యాసంగి కష్టమే?
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:21 PM
ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. లోటు వర్షపాతం, అడుగంటు తున్న భూగర్భ జలాలు ఈ సారి పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం
రంగారెడ్డి జిల్లాలో 5 శాతంలోపే పంటలు
వికారాబాద్‌లో 18.25 శాతం
ఈ సీజన్‌లో 50 శాతం లోటు వర్షపాతం
శరవేగంగా పడిపోతున్న భూగర్భజలాలు
ఆందోళనలో రైతాంగం
ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. లోటు వర్షపాతం, అడుగంటు తున్న భూగర్భ జలాలు ఈ సారి పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది ఈపాటికే వరి నాట్లు, ఆరుతడి పంటలు ముమ్మరంగా సాగయ్యాయి. కానీ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో కురవాల్సిన వర్షాలు ముఖం చాటే యడంతో రైతన్నకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు కష్టమేనని దిక్కులు చూస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : వానాకాలం విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సాగు పెరిగినప్పటికీ యాసంగిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా కనీస స్థాయిలో కూడా వర్షాలు పడకపోవడంతో యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాసంగిలో ఆయా పంటల సాగు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. మోస్తరు వర్షాలు కూడా లేకపోవడంతో భూమిలో తడిలేక ఆరుతడి పంటలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు వానాకాలం సీజన్‌లో వేసిన వరిపంట కోతలు కూడా ఆలస్యమవుతున్నాయి. గడిచిన రెండు వారాలుగా తుపాన్ కారణంగా మబ్బులు కమ్ముకోవడంతో వరి కోతలపై ప్రభావం పడింది. సాధారణంగా వరి సాగు చేసే చోట రెండో పంట వేస్తుంటారు. కోతలు ఇంకా పూర్తికాకపోవడంతో యాసంగి సాగు విస్తీర్ణం కూడా ఇంకా పెరగలేదు. కనీస స్థాయిలో కూడా ఈ ఏడాది పంటలు సాగు జరగలేదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు యాసంగిలో 4.5శాతమే పంటలు సాగు కావడం గమనార్హం. అయితే వికారాబాద్‌లో మాత్రం పరిస్థితులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. ఇక్కడ 18.25శాతం పంటల సాగు జరిగింది. మేడ్చల్‌లో కనీసం ఒక్కశాతం కూడా పంటలు వేయలేదు.
సాగు తక్కువే..
ఉమ్మడి జిలాలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా తగ్గిపోవడం యాసంగి పంటల సాగుపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నవంబరు నెలాఖరు నాటికి భూగర్భజలాలు 1.55 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 1,11,072 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా... ఇప్పటి వరకు 20,321 ఎకరాల్లో పంటలు వేశారు. అలాగే రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 1,02,063 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం 4,546 ఎకరాలు మాత్రమే రైతులు పంటలు వేశారు. అంటే కనీసం అయిదు శాతం కూడా పంటలు సాగు చేయలేదు. గత ఏడాది ఇదే సమయానికి 67,866 ఎకరాల్లో పంటలు వేయడం గమనార్హం. మేడ్చల్ జిల్లాలో సీజన్‌లో కనీసం ఒక్కశాతం కూడా పంటలు సాగు చేయలేదు. అయితే యాసంగి సీజన్‌లో కొన్ని పంటలు వేసేందుకు ఇంకా గడువు ఉండడంతో వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బోర్లు ఉన్న రైతులు రెండో పంటగా కూడా వరి వేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
శరవేగంగా పడిపోతున్న భూగర్భజలాలు
ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగిలో సాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన నెల రోజుల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. వేసవికి ముందే భూగర్భజలాలు అడుగంటడంతో యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ నెలాఖరుతో పోలిస్తే నవంబరు నెలాఖరు నాటికి భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. రంగారెడ్డిజిల్లాలో గత అక్టోబర్ నెలాఖరు నాటికి 7.71 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా నవంబరు నెలాఖరు నాటికి 9.36 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే ఒక నెలలో 1.55 మీటర్ల కిందకు నీటి నిల్వలు పడిపోయాయి. అలాగే వికారాబాద్‌లో అక్టోబరు నెలాఖరుతో నవంబరు నెలాఖరు పోలిస్తే 0.21 మీటర్లు నీటినిల్వలు తగ్గాయి. అలాగే మేడ్చల్ జిల్లాలో ఒక నెలలో 2.60 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సగటుకు మించి వర్షపాతం నమోదైంది. రంగారెడ్డిజిల్లాలో వానాకాలం 32శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లాలో 41శాతం, మేడ్చల్ జిల్లాలో 21శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగానే పెరిగాయి. అయితే యాసంగి ఆరంభం తరువాత వర్షాలు పడలేదు. ఉమ్మడి జిల్లాలో యాసంగిలో దాదాపు 50శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాలు శరవేగంగా పడిపోతున్నాయి. అనేక మండలాల్లో ఇప్పటి వరకు సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదు కాలేదు. మరో వైపు విచ్చలవిడిగా నీటి వాడకం పెరగడంతో శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీని ఫ్రభావం యాసంగి పంటలపై కూడా పడుతోంది.
51శాతం లోటు వర్షపాతం
మూడు జిల్లాల్లో యాసంగి సీజన్‌లో కనీస స్థాయిలో కూడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. యాసంగిలో రంగా రెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సగటు 123.5మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 62మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే దాదాపు 51శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే మేడ్చల్ జిల్లాలో 42శాతం, వికారాబాద్ 16శాతం తక్కువ వర్షం కురిసింది. యాసంగిలో పంటల సాగుకు కీలకమైన నవంబరు, డిసెంబరు నెలల్లో వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:21 PM