ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం..!
ABN, Publish Date - Apr 02 , 2024 | 11:58 PM
వరిధాన్యం కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. వాటిని అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 39 కొనుగోలు కేంద్రాల ద్వారా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ప్రతీ సంవత్సరం ఈ సీజన్‌లో వర్షాలు కురిసి పంట తడుస్తుండడంతో ప్రభుత్వం ఈ సారి ముందస్తు చర్యలు చేపడుతోంది. వర్షానికి ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు సరఫరా చేసే పనిలో పడింది. అయితే, గత వానాకాలంలో లక్ష్యం మేరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేకపోయింది. కనీసం ఈ సారైనా ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
40వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
39 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
త్వరలో ప్రారంభించనున్న కేంద్రాలు
వరిధాన్యం కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. వాటిని అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 39 కొనుగోలు కేంద్రాల ద్వారా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ప్రతీ సంవత్సరం ఈ సీజన్‌లో వర్షాలు కురిసి పంట తడుస్తుండడంతో ప్రభుత్వం ఈ సారి ముందస్తు చర్యలు చేపడుతోంది. వర్షానికి ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు సరఫరా చేసే పనిలో పడింది. అయితే, గత వానాకాలంలో లక్ష్యం మేరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేకపోయింది. కనీసం ఈ సారైనా ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 1 : జిల్లాలో ప్రస్తుత యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. వరి కోతలు ఊపందుకోవడంతో అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొనుగోళ్లకు అవసరమయ్యే సామగ్రి అందుబాటులో ఉంచే ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 1,27,263 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 95,134 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వరి సాగుకు అనుగుణంగా దిగుబడిపై పౌర సరఫరాల శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. 40వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు అంచనా వేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 39 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా మూడు, పీఏసీఎస్ ద్వారా 27, డీసీఎంఎస్ ద్వారా 9 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ అకాల వర్షాలు వచ్చినా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో అదనంగా టార్పాలిన్లు నిల్వ చేస్తున్నారు. కేంద్రాల్లో ఎక్కువ ధాన్యం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రవాణా చేసేందుకు వీలుగా సరిపడా వాహనాలను ఏర్పాటు చేశారు. రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్ష్యం చేరడం కష్టమే..?
ఈ సారి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. సాగు చేసిన వరిని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం సేకరణ లక్ష్యం తక్కువగానే ఉన్నప్పటికీ లక్ష్యం చేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పంటలు ఎండి పోతుండటంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారుగా 1500 ఎకరాలకు పైగా వరి ఎండిపోయింది. దీంతో వరి దిగుబడి తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.
వానాకాలంలో కొన్నది కొంతే..!
గత వానాకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువ శాతం మంది ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపండంతో కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం 33 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. 87,582 మెట్రిక్ టన్నుల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. కానీ, రూ.22 కోట్ల విలువగల 10,016 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది. సన్న రకాలపై రైతులు ఆసక్తి చూపడం.. వాటికి ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టుబాటు కాకపోవడం, డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదని, తరుగు పేరిట దోపిడీకి పాల్పడుతుతుండటంతో రైతులు ధాన్యాన్ని పైౖవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు.
Updated Date - Apr 02 , 2024 | 11:58 PM