అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ABN, Publish Date - May 14 , 2024 | 12:34 AM
చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. కాం టాలు వేసిన 2,500 ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిసిపోయాయి.
ఆరబెట్టుకుంటున్న రైతులు
పాక్షికంగా తడిసిన 2,500 బస్తాలు
చౌటుప్పల్ టౌన్, మే 13: చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశుల కిందకు నీరు చేరింది. కాం టాలు వేసిన 2,500 ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిసిపోయాయి. యార్డులో వందకు పైగా ధాన్యం రాశులు ఉన్నాయి. సీసీ కళ్లంపై పోసిన ధాన్యం రాశుల కిందకు మాత్రమే నీరు చేరింది. ఆకాశం మేఘావృతమవుతుండడంతో ధాన్యం రాశులను ఆరబెట్టేందుకు రైతులు ముందుకు రాలేదు. ఒకరిద్దరు రైతులు మాత్రమే ధాన్యం రాశులను ఆరబెట్టడం కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉండడంతో గ్రామాల నుంచి రైతులు కూడా మార్కెట్ యార్డుకు రాలేకపోయారు. అందులోనూ సోమవారం ఎన్నికల సెలవు ఉండడంతో ధాన్యం తూకాలు వేయలేదు. మంగళవారం నుంచి తూకాలు ప్రారంభం కానున్నాయని పీఏసీఎస్ సెక్రటరీ వై.రమేష్ తెలిపారు. కాగా, మార్కెట్ యార్డులో గత నెల రోజుల్లో 150 మంది రైతుల నుంచి 15వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కాంటాలు వేశారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
భూదాన్‌పోచంపల్లి కనుముకులలో రైతుల ధర్నా
భూదాన్‌పోచంపల్లి, మే 13: అకాల వర్షానికి తడిసిన ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కనుముకుల కేంద్రంలోని 250 బస్తాల ధాన్యం తడిసిపోవడంతో రైతులు నిరసన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ ధర్నా నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ధర్నా చేయటంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి వచ్చి వారితో మాట్లాడారు. లారీ డ్రైవర్స్ యూనియన్ సమ్మెలో ఉండడంతో లారీలు రావడంలేదని, అయినప్పటికీ తన వంతుగా ప్రత్యామ్నాయంగా నాలుగు లారీలతో ధాన్యం లిఫ్ట్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, ఎస్‌ఐ బాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
Updated Date - May 14 , 2024 | 12:34 AM