‘పట్టు’ వదిలేశారు!
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:38 PM
షాద్‌నగర్ నియోజకవర్గంలో మల్బరీ పంటల సాగు ప్రోత్సాహం కరువైంది. రానురాను పంట విస్తీర్ణం పడిపోతుంది. పంట దిగుబడి, లాభనష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో మల్బరీ సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.
నిర్లక్ష్యం నీడలో సెరికల్చర్
2014 నుంచి కొత్తగా నియామకాల్లేవ్
వెంటాడుతున్న అధికారుల కొరత
రైతులకు అవగాహన కల్పించేవారు కరువు
పడిపోతున్న మల్బరీ సాగు విస్తీర్ణం
షాద్‌నగర్‌రూరల్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): షాద్‌నగర్ నియోజకవర్గంలో మల్బరీ పంటల సాగు ప్రోత్సాహం కరువైంది. రానురాను పంట విస్తీర్ణం పడిపోతుంది. పంట దిగుబడి, లాభనష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో మల్బరీ సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యానవన శాఖలో విలీనం చేసిన తర్వాత సెరికల్చర్ నిరాదరణకు గురైందని పలువురు చర్చించుకుంటున్నారు. సెరికల్చర్‌లో రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తరణ అధికారులు లేకపోవడం కారణంగానే సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పవచ్చు.
పోస్టులు ఖాళీగా దర్శనం
సెరికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 2014 నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదంటున్నా... అంతకు ముందు నుంచే పోస్టుల భర్తీ జరగలేదని కొందరు అధికారులు అంటున్నారు. చాలామంది పదవీ విరమణ చేయగా మిగిలిన ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారు. షాద్‌నగర్ డివిజన్‌లో లింగారెడ్డిగూడ, కమ్మదనంలో మల్బరీ విత్తన క్షేత్రాలు ఉన్నాయి. వీటికి ఒక సెరికల్చర్ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్‌లు ఉండాలి. కానీ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని పనులు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో షాద్‌నగర్ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో మల్బరీ పంట సాగవుతుండటంతో పట్టణంలోని కేశంపేట రోడ్డులో రోలింగ్ యూనిట్‌ను కూడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అధికారి ఉండేవారు. ప్రస్తుతం రోలింగ్ యూనిట్ అధికారి ప్రమోషన్‌పై వెళ్లడంతో వికారాబాద్‌లో పని చేసేవారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మల్బరీ విత్తన క్షేత్రాల్లో రెగ్యులర్ ఉద్యోగులు లేక దినసరి కూలీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వారు కూడా అందుబాటులో లేరు.
ఉన్నది ఒక్క ఉద్యోగి... ఆయన స్థానంలో మరొకరు విధులు
కమ్మదనం మల్బరీ విత్తన క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగులు ఉండగా వారిలో యాదయ్య అనే ఉద్యోగి పదవీ విరమణ చేశారు. ఉన్న ఒక్క ఉద్యోగి బాలయ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయనకు బదులు పదవీ విరమణ పొందిన యాదయ్య విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పుడైనా రైతులు మల్బరీ విత్తనాల కోసం వస్తే వాళ్లే వాటిని కోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
జిల్లాలో 320 ఎకరాలు.. షాద్‌నగర్‌లో 40 ఎకరాలు
గతంలో వందల ఎకరాల్లో సాగయ్యే మల్బరీ తోటలు సాగయ్యేవి. ప్రస్తుతం సాగు పూర్తిగా పడిపోయింది. జిల్లాలో 320 ఎకరాలు సాగవుతుండగా షాద్‌నగర్ డివిజన్‌లో 40 ఎకరాలు సాగవుతుంది. ఒకప్పుడు మల్బరీ రైతులు వద్దకు అసిస్టెంట్లు వెళ్లి గుడ్ల నుంచి పంట చేతికొచ్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు గురించి వివరించేవారు. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా రైతులకు అవగాహన కల్పించేవారే లేకుండా పోయారు.
పెండింగ్ లోనే రూ.3.50 కోట్ల ఇన్సెంటివ్
మల్బరీ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో కిలోకు రూ. 50 ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పట్లో మంత్రి హరీ్‌షరావును కలిసి పట్టుకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరగా కిలోకు రూ.75 ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఆరు నెలల పాటు ఇచ్చారు. తర్వాత ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వం రైతులు ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో రూ. రెండు కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా ఇన్సెంటివ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది.
షెడ్ల నిర్మాణానికి దక్కని రాష్ట్రం వాటా...
పట్టు పురుగుల పెంపకం కోసం నిర్మించే షెడ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన రాష్ట్రం వాటా అందడం లేదు. షెడ్డు నిర్మాణం రూ.4లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది. అందులో రూ.2లక్షలు కేంద్ర ప్రభుత్వం, లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, లక్ష రూపాయలు రైతు వాటాగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు చేల్లిస్తున్నా రాష్ట్రం వాటా రావడం లేదని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 20మంది వరకు రైతులు షెడ్లు నిర్మించుకుని రాష్ట్రం వాటా కోసం ఎదురు చూస్తున్నారు.
శిథిలావస్థలో భవనాలు
ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ, కమ్మదనం మల్బరీ వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించిన భవనాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత లింగారెడ్డిగూడలో ఉన్న ఏడీ కార్యాలయాన్ని మహబూబ్‌నగర్‌కు తరలించారు. అనంతరం కార్యాలయాలు మూత పడ్డాయి. లింగారెడ్డిగూడలో ఓ భవనాన్ని ఆర్‌డీఓ కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. మిగతా భవనాలు వృథాగా ఉన్నాయి.
మూడు నెలల నుంచి జీతాల్లేవ్
మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. పూట గడవడం కష్టంగా మారింది. పని భారం కూడ ఎక్కువైంది. నెల నెలా జీతాలు ఇవ్వాలి.
నీలమ్మ, రోలింగ్ ఉద్యోగి- షాద్‌నగర్‌రూరల్
పదవీ విరమణ సమయంలో భరోసా ఇవ్వాలి
ఏళ్ల తరబడి పని చేసినా పదవీ విరమణ సమయంలో ఉత్త చేతులతో ఇంటికి పోవాల్సి వస్తుంది. దీంతో భవిష్యత్ ఆందోళనగా ఉంది. ఆసరా కల్పించాలి.
కేశవులు, రోలింగ్ వర్కర్- షాద్‌నగర్
అవగాహన కల్పిస్తున్నాం
మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బంది లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా తమ వంతు కృషి చేస్తున్నాం.
ముత్యాలు, అసిస్టెంట్ డైరెక్టర్- షాద్‌నగర్
Updated Date - Nov 14 , 2024 | 11:38 PM