వనరులున్నా ప్రణాళికలేవి?
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:09 AM
వికారాబాద్ జిల్లాకు కాగ్నా, కాక్రవేణి నదులు తలమానికంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని వనరులు ఇక్కడ ఉన్నాయి.
జిల్లాలో కాగ్నా, కాక్రవేణి నదుల పరవళ్లు
వృథాగా పోతున్న 3 టీఎంసీల సాగునీరు
కర్ణాటకలో ఆనకట్టలు, చెక్‌డ్యాం, ఎత్తిపోతలతో నీటి వినియోగం
తెలంగాణ అధికారుల చర్యలు శూన్యం
తాండూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాకు కాగ్నా, కాక్రవేణి నదులు తలమానికంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని వనరులు ఇక్కడ ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, చీప్‌విఫ్ మహేందర్‌రెడ్డితో పాటు పరిగి, తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్‌లో ఈ నదీ జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం ఈ నీటిని వినియోగంలోకి తెచ్చి రైతులకు ప్రయోజనం చేకూరుస్తోంది. అక్కడి ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆనకట్టలు, చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలతో పాటు చిన్నచిన్న ప్రాజెక్టులను నిర్మించి నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశారు. అదే కాగ్నానది కర్ణాటక రాష్ట్రం నుంచి తాండూరు మీదుగా ప్రవహిస్తున్నా ఇక్కడ మాత్రం నీరు వృథాగా ప్రవహిస్తోంది. ఈ జలాలను వ్యవసాయానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు.
కాగ్నా నది
కాగ్నానది అనంతగిరి కొండల్లో (వికారాబాద్) పట్టింది. 60 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా అందులో తాండూరు సబ్‌డివిజన్ పరిధిలో దాదాపు 48కిలో మీటర్ల మేర కాగ్నా నది ప్రవహిస్తోంది. దీని ఉపనది పేరు బీమానది. కలబుర్గి జిల్లా వాడీ సమీపంలో భీమాలో కలుస్తుంది. తెలంగాణ, కర్ణాటక మీదుగా పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. తాండూరు పరిధిలో నారాయణపూర్, గోనూర్, వీర్‌శెట్టిపల్లి, ఖాంజాపూర్, తాండూరు పట్టణం, పాత తాండూరు, రసూల్‌పూర్, యాలాల మండలం కోకట్, అగ్గనూరు, బెన్నూరు, పెద్దేముల్ మండలం కందనెల్లి, బుద్దారం, ఇందూర్ గ్రామాల మీదుగా ఈ నది ప్రవహిస్తోంది. తాండూరు పట్టణం పాత తాండూరు సమీపంలో చెక్ డ్యాం నిర్మించారేగానీ నీటిని నిల్వ చేయడంలేదు.
కాక్రవేణి
కాక్రవేణి నది యాలాల మండలంలో ఎనిమిది గ్రామాల సరిహద్దు గుండా ప్రవహిస్తోంది. నాగసమందర్, విశ్వనాథ్‌పూర్, యాలాల, సంగెం కుర్దు, బెన్నూర్, కోకట్, లక్ష్మీనారాయణపూర్, అగ్గనూర్ గ్రామీల మీదుగా నది ప్రవహిస్తోంది. ఈ నది ఆధారితంగా శివసాగర్ ప్రాజెక్టు నిర్మించినా నిధులు కేటాయించకపోవడంతో అసంపూర్తిగా వదిలేశారు.
ఎత్తిపోతలకు ప్రాధాన్యత కల్పించాలి
ఎత్తిపోతల పథకాలను ఈనదుల అనుసంధానంగా నిర్మిస్తే తాండూరు నియోజకవర్గంతో పాటు కొడంగల్, పరిగి ప్రాంతాల రైతులకూ ఉపయోగకంగా ఉంటుంది. మూడు నియోకవర్గాల రైతులకు మేలు జరుగుతుంది. చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఎత్తిపోతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తే కర్ణాటక మాదిరిగా ఇక్కడి రైతులు నదీ జలాల ఆధారిత పంటలను సాగు చేసుకుంటారు. యాలాల మండలం బెన్నూర్ నదీ ప్రవాహక ప్రాంతం గుండా కొన్నేళ్ల కిందట సంగాయిపల్లి ఎత్తిపోతల పథకం పేరిట నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి వదిలేశారు. చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.
నీటి వృథాను అరికట్టేందుకు ప్రణాళికలు: మనోహర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
జిల్లాలో ఎక్కడాలేని విధంగా తాండూరు నియోజకవర్గం మీదుగా కాగ్నా, కక్రవేణి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల నీరు వృఽథాగా పోతోంది. ఈ విషయాన్ని గుర్తించి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలా, సాగుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. పూర్తిస్థాయి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో సాగునీటి పారుదలశాఖ సర్వే చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 15 రోజుల్లో నివేదిక వస్తుంది. నివేదికల ప్రభుత్వానికి అందజేసి నిధులు రాబట్టేలా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Nov 19 , 2024 | 12:09 AM