ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నవతరం.. యువతరం

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:21 AM

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అంటే.. అందరూ ఉద్ధండులు, అనుభవజ్ఞులే ఉంటారని అనుకుంటాం! ఇప్పటి వరకూ చాలా సందర్భాల్లో అటువంటి సంప్రదాయం కొనసాగింది కూడా! కానీ, ఇప్పుడు తరం మారుతోంది!

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అంటే.. అందరూ ఉద్ధండులు, అనుభవజ్ఞులే ఉంటారని అనుకుంటాం! ఇప్పటి వరకూ చాలా సందర్భాల్లో అటువంటి సంప్రదాయం కొనసాగింది కూడా! కానీ, ఇప్పుడు తరం మారుతోంది! అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ నవతరం దూసుకొస్తోంది! ఏకంగా పార్లమెంటులోనే తొలిసారి అధ్యక్షా.. అనాలని ఎదురు చూస్తోంది! రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ ప్రకటించిన అభ్యర్థుల్లో సగానికి సగం ప్రత్యక్ష ఎన్నికలకు పూర్తిగా కొత్తవారు కాగా.. మిగిలిన వారిలో అత్యధికులు గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్పంచుకున్నా.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతున్నవారు కావడం విశేషం! వీరిలోనూ ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా యువతరం కావడం మరో విశేషం!! అంతేనా.. అభ్యర్థుల్లో కొందరు రాజకీయ వారసులు ఉన్నా.. అత్యధికులకు మాత్రం రాజకీయ అనుభవం లేకపోవడం గమనార్హం! ఇక, అభ్యర్థుల్లో ఒకరు ఐఏఎస్‌ అధికారి అయితే.. మరొకరు రాజీనామా చేసిన ఉపాధ్యాయిని! ఇంకొకరు డాక్టర్‌ అయితే.. మరొకరు ఆస్పత్రి యజమాని! ఇక, అభ్యర్థుల్లో మిగిలిన వారిలో కొందరు గతంలో ప్రజా ప్రతినిధులుగా పని చేశారు! అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారూ ఉన్నారు.. పోటీ చేసిన వారూ ఉన్నారు! కానీ, వారంతా తొలిసారిగా పార్లమెంటు బరిలో నిలుస్తున్నారు! ఒక్కో నియోజకవర్గంలో అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల ముగ్గురూ కొత్తవారే! వీరిలో ఎవరు గెలిచినా ‘కొత్త’ చరిత్రకు నాంది పలికినట్లే!!

వారసత్వమే బలంగా..

కె.రఘువీర్‌రెడ్డి

నల్లగొండ (కాంగ్రెస్‌)

కుందూరు జానారెడ్డి పెద్దకొడుకు. సాగర్‌ ఎమ్మెల్యే జయవీర్‌కు అన్న. మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా టికెట్‌ దక్కకపోవడంతో ఇప్పుడు లోక్‌సభ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నేతలంతా ఏకమై పనిచేస్తుండడంతో ఎంపీగా గెలిచి తండ్రి వారసత్వాన్ని బలంగా చాటాలని భావిస్తున్నారు.

పట్టు నిలుపుకోవాలని..

పట్నం సునీతారెడ్డి

మల్కాజిగిరి (కాంగ్రెస్‌)

మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి. మూడు పర్యాయాలు జడ్పీ చైర్‌పర్సన్‌. మారిన పరిస్థితుల్లో భర్తతోపాటే బీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌ పార్టీ పిలిచి మరీ మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో రంగారెడ్డి జిల్లాలో తమ కుటుంబం పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీఎం సన్నిహితుడిగా..

కిరణ్‌కుమార్‌రెడ్డి

భువనగిరి (కాంగ్రెస్‌)

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు. భువనగిరి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్ర పోటీ ఎదురైనా.. సీఎం అండతో అవకాశం దక్కించుకున్నారు. నియోజకవర్గంపై పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ మద్దతు పొందగలిగారు. కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానాన్ని నిలబెడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రమైనా..

జి.శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్‌ (బీఆర్‌ఎస్‌)

అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అప్పుడు టికెట్‌ నిరాకరించిన బీఆర్‌ఎస్‌ అఽధిష్ఠానం ఇప్పుడు హైదరాబాద్‌ ఎంపీగా బరిలోకి దించింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పోటీ నామమేత్రమేనన్న అభిప్రాయాలున్నా.. గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రం సీరియస్‌గానే ప్రచారం చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యేగా ట్రై చేస్తే..

రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి (బీఆర్‌ఎస్‌)

ఉప్పల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. టికెట్‌ దక్కకున్నా పార్టీ పట్ల విధేయత ప్రదర్శించారు. స్వయంగా అఽధినేత పిలిచి మరీ ఎంపీ టికెట్‌ ఇచ్చారు. లోక్‌సభ నియోజకవర్గం పరిఽధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ సహకారం అందిస్తుండడంతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు.

బలమైన నేపథ్యంతో..

గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి (కాంగ్రెస్‌)

తాత దివంగత మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి. తండ్రి వివేక్‌, పెదనాన్న వినోద్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేలు. అంతకుముందు పలు పదవులు నిర్వహించారు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన కుటుంబం. పైగా ప్రచారంలో నాన్న, పెదనాన్నలే వంశీకృష్ణ వెనక ఉండి అన్నీ తామై నడిపిస్తున్నారు.

బడిలో పాఠాలే కాదు..

ఆత్రం సుగుణ

ఆదిలాబాద్‌ (కాంగ్రెస్‌)

ఆదివాసీ ఉద్యమంలో పని చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే కాకుండా.. సమాజంలోనూ మార్పు తీసుకురావాలనుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు..

హిందూ ఫైర్‌బ్రాండ్‌

కొంపెల్ల మాధవీలత

హైదరాబాద్‌ (బీజేపీ)

రాజకీయాల్లో అడుగుపెడుతూనే ఫైర్‌బ్రాండ్‌ నాయకురాలిగా గుర్తింపు పొందారు. పాతబస్తీలో హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీజేపీ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. ఎంఐఎంకు కంచుకోటగా భావించే హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ను కాదని..

కడియం కావ్య

వరంగల్‌ (కాంగ్రెస్‌)

సీనియర్‌ రాజకీయ నాయకుడు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేకడియం శ్రీహరి కుమార్తె. వృత్తిరీత్యా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా కాదని.. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు.

వారసుడిగా తెరపైకి

పోతుగంటి భరత్‌

నాగర్‌ కర్నూల్‌ (బీజేపీ)

బీఆర్‌ఎస్‌ ఎంపీ, మాజీ మంత్రి పి.రాములు కుమారుడు. అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. సొంత పార్టీ నేతలతో పొసగక బీజేపీలో చేరారు. తండ్రి రాములు తప్పుకొని మరీ కొడుక్కి టికెట్‌ ఇప్పించుకున్నారు. 2019లో జడ్పీటీసీగా గెలుపొంది.. ఇప్పుడు నేరుగా లోక్‌సభ బరిలో నిలిచారు.

విశ్వాసం నిలబెట్టాలని

కంచర్ల కృష్ణారెడ్డి

నల్లగొండ (బీఆర్‌ఎస్‌)

సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేసి అఽధినేత కేసీఆర్‌ విశ్వాసాన్ని చూరగొన్నారు. తన తమ్ముడు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆలస్యంగా గుర్తింపు

ఎం.సుధీర్‌కుమార్‌

వరంగల్‌ (బీఆర్‌ఎస్‌)

తెలంగాణ ఉద్యమకారుడు. 2001 నుంచి బీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. గతంలో కరీంనగర్‌ జడ్పీ వైస్‌చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం హనుమకొండ జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసిన కడియం కావ్య పార్టీ మారిపోవడంతో.. సుఽధీర్‌కుమార్‌కు అవకాశం దక్కింది.

విధేయతే అర్హతగా

పి.వెంకట్రామారెడ్డి

మెదక్‌ (బీఆర్‌ఎస్‌)

జిల్లా కలెక్టరు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్‌పై ప్రదర్శించిన విఽధేయతతో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఒకప్పటి ప్రభుత్వ అఽధికారిగా జిల్లాలో ఉన్న పరిచయాలతో ఎంపీ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

సేవా రంగం నుంచి..

తాండ్ర వినోదరావు

ఖమ్మం (బీజేపీ)

అమెరికాలో ఉన్నత చదువులు చదివి, కొంతకాలం ఉద్యోగం చేసి వచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఓ ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ఖమ్మంకు పరిశ్రమలు తెస్తానంటున్నారు.

Updated Date - Apr 23 , 2024 | 04:21 AM

Advertising
Advertising