కాగితాల్లోనే పార్కులు
ABN, Publish Date - Dec 05 , 2024 | 11:59 PM
అభివృద్ధిలో దూసుకుపోతున్న మేడ్చల్ మున్సిపాలిటీలో కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలకు రక్షణ కరువైంది. పార్కు స్థలాలు రికార్డుల్లో ఉన్నా పొజిషన్‌లో మాత్రం పార్కు స్థలాల్లో ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వెలిశాయి. పార్కు స్థలాలను కాపాడడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
కమ్యూనిటీ హాళ్లకు, పార్కింగులకు వినియోగం
50 కాలనీల్లో 120 పార్కు స్థలాల గుర్తింపు
మేడ్చల్ టౌన్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో దూసుకుపోతున్న మేడ్చల్ మున్సిపాలిటీలో కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలకు రక్షణ కరువైంది. పార్కు స్థలాలు రికార్డుల్లో ఉన్నా పొజిషన్‌లో మాత్రం పార్కు స్థలాల్లో ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వెలిశాయి. పార్కు స్థలాలను కాపాడడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్లలో పార్కుల కోసం స్థలాలు వదిలినట్లు రికార్డు చేశారు. పట్టణంలో 50 కాలనీల్లోని పంచాయతీ, హెచ్‌ఎండీఏ వెంచర్లలో 120 పార్కులు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే, పార్కులు ఎక్కడున్నాయన్న విషయం కాలనీల్లో ఉండేవారికి కూడా తెలియదు. ముఖ్యంగా పంచాయతీ లేఅవుట్లలో పార్కు స్థలాలు కబ్జా చేశారని అధికారులు గుర్తించారు. ఆ స్థలాలనూ వెంచర్ నిర్వాహకులు ప్లాట్లుగా అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి.
పార్కు స్థలాలన్నీ కబ్జాలపాలే!
కాలనీల్లోని పార్కు స్థలాలను కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి, సొసైటీ కార్యాలయాలు, వాహనాల పార్కింగ్‌లకు వాడుకుంటున్నారు. పదేళ్ల కాలంగా మేడ్చల్‌లో చేపట్టిన హరితహారంలో భాగంగా పార్కు స్థలాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినా చాలావరకు పార్కు స్థలాలను అలాగే వదిలేశారు. కొన్ని కాలనీల్లోని పార్కు స్థలాలను పరిసరాల్లో ఉన్న ప్లాట్లలో యజమానులు యథేచ్ఛగా భవనాలు నిర్మించుకున్నారు. లేఅవుట్ ప్రకారం పార్కు కోసం 400 చదరపు గజాల స్థలం వదిలినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పొజిషన్‌లో మాత్రం 200 గజాల స్థలం కూడా కన్పించడం లేదు. పార్కుకు ఆనుకొని ఉన్న ప్లాట్ల యజమానులు దర్జాగా పార్కు స్థలంలో నిర్మాణాలు చేపట్టారన్న విషయం అధికారులకు స్పష్టంగా తెలుస్తున్నా వారి పట్ల చర్యలు తీసుకోవడం లేదు.
జాగాలను పరిరక్షిస్తున్నాం
పార్కు స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీ లేఅవుట్‌లోని పార్కు స్థలాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటడం, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేస్తున్నాం. పార్కు స్థలాల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తాం. పరుల ఆధీనంలో పార్కు స్థలాలు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకుంటాం.
- నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్
పార్కు స్థలాలను కాపాడాలి
కాలనీల్లోని పార్కు స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలి. పార్కు స్థలాల్లో మొక్కలు నాటి పిల్లలు ఆడుకునేలా పరికరాలు ఏర్పాటు చేయాలి. జీపీలు, బస్తీలోని స్థలాల్లో దవాఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- మహబూబ్ అలీ, మేడ్చల్
స్థలాలు కబ్జా కాకుండా చూడాలి
పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బస్తీల్లో పిల్లలు ఆడుకునేలా ఆట పరికరాలు ఏర్పాటు చేయాలి. పంచాయతీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్ల ప్రకారం పార్కులకు వదలిసిన స్థలాలను కచ్చితంగా గుర్తించి వాటికి హద్దులు ఏర్పాటు చేయాలి. ఒకవేళ వాటిల్లో ఇప్పటికే నిర్మాణాలుంటే కూల్చి పార్కు జాగాలను పరిరక్షించాలి. కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలి.
- నడికొప్పు నాగరాజు, మేడ్చల్
Updated Date - Dec 05 , 2024 | 11:59 PM