ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆనందాల హరివిల్లు... ప్రకృతి పొదరిల్లు

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:37 PM

నిత్యం ఉరుకులు పరుగుల జీవనం గడుపుతున్న పట్టణ వాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ప్రకృతి చెంతనే జీవించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పల్లెల్లో ఫాంహౌస్‌ కల్చర్‌ విస్తరిస్తోంది.

బాకారం జాగీర్‌ గ్రామ పరిధిలోని ఫామ్‌హౌస్‌లో వాటర్‌ ఫాల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న పిల్లలు

పల్లెలకు పాకిన ఫామ్‌హౌస్‌ సంస్కృతి

ప్రకృతి ఒడిలో సేదదీరుతున్న నగర వాసులు

పొలాల మధ్య సకల సౌకర్యాలతో నిర్మాణం

వారాంతాల్లో బంధుమిత్రులతో కలిసి విడిది

నిత్యం ఉరుకులు పరుగుల జీవనం గడుపుతున్న పట్టణ వాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ప్రకృతి చెంతనే జీవించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పల్లెల్లో ఫాంహౌస్‌ కల్చర్‌ విస్తరిస్తోంది. అనేక మంది పంటపొలాల వద్ద తమకు కావలసిన విధంగా ఫాంహౌస్‌లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడి నుంచే ప్రయాణం కొనసాగిస్తుండగా, ఇంకొంత మంది వారాంతపు సెలవుల్లో ఫాంహౌస్‌లకు వెళ్లి సేదతీరుతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి లాంటి మెట్రోపాలిటన్‌ నగరాల శివారులో బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు విశాలమైన వ్యసాయ భూములను కొనుగోలు చేసి ఫామ్‌హౌ్‌సలు నిర్మించుకునే వారు. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్లి ప్రకృతి అందించే స్వేచ్ఛాయూత వాయువులను పీల్చేవారు. రకరకాల మొక్కలను పెంచుకుని అవి అందించే మకరందాన్ని ఆస్వాదించేవారు. మొత్తంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే వారు. ఆ సంస్కృతి ఇప్పుడు పల్లెలను తాకింది. బడా వ్యాపారులు, బిల్డర్‌లు, ఉన్నతస్థాయి ఉద్యోగులు మారుమూల గ్రామాల్లో అర ఎకరం నుంచి ఐదెకరాల వరకు వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్‌, ఫ్రీకాస్ట్‌, ప్రహరీ ఏర్పాటు చేసుకొని రకరకాల పండ్ల, పూల మొక్కలను, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలోని పచ్చని చెట్ల మధ్య ఆకర్షణీయంగా ఫామ్‌హౌ్‌సలను నిర్మించుంటున్నారు. వారంలో రెండు రోజుల పాటు ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

సకల సౌకర్యాలతో నిర్మాణం

వ్యవసాయ క్షేత్రాల్లో అన్ని హంగులతో సకల సౌకర్యాలు ఉండేలా ఫామ్‌హౌ్‌సలు నిర్మించుకుంటున్నారు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు ఎందరు వచ్చినా సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. అవసరమైతే చిన్న చిన్న వేడుకలను జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, ఆటల కోర్టులు, వాకింగ్‌ కోసం నిర్మాణాలు చేసుకుంటున్నారు.

పెరుగుతున్న కల్చర్‌

నగరాల్లో ప్రతి రోజూ కాలుష్యంతో సమరం చేస్తూ జీవనం సాగిస్తున్న పట్టణవాసులు ఒక్క రోజైనా పల్లెల్లో గడపాలని భావిస్తున్నారు. మధ్యతరగతి వారు దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కాటేజీల్లో బస చేస్తుంటే, ధనికులు సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఫాంహౌ్‌సలను నిర్మించుకుంటున్నారు. పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఈ ఫాంహౌ్‌సలను ఏర్పాటు చేసుకుని ప్రకృతి సహజసిద్ధ వాతావరణంలో జీవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని చిలుకూరు, నక్కలపల్లి, తోల్‌కట్ట, ఎనికెపల్లి, అజీజ్‌నగర్‌, కుద్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, కేతిరెడ్డిపల్లి, చిన్నమంగళారం, అమ్డాపూర్‌ వంటి ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ఎక్కువగా ఫాంహౌజ్‌లు నిర్మించుకున్నారు. ఇంకా చాలావరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలం ముడిమ్యాల, దేవుని ఎర్రవల్లి, ఆలూరు, గొల్లపల్లి, ఈర్లపల్లి, రామన్నగూడ, న్యాలట, శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి, వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ ప్రాంతాల్లో ఎక్కువగా ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయి. కొంతమంది యువకులు వ్యవసాయాన్ని ఓ ఫ్యాషన్‌గా ఎంచుకుంటున్నారు. పొలం చెంతనే ఫార్మర్‌హౌజ్‌ ఏర్పాటు చేసుకొని విభిన్న రీతుల్లో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడే తమ కుటుంబంతో స్వచ్ఛమైన గాలి, నీరుతో పాటు ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:30 AM