తరచూ రిపేర్‌కు వస్తుందని..
ABN, Publish Date - Jun 07 , 2024 | 11:35 PM
తన స్కూటీ తరచూ రిపేర్‌కు వస్తుందని విసిగిపోయిన యజమాని వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చేవెళ్ల మండల పరిధిలోని కేసారం స్టేజీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యజమాని
చేవెళ్ల, జూన్ 7 : తన స్కూటీ తరచూ రిపేర్‌కు వస్తుందని విసిగిపోయిన యజమాని వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చేవెళ్ల మండల పరిధిలోని కేసారం స్టేజీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ రఫీ పని నిమిత్తం కొడంగల్‌కు ఉదయాన్నే ఇంటి నుంచి తన స్కూటీ (టీఎస్ 07 జేఆర్ 8361)పై బయలుదేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల మండల పరిఽధిలోని కేసారం స్టేజీ సమీపంలోని బృందావన్ కాలనీ సమీపానికి రాగానే స్కూటీ ఒక్కసారిగా నిలిచిపోయింది. దాంతో స్టార్ట్ చేద్దామని ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బైక్ మెకానిక్ పిలిపించుకుని స్కూటీని చూపించాడు. రిపేర్‌కు వచ్చిందన రూ.7వేలు ఖర్చు అవుతుందని మెకానిక్ చెప్పాడు. దాంతో విసిగిపోయిన రఫీ స్కూటీలో ఉన్న పెట్రోల్‌ను బయటకు తీసి అందరూ చూస్తుండగానే నిప్పంటించాడు. గమనించిన ఇతర వాహనదారులు దగ్గరకు వెళ్లి రఫీని విషయం అడగగా.. తన స్కూటీకి తానే నిప్పు అంటించానని సమాధానం చెప్పాడు. పలు మార్లు రిపేరింగ్ చేయిస్తే రూ.12వేల వరకు ఖర్చు అయ్యిందని, మళ్లీ ఇప్పుడు రిపేర్ చేయిద్దామంటే మరో రూ.7వేలు ఖర్చు అవుతుందని మెకానిక్ చెప్పడంతో కోపంతోనే స్కూటీని తగలబెట్టానని చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీ్‌సలు రఫీని విచారించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తానే నిప్పు అంటించినట్లు పోలీ్‌సలకు వివరించాడు. కాగా పోలీ్‌సలు సైతం అతడి నుంచి రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
Updated Date - Jun 07 , 2024 | 11:35 PM