పల్లెపాలనపై నజర్
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:53 PM
పల్లెల్లో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలకు దిగారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించారు. అనేక చోట్ల పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించిన ఆయన చర్యలకు ఉపక్రమించారు.
-నేటి నుంచి గ్రామాల్లో అధికారుల పారిశుధ్య బాట
-వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌కు కలెక్టర్ ఆదేశం
-స్కూళ్లు, ఆసుపత్రులు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
-ఇళ్ల ముందు చెత్తవేస్తే జరిమానాకు ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
పల్లెల్లో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలకు దిగారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించారు. అనేక చోట్ల పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించిన ఆయన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు మండలాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రధానంగా స్కూళ్లు, ఆసుపత్రులు, హాస్టళ్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీంతో పలు మండల పంచాయతీ అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే కొన్ని మండలాలకు చెందిన అధికారులు మేజర్ పంచాయతీల్లో పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు.
పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల పారిశుధ్య సిబ్బంది వారం రోజుల పాటు ఈ డ్రైవ్‌లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అన్ని వీధులు శుభ్రంగా ఊడ్చడంతో పాటు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో ఉన్న ప్లాస్టిక్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అలాగే అన్ని ప్రభుత్వ భవనాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లడం, పిచ్చిమొక్కలు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధిగా గ్రామాల్లో ఇళ్ల నుంచి 100శాతం తడి, పొడి చెత్తను వేరు చేయించి ట్రాక్టర్ల ద్వారా కంపోస్ట్ యార్డులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో దోమలు, ఈగలు పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు తొలగించేందుకు సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి వారి ద్వారానే శుభ్రం చేయించనున్నారు. అలాగే హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లోని పల్లెపకృతి వనాల్లో వ్యర్థాలను తొలగించనున్నారు. వైకుంఠధామాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టనున్నారు.
ఇళ్లముందు చెత్త వేస్తే జరిమానా
ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే ఇళ్ల ముందు చెత్తవేసి , మురికినీరు రోడ్లపై వదులుతున్నా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో అపరిశుభ్రతకు కారకులైన వారిపై అవసరమైతే జరిమానాలు విధించాలని సూచించారు. గ్రామాల్లో పైపులైన్ లీకేజీలు అరికట్టడంతో పాటు తాగునీటి సరఫరా చేసే వాటర్ ట్యాంకుల్లో విధిగా క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. పంచాయతీల్లో అన్ని రికార్డులను అప్‌డేట్ చేయించడంతో పాటు స్పెషల్ డ్రైవ్‌లో చేపట్టే పనులకు సంబంధించిన ఫొటోలు తీసి రికార్డు చేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించిన నివేదికలు మండల పంచాయతీ అధికారులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Nov 19 , 2024 | 10:53 PM