మొక్కుబడిగా ధాన్యం కొనుగోళ్లు
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:16 AM
మండలంలోని యాచారం, చింతపట్ల, నందివనపర్తి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. రెండు కేంద్రాలకు సోమవారం సాయంత్రం నాటికి 70 క్వింటాళ్ల ధాన్యం చేరింది. యాచారం మండల కేంద్రంలో మంగళవారం కొనుగోలు కేంద్రం తెరిచారు.
యాచారం మండలం చింతపట్ల, నందివనపర్తి కొనుగోలు కేంద్రాలకు చేరిన 70 క్వింటాళ్ల వడ్లు
అధికారుల నిర్లక్ష్యంతో దళారీలకు విక్రయిస్తున్న రైతులు
యాచారం, నవంబరు 12 (ఆంఽద్రజ్యోతి) : మండలంలోని యాచారం, చింతపట్ల, నందివనపర్తి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. రెండు కేంద్రాలకు సోమవారం సాయంత్రం నాటికి 70 క్వింటాళ్ల ధాన్యం చేరింది. యాచారం మండల కేంద్రంలో మంగళవారం కొనుగోలు కేంద్రం తెరిచారు. వివిధ గ్రామాలకు చెందిన దళారీలు నేరుగా రైతుల పంట పొలాలకు చేరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మండలంలో గత మూడు వారాల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే, అంతకుముందే కొనుగోలు కేంద్రాలను తెరవాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో వడ్లు దళారీలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. వారు క్వింటాల్‌కు రూ.2,400 ధర చెల్లిస్తుండడంతో రైతులు అప్పగిస్తున్నారు. కాగా, ప్రభుత్వం క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,300లకు కొనుగోలు చేస్తోంది. దళారీలు రూ.100 అధికంగా ఇస్తుండడంతో రైతులు వారి వైపు మొగ్గుచూపుతున్నారు. వారం రోజుల క్రితం నందివనపర్తి, చింతపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమే కానీ, గింజ వడ్లు అమ్మకానికి రాలేదు. కొంత మంది దళారీలు పంట వేసే సమయంలో రైతులకు అప్పులు ఇస్తున్నారు. పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొంటున్నట్లు పలువురు రైతులు తెలిపారు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే అధికారులు ఇబ్బంది పెట్టడంతో దళారీలకు విక్రయించకతప్పడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దాదాపు 80శాతం ధాన్యం దళారీలు కొనుగోలు చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల వ్యవసాయాధికారి రవినాథ్ రైతులను కోరుతున్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:16 AM