పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:37 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలోని గ్రామాల్లో క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల చర్చే నడుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెంచుకున్న మండల, గ్రామస్థాయి నాయకులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయాలు
ఎత్తుగడలు ప్రారంభించిన ఆశావహులు
అగ్రనేతల ప్రాపకం కోసం పాకులాట!
రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆందోళన
స్థానిక సమరానికి సన్నద్ధమవుతున్న పార్టీలు
ఆమనగల్లు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలోని గ్రామాల్లో క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల చర్చే నడుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెంచుకున్న మండల, గ్రామస్థాయి నాయకులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. వారి వారి పార్టీల అగ్రనేతల ప్రాపకం కోసం బరిలోనిలిచే నేతలు ఎత్తుగడలు సాగిస్తున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల నిర్వహణకు ఖర్చు కూడా బాగానే అవుతుందని అంచనాకు వచ్చిన కొందరు నేతలు.. అప్పుడే అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లలో సన్నద్ధమైంది. ఈమేరకు జనవరి 14న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని పార్టీల నేతలు భావిస్తున్నారు.
రిజర్వేషన్లపై ఆందోళన!
సమగ్ర కులగణన సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ వార్డులు మొదలుకొని జడ్పీ చైర్మన్ స్థానం వరకు రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. కులగణన నేపథ్యంలో బీసీలకు అన్ని స్థాయిల పదవుల్లో రిజర్వేషన్లు పెరిగే అవకాశముంది. దాంతో ఆ సామాజికవర్గం వారు బరిలో నిలిచేందుకు అప్పుడే ఉత్సాహం కనబరుస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులపై ఆశలు పెట్టుకొని వివిధ ప్రధాన పార్టీల్లో ఏళ్లకాలంగా ఉత్సాహంగా పనిచేస్తూ డబ్బు ఖర్చుకు వెనుకాడకుండా ముందుకెళ్లే నేతలు రిజర్వేషన్లు మారితే తమకు అవకాశం దక్కుతుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా సర్పంచ్ పదవికి పార్టీ బీఫామ్ కూడా ఉండదు కాబట్టి.. ఎక్కువ మంది పోటీపడి బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే గ్రామ స్థాయిలో వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని, ఈమేరకు పలు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ప్రజాప్రతినిధులు లేక పడకేసిన పాలన
గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31న, జిల్లా, మండల పరిషత్‌ల పదవీకాలం జూలై 4న ముగిసింది. గత 10 నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు లేకపోవడంతో నెలల కాలంగా గ్రామాల్లో అభివృద్ధి కొంతమేర కుంటుపడింది. పంచాయతీ సిబ్బందిపై కూడా పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీల నిర్వహణ కార్యదర్శులకు ఒకింత భారంగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది. గ్రామ పంచాయతీలకు, అన్ని మండలాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కాగా, గరిష్టంగా మూడు నెలలకు మించి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగరాదనే నిబంధన ఉంది. దాంతో స్థానిక ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి అనివార్యమైంది. వచ్చే జనవరిలో నోటిఫికేషన్ వేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
నాలుగు మండలాల్లో 102 పంచాయతీలు
ఆమనగల్లు మండలంలో 13, మాడ్గులలో 33, కడ్తాలలో 24, తలకొండపల్లిలో 32 గ్రామా పంచాయతీలున్నాయి. అదేవిధంగా నాలుగు మండలాల పరిధిలోని 41 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఆమనగల్లు, కడ్తాల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో నాలుగు మండలాల ఎంపీపీ స్థానాలు రిజర్వేషన్లలో భాగంగా మహిళలకే కేటాయించడం జరిగింది. ఈసారి ఎలా ఉంటుందోనని రాజకీయ చర్చ సాగుతోంది. మరోవైపు స్థానిక సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.
Updated Date - Nov 29 , 2024 | 11:37 PM