ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాశనకుంట.. కాలుష్య కాసారం

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:41 AM

గతంలో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతూ కళకళలాడిన కాశనకుంట చెరువు నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టూ పరిశ్రమలు విస్తరించడంతో అవి వదులుతున్న వ్యర్థాలు నేరుగా వచ్చి చెరువులో చేరుతున్నాయి. దీంతో నీరంతా రంగు మారి దుర్గంధాన్ని వెదజల్లుతోంది.

కలుషితపు నీటికి చనిపోయిన చేపలు, చెరువులోకి వెళ్తున్న కలుషితపు నీరు

చెరువులోకి చేరుతున్న ప్రమాదకర వ్యర్థాలు

ఇష్టారీతిన వదులుతున్న పరిశ్రమల యాజమాన్యాలు

రంగుగా మారి పనికి రాకుండా పోయిన చెరువు నీళ్లు

మృత్యువాత పడుతున్న చేపలు.. ఆందోళనలో మత్స్యకారులు

కలుషితమైన భూగర్భజలాలు.. స్థానికుల ఆగ్రహం

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

గతంలో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతూ కళకళలాడిన కాశనకుంట చెరువు నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టూ పరిశ్రమలు విస్తరించడంతో అవి వదులుతున్న వ్యర్థాలు నేరుగా వచ్చి చెరువులో చేరుతున్నాయి. దీంతో నీరంతా రంగు మారి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ మురుగు నీటితో భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయి. ఈ నీటిని వినియోగించిన వారు వ్యాధుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. కొత్తూర్‌ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈ చెరువు కాలుష్యంతో నిండి ఉనికి కోల్పోతోంది.

కొత్తూర్‌, సెప్టెంబరు 6: కొత్తూర్‌ మండల కేంద్రానికి ఆనుకుని దాదాపు 60 ఎకరాల్లో కాశనకుంట చెరువు విస్తరించి ఉంది. గతంలో కొత్తూర్‌ ప్రాంతానికి సాగు, తాగునీరు కోసం ఈ చెరువును వినియోగించేవారు. ఆ పరిసరాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు సైతం ఈ చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చెరువు చుట్టూ ఉన్న రైతులు వివిధ పంటలు వేసుకుంటూ జీవనం కొనసాగించారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల ద్వారా నేడు చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 1976లో కొత్తూర్‌లో అప్పటి ప్రభుత్వం పారిశ్రామికవాడను ఏర్పాటు చేసింది. దీంతో ఈ చెరువు చుట్టూ విరివిగా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రమాదకరమైన కాలుష్యకారక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయా పరిశ్రమల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తమ పరిశ్రమల్లో ఈటీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోకుండా కాలువల ద్వారా కాశనకుంట చెరువులోకి ప్రమాదకర వ్యర్థాలను వదులుతున్నారు. దాంతో చెరువు నీరు పచ్చగా మారి పూర్తిగా కలుషితమైపోయింది. చెరువు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం కలుషిమయ్యాయి. దీంతో చెరువు ఏ ఇతర అవసరాలకు పనికిరాకుండా పోయింది.

చేపల మృత్యువాత

కాశనకుంట చెరువు కలుషితం కావడంతో అందులో మత్స్య సంపదకు ఇబ్బందిగా మారింది. అందులో వేసిన చేప పిల్లలు కనీస ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో స్థానిక మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రమాదకర వ్యర్థాలతో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీని వల్ల తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు.

అనారోగ్యం బారిన ప్రజలు

నీరు కలుషితం కావడంతో, ఆ నీటిని వినియోగించిన స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. చర్మవ్యాధులు, వెంట్రుకలు ఊడిపోవడం, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్నారు. కలుషిత నీటిని తాగిన పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. పంటలు సైతం కనీస దిగుబడిన ఇవ్వని దుస్థితి.

చెరువును పరిరక్షించాలి

కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన కాశనకుంట చెరువును పరిరక్షించాలి. చెరువు పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితం కావడంతో పంటలు పండడం లేదు. దీంతో దిగుబడి సైతం రావడం లేదు. పరిశ్రమల యాజమానులు ఇష్టారాజ్యంగా కలుషిత నీటిని చెరువులోకి వదులుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి.

-బి. గోవింద్‌రెడ్డి, రైతు, కొత్తూర్‌

తీవ్రంగా నష్టపోతున్నాం

చెరువు నీరు కలుషితం కావడంతో చేపలు పెరగకుండా గిడుసు పారిపోతున్నాయి. కనీస దిగుబడి రావడం లేదు. దాంతో తీవ్ర నష్టాలకు గురవుతున్నాం. కలుషిత నీరు ఎక్కువగా వదిలినప్పుడు చేపలు మృత్యువువాత పడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.

- ఇప్పల గిరి ముదిరాజ్‌,

మత్స్యకార సొసైటీ కార్యదర్శి, కొత్తూర్‌

Updated Date - Sep 07 , 2024 | 12:41 AM

Advertising
Advertising