ఫార్మాసిటీ భూసేకరణకు కోర్టు నోటీసులు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:13 AM
ఫార్మాసిటీ రద్దు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోంది.
రైతుల ఆందోళన
యాచారం, సెప్టెంబరు 15: ఫార్మాసిటీ రద్దు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోంది. ఫార్మాసిటీకి భూములివ్వాలని ప్రభుత్వం మేడిపల్లి రైతులకు కోర్టు నోటీసులిచ్చింది. కోర్టు నోటీసులను మేడిపల్లి మహిళా రైతులు ఆదివారం విలేకరులకు చూపారు. సీ పీసీ 151 కింద విచారిస్తున్న పిటిషన్‌పై ఈ నోటీ సు ఇస్తున్నట్టు కోర్టు పేర్కొంది. భూసేకరణపై రైతులకున్న అభ్యంతరాలపై నోటీసు అందుకున్న 37 రోజుల్లోగా పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు సూచించిం ది. కాగా కోర్టు గత నెల 30న నోటీసు ఇచ్చింది. 31న అసిస్టెంట్ రిజిస్ర్టార్ పేరిట నోటీసు సెర్వ్ చేశారు. సంబంధిత రైతులు వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు పేర్కొంది. మేడిపల్లికి చెందిన 72మంది రైతులకు హైకోర్టు నోటీసులందాయి. కాగా తాము అధికారంలోకొస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తామని, పంట భూములను పారిశ్రామిక అవసరాలకు తీసుకోం అ ని మాటిచ్చిన కాంగ్రెస్ నేడు భూసేకరణకు హైకోర్టు నోటీసులు పంపడం దుర్మార్గం అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు నోటీసులపై మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఫార్మాసిటీ రద్దు చేయిస్తామని గతంలో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పాదయాత్రలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు అంటున్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:13 AM