నిరుపయోగంగా పునరావాస కేంద్రం
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:20 AM
పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది.
కంపచెట్లతో నిండిన కాలనీ
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు
మఠంపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మట్టపల్లి, సుల్తానపురం, గుండ్లపల్లి గ్రామాలను ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి వారికి వేర్వేరు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో గుండ్లపల్లి, సుల్తానపురం తండాల వారికి కేటాయించిన స్థలాల్లో నిర్వాసితులు తరలివెళ్లారు. కానీ మట్టపల్లి గ్రామాల వారికి కేటాయించిన పునరావాస కేంద్రం మాత్రం నిరుపయోగంగా మారింది. అన్నిఏర్పాట్లు చేసినా నిర్వాసితుల్లో ఏ ఒక్కరూ ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో కంపచెట్లు పెరిగి, అందులో నిర్వాసితుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమయ్యాయి.
వద్దంటున్నా కేటాయింపుల వల్లే..
నిర్వాసితుల గుర్తింపు సమయంలోనే మట్టపల్లి గ్రామం మొత్తాన్ని ముంపుగా తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అయినప్పటికీ గ్రామంలో మొత్తం 250 ఇళ్లు ఉండగా, అధికారులు 129 ఇళ్లను మాత్రమే నిర్వాసితులుగా గుర్తించారు. అయితే నిర్వాసితులందరూ ఏకతాటిపై ఉండి గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలని పట్టుబట్టారు. అయితే మట్టపల్లి నిర్వాసితుల కోసం మండలంలోని పెద్దవీడు రెవెన్యూ పరిధిలోని 540, 541 సర్వే నెంబర్లలోని మట్టపల్లి- హుజూర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన 15 ఎకరాలను ప్రభుత్వం సేకరించి ఇళ్ల కోసం ప్లాట్లను చేసి నిర్వాసితులకు కేటాయించింది. ఈ కేంద్రంలో సీసీరోడ్డు, వాటర్ ట్యాంకు, పాఠశాల భవనం, కమ్యూనిటీ భవనం తదితర నిర్మాణాలను చేపట్టారు. అయితే ఇంటి ప్లాట్ల పత్రాలు మాత్రమే తీసుకున్న నిర్వాసితులు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన పరిహారాన్ని తీసుకోలేదు. దీంతో ఏ ఒక్కరూ పునరావాస కేంద్రంలో నిర్మాణాలు చేపట్టలేదు.
గ్రామస్థుల ప్రతిపాదనతో
మట్టపల్లి నిర్వాసితులు తమకు కేటాయించిన కేంద్రం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని, తమకు మట్టపల్లి గ్రామానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో నిర్వాసితుల ఇళ్లలోకి నీరు చేరడంతో కొందరు స్థానికంగా అద్దెకు ఉంటుండగా, మరికొందరు గ్రామంలోనే మరోచోట ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. తాము ప్రతిపాదించిన స్థలంలో ప్లాట్లు కేటాయిస్తేనే వెళ్తామని బీష్మించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొందరికి ప్లాట్లు పంపిణీ చేశారు. అయితే అధికారికంగా ప్రకటన రాకపోవడంతో వారు కూడా ఇంటినిర్మాణాలకు పూనుకోలేదు.
శిథిలమవుతున్న భవనాలు
ప్రస్తుతం పునరావాస కేంద్రం దట్టమైన కంపచెట్లతో నిండి దర్శనమిస్తోంది. ఈ కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్, పాఠశాల
భవనం, వాటర్ ట్యాంకులు వినియోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరి ధ్వంసమయ్యాయి. దట్టమైన కంపచెట్లు పెరగడంతో పేకాటరాయులకు, అసాంఘిక కార్యకాలపాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస కేంద్రాన్ని ఏ రూపకంగానైనా వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
అందరికీ న్యాయం చేయాలి
పులిచింతల ముంపుతో గ్రామంలోని అందరూ నిరాశ్రయులయ్యారు. ఆ రోజు అందరికీ న్యాయం చేస్తామన్నారు. కానీ తరువాత కొద్దిమందికి ముంపు కింద గుర్తించారు. దీనిని గ్రామస్థులు వ్యతిరేకించారు. మండల, డివిజన, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం దక్కులేదు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో ఉన్న అందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.
రామిశెట్టి అప్పారావు, మట్టపల్లి గ్రామం
విషపురుగులు సంచరిస్తున్నాయి
మా తండాకు అనుకొని మట్టపల్లి వాసుల కోసం పునరావాసం కాలనీ కేటాయించారు. సీసీ రోడ్లు, పాఠశాల, కమ్యూనిటీ భవనం, వాటర్ ట్యాంకు నిర్మించారు. కానీ ఇప్పటికీ ఒక ఇల్లు కూడా బాధితులు చేపట్టలేదు. దీంతో ఖాళీగా ఉన్న స్థలంలో దట్టమైన కంపచెట్లు పెరగడంతో విషపురుగులు సంచరిస్తున్నాయి. అధికారులు సమస్యపై దృష్టిసారించి పరిష్కరించాలి.
భూక్య కొండానాయక్, సుల్తానపురంతండా
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
పునరావాస కేంద్రంలో ఉండేందుకు నిర్వాసితులు ఇష్టపడటం లేదు. ఇప్పటికే ఈ విష యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి నుంచి ఆదేశాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం. సమస్య స్థానిక అధికారుల చేతుల్లో లేదు.
మంగా రాథోడ్, తహసీల్దార్
Updated Date - Nov 02 , 2024 | 01:20 AM