అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:58 PM
అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది.
దుండిగల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం, మైలారం కొత్త తాండాకు చెందిన బలరామ్ కవిత దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణి(18) దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల మెయిన్ క్యాంప్‌సలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటుంది. తోటి విద్యార్థినులు శుక్రవారం కళాశాలకు వెళ్లగా ఫ్లోర్ ఇన్‌చార్జ్ శ్రావణిని క్లాస్‌కు ఎందుకు వెళ్లలేదని అడగడంతో కడుపునొప్పి వస్తుందని సమాదానం చెప్పింది. కళాశాల నుంచి మధ్యాహ్నం విద్యార్థినులు హాస్టల్ వచ్చేసరికి గది తలుపు వేసి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. యాజమాన్యం వచ్చి, తలుపులు బద్దలు కొట్టి చూడగా విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘సారీ మమ్మీ.. కడుపునొప్పి భరించలేకపోతున్నా’ అని రాసి ఉందని దుండిగల్ సీఐ సతీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు సాయంత్రం 5.30గంటలకు కళాశాల వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ కూతురు గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడిందని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదంటూ కళాశాల ముందు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కలగజేసుకుని కుటుంబసభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఉరేసుకొని వ్యక్తి..
మూడుచింతలపల్లి: ఫ్యాన్‌కు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జీనోమువ్యాలీ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీకి చెందిన సోనుయాదవ్, విప్పెన్‌రావులు ఇద్దరు స్నేహితులు. బతుకుదెరువు నిమిత్తం మండలంలోని లాల్‌గడి మలక్‌పేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని కూలీపనులు చేసుకుంటున్నారు. రోజూ మాదిరిగానే విప్పెన్‌రావు కూలీకి వెళ్లగా సోనూయాదవ్ ఇంట్లోనే ఉన్నాడు. విప్పెన్‌రావు సోనుకు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Dec 06 , 2024 | 11:59 PM