జంట జలాశయాల్లో ఫామ్‌హౌస్‌లు
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:54 PM
శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల పరిధిలోని జంట జలయాశయాలైన గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇష్టారాజ్యంగా ఫామ్‌హౌ్‌సలు, వ్యవసాయ క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో శ్రీమంతులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు పదుల సంఖ్యలో ఫామ్‌హౌ్‌సలను నిర్మించుకున్నారు.
ఆక్రమణలకు గురైన గండిపేట చెరువు, హిమాయత్ సాగర్
నగరానికి సమీపంలో ఉండటంతో భారీగా నిర్మాణాలు
గండిపేట పరిధిలో పలు నిర్మాణాలను కూల్చిన హైడ్రా
మిగిలిన భవనాల యజమానుల్లో మొదలైన గుబులు
పెద్దమంగళారం, తోల్‌కట్ట చెరువుల్లో భారీగా ఆక్రమణలు
మాయమైన శంకర్‌పల్లి మండలంలోని మొండి వాగు
శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల పరిధిలోని జంట జలయాశయాలైన గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇష్టారాజ్యంగా ఫామ్‌హౌ్‌సలు, వ్యవసాయ క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో శ్రీమంతులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు పదుల సంఖ్యలో ఫామ్‌హౌ్‌సలను నిర్మించుకున్నారు. అయితే ఈ నిర్మాణాల్లో చాలావరకు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఆయా వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే ‘హైడ్రా’కు అందించినట్లు సమాచారం. దీంతో హైడ్రా అధికారులు ఆ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
చేవెళ్ల, సెప్టెంబరు 11: మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామం రెవెన్యూ పరిధిలోని పలువురు వీఐపీలకు చెందిన ఫామ్‌హౌ్‌సలను ఇప్పటికే హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కూల్చాల్సిన వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్‌హౌ్‌సలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రికి చెందిన వ్యవసాయ క్షేత్రాలు చిలుకూరు గ్రామం పరిధిలో ఉన్నాయి. అలాగే ఓ పారిశ్రామికవేత్తకు చెందిన ఫామ్‌హౌస్ గండిపేట్ జలాశయం బఫర్ జోన్‌లో నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ కీలక నాయకుడికి సంబంధించిన ఫామ్‌హౌస్ సైతం అక్కడ ఉండటం గమనార్హం. దీంతో పాటు ఓ పాపులర్ విద్యాసంస్థల యజమానికి చెందిన పామ్‌హౌస్ అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన వారంతా హిమాయత్ సాగర్ పరిధిలోకి బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఇప్పటికే హైడ్రా అధికారులకు నివేదిక ఇచ్చిన్నట్లు సమాచారం. దీంతో ఆక్రమణదారుల్లో హైడ్రా గుబులు పట్టుకుంది. అధికారలు ఎప్పుడు వచ్చి కూల్చివేస్తారో అనే భయం వారిని వెంటాడుతోంది.
మొయినాబాద్ మండలంలో..
మొయినాబాద్ మండలంలో మొత్తం 50 చెరువులు ఉన్నాయి. ఇందులో 20 చెరువుల వరకు ఆక్రమణకు గురైయ్యాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల ప్రహరీ, రోడ్లు, ఫ్రీకాస్ట్ వాల్స్ ఒకటి రెండు చెరువుల్లో నిర్మాణాలు కూడా దర్శనమిస్తున్నాయి. అలాగే మండల పరిధిలోని పెద్దమంగళారం, తోల్‌కట్ట గ్రామ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇనుప కంచె తొలగింపు
షాబాద్ మండల కేంద్రంలో పైల్వాన్ చెరువు, మండల పరిధిలోని చందన్‌వెల్లి చెరువు, సోలిపేట్, తాళ్లపల్లి, మాచన్‌పల్లి, పెద్దవేడు తదితర గ్రామాల్లో పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కబ్జాకు గురికాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే పహిల్వాన్ చెరువు బఫర్‌జోన్ సమీపంలో నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసినప్పటికీ పొలం చుట్టు ఓ రాజకీయ నాయకుడి సోదరి ఇనుప కంచె ఏర్పాటు చేయించింది. అయితే అది బఫర్‌జోన్‌లో ఉండటంతో వెంటనే తొలగించాలని అధికారులు నోటీసులు అందజేశారు. దీంతో ఆమె స్వయంగా కూలీలతో తీసివేయించారు.
మొండివాగు మూసివేత
శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలోని పెద్ద చెరువులోకి నీళ్లు రాకుండా మిర్జాగూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఫంక్షన్ హాల్ యజమాని మొండివాగులో వందలాది లారీల మట్టిపోసి వాగును ముసివేశాడు. ఈ వాగు పూర్తిగా కనుమరుగు కావడంతో పెద్ద చెరువులోకి నీళ్లు రావడం లేదు. అదేవిధంగా పెద్ద చెరువు - మొండివాగు మధ్య హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సైతం ఈ వాగు నుంచి వచ్చే వర్షపు నీటి కోసం ఉన్న వాగును ఒకవైపు మూసివేశాడు. దీంతో పెద్ద చెరువులోకి వరద నీళ్లు రాకుండా ఆటంకం ఏర్పడింది. దీంతో ఆ చెరువులు పూర్తిగా నిండటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జన్వాడ తుమ్మసముద్రం చెరువులో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ వ్యక్తి తన ఫామ్‌హౌ్‌సలోకి వెళ్లేందుకు దర్జాగా అడ్డంగా రోడ్డును నిర్మించి గేట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
Updated Date - Sep 11 , 2024 | 11:54 PM