సంయు, ఖుషీల రంగ ప్రవేశోత్సవం.. హైలెట్ గా నిలిచిన భరణి, పురాణపండ పలుకులు
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:11 AM
చాలా కాలం తరువాత రవీంద్రభారతి ఆడిటోరియమ్ లో ఆబాలగోపాలం ఈ కూచిపూడి నృత్యోత్సవంను ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. తనికెళ్ళ భరణి సెంటర్ ఎట్రాక్షన్ కాగా, సభల్లో ఎక్కువ పాల్గొనడానికి ఆసక్తి చూపని అసాధారణ వక్త పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా తన పరిమళపు పలకరింపును ఈ వేదికపై దర్శింపచేయడం మేధోవర్గాన్ని ఆశ్చర్యంతోపాటు ఆనందానికి గురిచేయడం ఒక విశేషంగానే చెప్పాలి.
హైదరాబాద్, ఆగస్టు10: విజ్ఞుల, రసజ్ఞుల, జంటనగరాల ప్రముఖుల జేజేల మధ్య జాతీయ సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత, విఖ్యాత నాట్య గురువు శ్రీమతి దీపికారెడ్డి సమర్ధవంతమైన ప్రత్యక్ష పర్యవేక్షణలో సౌందర్యాలు విరజిమ్మే చిరంజీవులు కుమారి సంయు, కుమారి ఖుషీల కూచిపూడి నాట్యరంగప్రవేశం హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై అత్యంత వైభవంగా జరగడం జంటనగరాల సాంస్కృతిక వాతావరణంలో చర్చనీయాంశమైంది.
కుమారి సంయు కమటం, కుమారి ఖుషీ కమటం సోదరీమణుల తల్లితండ్రులు కమటం సంజయ్, కమటం రోహిణిల ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటైన ఈ నవ నవోన్మేష కూచిపూడి రంగప్రవేశోత్సవంలో గురు దీపికారెడ్డి కొరియోగ్రఫీతో పాటు ముఖ్య అతిధులుగా పాల్గొన్న లతా మా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీమతి కొంపెల్ల మాధవీలత, విఖ్యాత నటుడు తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సభికుల్ని విశేషంగా ఆకర్షించారు.
కుమారి సంయు, కుమారి ఖుషీల కూచిపూడి నృత్యోత్సవంలో రాగమాలిక రాగంతో శ్రీ గణేశ పంచరత్నం, రాగమాలిక రాగంతోనే శివ శివ భవ భవ శరణం, ఆనందభైరవి రాగంతో మధురానగరిలో, ధేనుక రాగంతో కాళికాష్టకం, శంకరాభరణ రాగంతో అలరులు కురియగా, ధనశ్రీ రాగంలో తిల్లానలకు చేసిన నాట్య వైభవం ఆహూతుల్ని విశేషంగా ఆకర్షించి కుమారి సంయు, కుమారి ఖుషీల కూచిపూడి నృత్యోత్సవంపై ప్రశంసల వర్షం కురియడంతో పాటు తల్లి తండ్రులు సంజయ్, శ్రీమతి రోహిణిలను రసజ్ఞులు అభినందించడం విశేషంగానే చెప్పాలి.
సంస్కుతీసంపన్నమైన అద్భుత ప్రసంగంతో శ్రీమతి కొంపెల్ల మాధవీలత ఆకట్టుకోగా, అత్యద్భుతమైన శివ నాదాల పలుకులతో, రసభరితమైన ఆటకదరా శివా కవిత్వ సౌందర్యంతో డాక్టర్ తనికెళ్ళ భరణి ఆకర్షించడం విశేషం. చిరంజీవులు సంయు, ఖుషీల నాట్యం తనని పరవశింప చేసిందని భరణి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. తనికెళ్ళ భరణి తన ప్రసంగంలో కొన్ని రసావిష్కృతమైన అంశాల్ని ప్రస్తావించడం రసజ్ఞుల్ని ఆనందపరచింది.
ఆర్భాటాలకు, సొంతడబ్బాలకు దూరంగా వినయసంపన్నతలతో అత్యంత ప్రతిభావంతునిగా అన్ని వర్గాలు ఆత్మీయంగా పిలుచుకునే ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కస్తూరీ కర్పూర పరిమళాల్లాంటి శబ్దసౌందర్యం ఆహూతుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిందనడంలో సందేహంలేదు.
తల్లి రోహిణి అహోరాత్రాల ప్రత్యేక శ్రద్ధ, గురు దీపికారెడ్డి వాత్సల్యంతో కూడిన అత్యంత సమర్ధవంతమైన పరమాద్భుతాల పవిత్ర శిక్షణ సంయు, ఖుషీలను ఇంతటి మహా వెలుగులుగా దర్శింపచేశాయని పేర్కొంటూ సుమారు రెండు గంటలపాటు అందరినీ మరో ప్రపంచపు రసోన్మత్త స్థితికి తీసుకెళ్లి పారవశ్యపు దారులు తెరచినందుకు దీపికా రెడ్డి, సంజయ్, రోహిణిలకు పురాణపండ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
ఆద్యంతం ఈ ఉత్సవానికి నట్టువాంగం సహకారాన్ని శ్రీమతి దీపికారెడ్డి, గాత్ర సంస్కారాన్ని దండిభట్ల శ్రీనివాస్ వెంకట శాస్త్రి, మృదంగ సహకారాన్ని రాజగోపాలాచార్య తదితర బృందం వాయిద్య ఫ్లూట్ తదితర అంశాలను ఎంతో చక్కగా అందించడం దీపాంజలి సంస్థ గౌరవాన్ని పెంచేలా ఉందని ఆహుతులు ప్రశంసలు వర్షిస్తూనే ఉన్నారు.
ఏదేమైనా చాలా కాలం తరువాత రవీంద్రభారతి ఆడిటోరియమ్ లో ఆబాలగోపాలం ఈ కూచిపూడి నృత్యోత్సవంను ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. తనికెళ్ళ భరణి సెంటర్ ఎట్రాక్షన్ కాగా, సభల్లో ఎక్కువ పాల్గొనడానికి ఆసక్తి చూపని అసాధారణ వక్త పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా తన పరిమళపు పలకరింపును ఈ వేదికపై దర్శింపచేయడం మేధోవర్గాన్ని ఆశ్చర్యంతోపాటు ఆనందానికి గురిచేయడం ఒక విశేషంగానే చెప్పాలి.
అనంతరం.. సంయు, ఖుషిల చేత తమ నాట్య గురువు దీపికా రెడ్డికి ఘన సన్మానం జరిగింది. ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి తల్లి తండ్రులు సంజయ్, రోహిణి ఉత్తమ సంస్కారాన్ని చాటుకోవడం చూపరులచే జేజేలు కొట్టించింది.
మధ్యలో ఈ చిరంజీవుల తండ్రి సంజయ్ కమటం కొన్ని ఆసక్తికరమైన అంశాలు వివరించగా.. శ్రీమతి రోహిణి కమటం చివరగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో ఈ అపూర్వ కూచిపూడి రంగప్రవేశోత్సవం ఘనంగా ముగిసింది.
Updated Date - Aug 11 , 2024 | 12:55 AM