మండుటెండల్లో పోలింగ్!
ABN, Publish Date - Mar 17 , 2024 | 04:55 AM
రాష్ట్రంలో ఈ సారి మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ వెలువడితే..
2019లో మొదటి ఫేజ్‌లోనే పూర్తి.. ఈ సారి 4వ ఫేజ్ దాకా ఆగాల్సిన పరిస్థితి
ఖర్చు మోపెడవుతుందని అభ్యర్థుల ఆందోళన
వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు
ఆలస్యం..అమృతం అవుతుందని బీజేపీ అంచనాలు
వంద రోజుల పాలనే.. గట్టెక్కిస్తుందంటున్న కాంగ్రెస్
నాయకుల వలసలతో బీఆర్‌ఎ్‌సలో అయోమయం
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ సారి మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ వెలువడితే.. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. మొత్తం 33 రోజుల వ్యవధిలోనే మొత్తం తతంగం పూర్తయింది. అప్పటి మాదిరిగానే 2024 ఎన్నికలూ తొలి ఫేస్‌లోనే జరిగి పోతాయని అందరూ భావించారు. అటు, ఇటుగా ఏప్రిల్ 15 కల్లా పోలింగ్ పూర్తయిపోతుందని అంచనా వేశారు. కానీ, ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13న (నాలుగో ఫేజ్‌లో)పోలింగ్ జరగనుంది. అంటే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి 59రోజుల పాటు ఎన్నికల హడావుడి కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తోంది. అన్ని రోజుల పాటు ప్రచారం చేయడానికి ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. అసలే మండుటెండలు, గ్రామాల్లో పెద్దగా పనులు ఉండని రోజులు కావడంతో ఖర్చు మరింతగా పెరిగేందుకూ ఆస్కారం ఉంది. అప్పటి దాకా ఎన్నికల ప్రచారం, కార్యకర్తల ఖర్చులు ఎలా భరించాలన్న ఆందోళనా టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు.. మండుటెండల్లో పోలింగ్ జరగనుండడం ఏ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే, ఈ ఆలస్యం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుండగా, వందరోజుల పాలనే తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నాయి. నేతల వలసలు, కవిత అరెస్టు వంటి పరిణామాలత సతమతమవుతున్న బీఆర్‌ఎ్‌సకు కూడా ఈ ఆలస్యం కొంత ఊరటనిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
కాంగ్రెస్ జోరు కొనసాగేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లలో గెలుపు లక్ష్యంగా పని చేస్తోంది. పార్టీ అధికారంలో ఉండడం, గ్యారెంటీల అమలుతో మహిళలు, రాహుల్ చరిష్మాతో మైనార్టీల ఓట్లు తమకే పడుతాయని అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మ్యాజిక్ రిపీట్ అయినా కనీసం 12 సీట్లలో గెలుస్తామన్న నమ్మకంతో ఉంది. అయితే, పోలింగ్ తేదీ ఆలస్యం కావడమే ఆ పార్టీని కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అక్కడక్కడా పంటలు ఎండుతున్నాయి. పోలింగ్ తేదీ నాటికి ఇది మరింత తీవ్ర రూపం దాలిస్తే.. రైతుల్లో ఎంతో కొంత అసంతృప్తి చోటు చేసుకుంటుందేమోనన్న ఆందోళనలో ఆ పార్టీ ఉంది. అయితే. కాంగ్రెస్ వంద రోజుల పాలన.. వీటన్నింటినీ అధిగమిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మోదీపైనే బీజేపీ ఆశలు!
దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ ఉందన్న అంచనాలో ఉన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలో పోలింగ్ ఆలస్యం కావడం కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న కాంగ్రె్‌సను దెబ్బతీయడానికి ఇదే అదును అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడం, వర్షాభావ పరిస్థితులు.. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతాయని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ భవితవ్యం కూడా అప్పటిలోగా తేలిపోతుందని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ముఖాముఖి పోటీ నెలకొంటే.. మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని ఆ పార్టీ అంచనా వేస్తుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు, కవిత అరెస్టు తదితర కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్‌ఎ్‌సకు.. పోలింగ్ ఆలస్యంగా జరగడం కొంత ఊరటేనన్న విశ్లేషణలు వెలువుడుతున్నాయి. బీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఇంకా తగ్గలేదని, ప్రస్తుతం ఆ పార్టీ చుట్టూ ముసురుకున్న సమస్యలకు.. ప్రజల్లో చల్లారని అసంతృప్తి తోడైతే భారీ నష్టం జరుగుతుందన్న అంచనాలూ ఉన్నాయి. ఈ తరుణంలో షెడ్యూల్ ఆలస్యం కావడం ఆ పార్టీకి కొంత ఊరటేనంటున్నారు. అప్పటికల్లా కోలుకుని చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఈ గ్యాప్‌లో పార్టీ నుంచి వలసలు మరింత పెరిగి, కాంగ్రె్‌స-బీజేపీ మధ్యే ముఖాముఖీ పోటీ ఏర్పడితే.. జరిగే నష్టం అంచనాలను తలకిందులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated Date - Mar 17 , 2024 | 04:58 AM