తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:58 PM
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
షాద్‌నగర్, సెప్టెంబరు 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, అందెబాబయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంఐఎం మెప్పు కోసమే సెప్టెంబరు 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఆనాటి రజాకార్ల నాయకుడు ఖాసీంరజ్వీ వారసత్వానికి సంబంధించిన పార్టీయే ఎంఐఎం అని తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారి ఆత్మశాంతి కోసమైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవానికి పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తా, చెట్ల వెంకటేష్, గట్టోజి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 15 , 2024 | 11:58 PM