వండాకే దొడ్డవుతోంది
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:31 PM
మెత్తటి అన్నం, కలుషిత ఆహారం నేడు విద్యారంగానికి తలనొప్పిగా మారిన ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎక్క డో ఒకచోట ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోనూ ఈ తరహా సన్నివేషాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఉన్నత భవిష్యత్, చదువుపై మమకారంతో వేలాదిమంది విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.
నాణ్యతపైనే అనుమానాలు
అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుల భిన్న వాదనలు
అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు
భువనగిరి టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మెత్తటి అన్నం, కలుషిత ఆహారం నేడు విద్యారంగానికి తలనొప్పిగా మారిన ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎక్క డో ఒకచోట ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోనూ ఈ తరహా సన్నివేషాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఉన్నత భవిష్యత్, చదువుపై మమకారంతో వేలాదిమంది విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ తరహా విద్యార్థుల్లో పేదలే అధికంగా ఉన్నా రు. అయితే చదువు ఎలా ఉన్నప్పటికీ ఆకలి తీర్చే అన్నం మాత్రం విద్యార్థులకు పరీక్షగా మారుతోంది. కొన్ని హాస్టళ్లు, పాఠశాలల్లో ఉడికీ ఉడకని అన్నం వడ్డిస్తుండగా మరికొన్నింటిలో మెత్తటి అన్నంతోనే విద్యార్థు లు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కాగా గతంలో కూరలు, సాంబార్‌పైనే అధిక ఫిర్యాదులు ఉండగా ప్రస్తుతం అందుకు భిన్నంగా వాటి ప్రస్తావన లేకుండానే కేవలం అన్నంపై మాత్రమే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఈ తంతులో కీలకంగా మారిన బియ్యం నాణ్యతపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బి య్యం నాణ్యతపై అధికారులు, అన్నం వండే ఏజెన్సీల మధ్య భిన్న వాదనలు తలెత్తుతున్నాయి. వాస్తవం ఏదైనప్పటికీ విద్యార్థులు మాత్రం అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనేది మాత్రం వాస్తవం.
బియ్యం నాణ్యతే ప్రధాన అంశం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వడ్డిస్తున్న భోజనంలో బియ్యం నాణ్యత ప్రధాన అంశంగా చర్చ సాగుతోంది. గతంలో దొడ్డు అన్నాన్నే లబ్ధిదారులకు అందిం చే వారు, కానీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా కొంతకాలంగా అందరికీ సన్న బియ్యంతో భోజనం లభిస్తోంది. సన్న అన్నంతోపాటు వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. బియ్యం నాణ్యతపై అధికారులు, అన్నం వండే ఏజెన్సీల మధ్య భిన్న వాదనలు తలెత్తుతున్నాయి. నాణ్యతలేని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసిన బియ్యం సరఫరా అవుతుండడంతో అన్నం నాణ్యత కోల్పోతోంద ని ఏజెన్సీలు అంటున్నాయి. కానీ అధికారులు మాత్రం దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసే టెక్నాలజీ లేనేలేదని, ఈ పదమే అసత్యమని ఖండిస్తున్నారు. లబ్ధిదారులకు సన్న అన్నం పెట్టే లక్ష్యంతో ఈ సీజన్‌లో సాగైన సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, కానీ వాటిని ఏజెన్సీ నిర్వాహకులు సరిగా వండకపోతుండడంతోనే అన్నం మెత్తబడటం, పలుకుగా ఉంటోందని అధికారులు వాదిస్తున్నారు. అయితే బీపీటీ బియ్యంలో పలు రకాలు ఉంటాయని, బియ్యాన్ని ఏడాదిపాటు నిల్వ ఉంచాకే వండితేనే అన్నం సన్నగా ఉండటంతోపాటు నాణ్యత ఉంటుందని, లేదంటే నూతన బియ్యానికి స్ర్టీమ్‌చేసి వండితే అన్నం మంచిగా వస్తుందని కానీ స్టీమ్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవని రైస్ మిల్లర్లు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని హాస్టళ్లు, పాఠశాలలకు నిజామాబాద్ జిల్లా నుంచి బియ్యం సరఫరా అవుతుండగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు ఆయా జిల్లాల్లో పండిన బియ్యాన్నే అందిస్తున్నారు.
కొత్త బియ్యాన్ని ఇలా వండితే సమస్యలే రావంటున్న అధికారులు
ప్రస్తుతం సరఫరా అవుతున్న నూతన బియ్యాన్ని సరైన విధానంలో వండితే ఇబ్బందులే రావని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఖచ్చితంగా ఫిల్టర్ నీటితోనే అన్నం వండాలి, గంజి వార్చాలి, అన్నం విడివడటానికి (పుల్లలు పుల్లలుగా) చలికాలంలో రిఫైండ్ ఆయిల్‌ను మాత్రమే ఉడుకుతున్న అన్నంలో పోయాలి. కానీ ఇందుకు భిన్నంగా బోరు లేదా బావి నీటితో వండుతుండడం, గంజి వార్చకుండానే ఉంచడం, అన్నం విడివడడానికి పామాయిల్ కలుపుతుండడంతో అన్నం మెత్తగా అవుతుండడం, మీద ఉడికినట్లుగా ఉండి లోపల పలుకుగా ఉండడం, ముద్దకట్టడం జరుగుతున్నదని అధికారులు అంటున్నారు. ఈ దిశగా ఏజెన్సీ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ వారిలో ఆశించిన మార్పు రావడం లేదని పేర్కొంటున్నారు. అలాగే వంట పాత్రలను శుభ్రంగా కడగక పోతుండడం, వంట దినుసులను భద్రపర్చడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, వంటగదిని ఆపరిశుభ్రంగా ఉంచడంతోనే ఆహారం కలుషితమవుతున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ వస్తున్న ఫిర్యాదులతో హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల్లోని ప్రస్తుత బియ్యాన్ని మారుస్తూ పాత బియ్యాన్ని అందిస్తున్నట్లు అధికారులు అంటున్నారు.
హాస్టల్ బాటపట్టిన అధికారులు
హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనంలో ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హాస్టల్‌బాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో 27న రాత్రి కలెక్టర్ హనుమంతరావుతో సహా అధికారులందరూ రాత్రి అక్కడే భోజనాలు చేసి పడుకొని విద్యార్థులతో గడిపారు. అలాగే శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు అధికారులు మధ్యాహ్న భోజనంచేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. ఇకనుంచి ప్రతీ అధికారి ప్రతీ హాస్టల్‌ను సందర్శించాల్సిందేనని కలెక్టర్ అదేశించారు. ఇదే తరహాలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ పెరిగాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం లభిస్తుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలా..
యాజమాన్యం పాఠశాలలు విద్యార్ధులు సరఫరా అవుతున్న బియ్యం
అన్ని గురుకులు 96 22,920 235 టన్నులు
పాఠశాలలు 689 60,235 94 టన్నులు
అంగన్‌వాడీ కేంద్రాలు 901 22,526 48 టన్నులు
బియ్యం నాణ్యత లోపిస్తున్నది
(29టౌన్ బియన్‌జి 8) ముంతాజ్ బేగం, మధ్యాహ్న భోజనం కార్మికురాలు, భువనగిరి.
సరఫరా అవుతున్న సన్న బియ్యంలో నాణ్యత లోపిస్తున్నది. ఎంత జాగ్రత్తగా వండుతున్నప్పటికీ అన్నం దొడ్డుగా లేదా మెత్తగా ఉంటోంది. దీంతో అన్నం వండుతున్న కార్మికులపై అధికారులు సహా అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిబంధలన్నీ మాపైనే వేస్తున్నారు. కానీ వాస్తవంగా బియ్యం నాణ్యత లేకపోతుండడంతోనే అన్నం సరిగా ఉండటంలేదు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తేనే విద్యార్థులకు మంచి అన్నాన్ని ఇవ్వగలుగుతాం. ఈ దిశగా అధికారులు ఆలోచన చేయాలి.
నాణ్యమైన బియ్యాన్నే ఇస్తున్నాము
(29టౌన్ బియన్‌జి 9) జగదీష్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా.
గురుకులాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్నే సరఫరా చేస్తున్నాం. నాణ్యతలో రాజీ పడటంలేదు. అయితే కొత్త బియ్యాన్ని కార్మికులు సక్రమంగా వండకపోతుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మేరకు ఏజెన్సీ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఫిర్యాదులు అధికంగా వస్తే బియ్యాన్ని మారుస్తున్నాం. కానీ కార్మికులు జాగ్రత్తగా వండితే మంచి అన్నం విద్యార్థులకు లభిస్తుంది. ఇందుకు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నాము.
Updated Date - Nov 29 , 2024 | 11:31 PM