మహంకాళి బోనాల్లో రేవంత్ పాలనకు జయప్రదంగా ‘పురాణపండ’ ఘన పారిజాతం
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:52 PM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణంతో ఈ గ్రంధం చోటుచేసుకోవడం విశేషం.
సికింద్రాబాద్, జూన్ 3: ఆధ్యాత్మిక రంగంలో నయా ఆవిష్కరణల కౌశలం క్రొత్త తరంలో నింపేలా అపురూప గ్రంథాల్ని రచించి, సంకలనీకరించి యుద్ధ ప్రాతిపదికన అద్భుతంగా అందించడంలో ప్రముఖ రచయిత ‘పురాణపండ శ్రీనివాస్’ది అందెవేసిన చెయ్యి మాత్రమే కాకుండా.. అగ్రతాంబూలం కూడా అని తిరుమల తిరుపతి దేవస్ధానం, రామకృష్ణ మఠ్ వంటి సంస్థల ప్రముఖులు ప్రశంసలు వర్షిస్తున్నట్లు మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమేనన్నట్లు రాజకీయ సినీ రంగాల ప్రముఖులు కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌చే అనేక గ్రంథాల్ని భక్త సమాజానికి సమర్పిస్తున్నారు.
పురాణపండ శ్రీనివాస్ గొప్ప వక్త. ఆయన ప్రవాహాశైలీ ప్రవచనా మాధుర్యం అద్భుతం. కంఠంలో జంకారం, వేగం, ఏ అంశాన్నైనా ముగ్ధంగా చెప్పడంలో విలక్షణత శ్రీనివాస్‌కే సొంతం. ఒక పదేళ్ల వెనుకకు వెళితే జంటనగరాల్లో ఎన్నో వేదికలపై అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకుని వేలమంది అభిమానునుల్ని సొంతం చేసుకున్న పురాణపండ శ్రీనివాస్ జీవన యాత్రలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల లక్షలకొలదీ పాఠకుల్ని తన అద్భుత గ్రంధాలతో కట్టి పడేస్తున్నారే కానీ వేదికలకు చాలా దూరంగా వుంటున్నారు.
పురాణపండ శ్రీనివాస్ వేదికెక్కి ఏం మాట్లాడినా ఒక ధ్వని కావ్యంలా ఉంటుందనదానికి త్యాగరాయగానసభ, రవీంద్రభారతి వేదికలే సాక్షి. గత ముఖ్యమంత్రులు వై.ఎస్.రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, నారా చంద్రబాబు నాయుడు (ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి), కే.చంద్ర శేఖరరావులు శ్రీనివాస్ అఖండ గ్రంధాలను ఆయా కాలాలలో ఆవిష్కరించి అభినందనలు వర్షించగా ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
ఒక అనిర్వచనీయ దివ్యానుభూతినిచ్చే ఈ సంప్రదాయ గ్రంధాన్ని ‘బియోన్’ వెంచర్ సమర్పిస్తున్న శంషాబాద్‌కు చెందిన బీఎస్‌సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రచురించింది. సుమారు మూడువందల పేజీలతో రూపుదిద్దుకున్న ఈ దివ్యగ్రంధాన్ని ఆషాఢ బోనాలవేళ ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి వందలకొలది గ్రంధాల ప్రతులను సమర్పిస్తున్నారు.
మృత్యు భయాన్ని దూరం చేసేందుకై కాలానికి అధినాయకుడైన యముని ప్రార్ధన, ఆరోగ్యానికి అధి దేవతాశక్తి అయిన ధన్వంతరి ప్రార్ధనతో పాటు, పితృదేవతల ప్రసన్నఆశీర్వచనంకోసం పితృదేవతాస్తోత్రరాజమ్, పంచ మహాయుధ స్తోత్రమ్‌తో పాటు కాశీ మహాక్షేత్ర ప్రార్ధన వంటి ఎన్నో విశిష్ట అంశాలతో ఈ బుక్ సుమారు వందకు పైగా పవిత్ర అంశాలతో విరాజిల్లడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పాల్సిందే.
భౌతిక జీవన సౌఖ్యాల విలువ పెరిగిన ఈ రోజుల్లో అపార వైదిక మంత్ర గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ అక్కడక్కడ అందమైన వ్యాఖ్యానాలతో ఈ గ్రంధాన్ని ఘన పారిజాతంగా రూపొందించడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఆర్ష భారతీయ సంప్రదాయానికి ఎలుగెత్తిన పతాకంగా దర్శనమిచ్చేలా ఈ బోనాల పండుగకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దర్శనానికి ముఖ్య అతిధుల పేరిట విచ్చేసే భక్తులకు ఈ అక్షర కానుక ఒక బంగారు పల్లెంగా చెప్పాల్సిందేనంటున్నారు పండితులు.
రెండువందల సంవత్సరాల అతి ప్రాచీన ఘన చరిత్ర ఉన్న ఈ అమ్మవారి ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈసారి బోనాలకు వీఐపి పేరుతో పాల్గొనే భక్తులకు ఈ మంత్రపేటికను బహూకరించనున్నట్లు అర్చక బృందాలు పేర్కొన్నాయి.
లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణం చోటుచేసుకోవడం విశేషం.
Updated Date - Jul 05 , 2024 | 12:24 AM