయో మందులు. వందలాది కంపెనీలు బయో మందులు పేరుతో మాయాజా లం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా రసాయనా లు లేకుండా కేవలం పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని సహజ సిద్ధమైన వాటి నుంచే(సముద్రపు నాచు తదితరాలు) ఈ బయో మందులు తయారు చేయాలి. కానీ, మార్కెట్లోకి లభించే మందులు మాత్రం పూర్తిగా ప్రమాదకర రసాయనాలు మిళితం చేసినవి వస్తున్నాయి. డబ్బాలపై మాత్రం అందమైన రంగులతో తీర్చిదిద్ది ఉంటాయి. అసలు రసాయనికి కంపెనీల కన్నా ఈ బయో మందులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా బయోమందులు తయారు వ్యవహరం చాలా ఖరీదైంది. కానీ చాలా తక్కువ ధరకు ఏవిధంగా విక్రయిస్తున్నారో వ్యాపారులు కూడా చెప్పలేకపోతున్నారు. పెద్ద రసాయనిక కంపెనీల్లో కాలం పూర్తయిన రసాయనాలను వేలం పాట వేస్తుంటారు.. ఈ బయో కంపెనీలు ఆ సరుకును తక్కువకు కొనుగోలు చేసి బయోమందులు తయారు చేస్తుంటారని వ్యవసాయ నిపుణులు చెపుతున్నారు.
ఈ బయో మందులు ప్రతీ ఫెస్టిసైడ్ దుకాణంలో విరివిరిగా లభిస్తుంటాయి. ఎక్కువ లాభా లు వస్తుండటంతో వీటినే ఎక్కువగా విక్రయిస్తుంటారు. దీంతో పాటు వ్యాపారులకు కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఉచి తం. ధరలో సగం మిగులు ఉండటంతో పాటు విదేశీ పర్యటనకు తీసుకెళ్తుంటాయి. దీంతో వ్యా పారులు వీటినే ఎక్కువగా విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్‌లో బయోలకు డిమాండ్ ఉండేలా వ్యాపారులు ప్రచారం కల్పిస్తుండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పంటలకు తీవ్ర నష్టం
నకీలీ, బయో మందుల పిచికారీతో పంటలతో పాటు పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నకిలీ మందులు పిచికారీ చేయడం వల్ల అవి పనిచేయక పోగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయో మందులు వాడకంతో పంట తాత్కాలికంగా పచ్చగా అందంగా మారుతుంది, కారణ ం వాటిలో కలిపే నైట్రోబెంజియట్, జిబ్బరిల్లిక్‌యాసిడ్ అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అయితే పంటలో కొద్ది రోజులకే రోగనిరోధక శక్తి తగ్గి తెగుళ్ల ప్రభావం అధికమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో పాటు గింజ నాణ్యతలోనూ లోపాలు ఉంటాయన్నారు.
పర్యవేక్షణ కరువు
మార్కెట్లో నకిలీ పురుగుమందులు దందా సాగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. నకిలీలు ఎక్కడైనా పట్టుబడితే తప్ప దుకాణాలపై అధికారుల నిరంతర పర్యవేక్షణ కరువైందంటున్నారు. నకిలీ, బయయోలతో రైతులు దగాపడుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వం నకిలీలు, బయో మందులపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Updated Date - Oct 18 , 2024 | 01:03 AM