దసరాకు ‘డబుల్’ కానుక
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:56 PM
సొంతింటి కల సాకారం కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబురు తెలిపింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి కలలు దసరా నాటికి నిజం కాబోతున్నాయి. నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్ రూమ్‌లను అర్హత ఉన్నవారికి దసరా కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ
త్వరలో విధివిధానాలు ఖరారు
గతంలో లాటరీ ద్వారా
ఎంపిక చేసిన లబ్ధిదారులపై డైలమా!
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : సొంతింటి కల సాకారం కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబురు తెలిపింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి కలలు దసరా నాటికి నిజం కాబోతున్నాయి. నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్ రూమ్‌లను అర్హత ఉన్నవారికి దసరా కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్‌లను దసరా కానుకగా అర్హులైన వారికి కేటాయిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లోనే ఖరారు చేస్తామని తెలిపారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే, జిల్లాలో మొత్తం 6,677 రెండు పడగల గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని గతంలో లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 4,225, పట్టణ ప్రాంతంలో 2,452 ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, నిధుల కొరత కారణంగా అప్పటి ప్రభుత్వం 2,741 ఇళ్లకు టెండర్లు పిలిచింది. ఇందులో 2,452 పూర్తయ్యాయి. గత ఎన్నికలకు ముందు లాటరీ పద్దతిన 1988 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే, వీరందరికీ గృహపత్రాలు అందచేయలేదు. కొందరికి ఇంటినంబర్లు కూడా కేటాయించారు. అయితే, మీర్‌పేట్‌లో మినహా లబ్ధిదారులు ఎవరూ కూడా గృహ ప్రవేశాలు చేయలేదు. దాంతో ఇప్పుడు గతంలో లాటరీ ద్వారా ఎంపిక చేసినవారిని లబ్దిదారులుగా ప్రభుత్వం పరిగణిస్తుందా? మళ్లీ కొత్తగా ప్రక్రియ మొదలు పెడుతుందా? అనేది తెలియడం లేదు. దీనిపై కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అప్పటి ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. లాటరీ విధానంతో చేపట్టినప్పటికీ దాన్ని నిర్వహించిన తీరుపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎంపిక చేసిన లబ్దిదారుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియడం లేదు. అయితే, దసరా నాటికి అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారులంతా సంతోషపడుతున్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:56 PM