ప్లాట్లు అమ్ముతామని నమ్మించి.. వ్యాపారి కిడ్నాప్
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:13 AM
ఓ వ్యాపారిని ప్లాట్లు విక్రయిస్తామని పిలిపించి కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధి బొంగులూరు వద్ద చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం టౌన్ బోయవాడ బస్తీలో నివాసముంటున్న రచ్చ నారాయణ వస్త్ర వ్యాపారంతో పాటు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.
రూ.కోటి కోసం డిమాండ్
ఆస్తి కోసం కాగితాలపై సంతకాలు..
వేలిముద్రలు తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. ఆలస్యంగా వెలుగులోకి..
ఇబ్రహీంపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఓ వ్యాపారిని ప్లాట్లు విక్రయిస్తామని పిలిపించి కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధి బొంగులూరు వద్ద చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం టౌన్ బోయవాడ బస్తీలో నివాసముంటున్న రచ్చ నారాయణ వస్త్ర వ్యాపారంతో పాటు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. పది రోజుల క్రితం ఓ మహిళ వాయి్‌సతో ఆయనకు ఓ కాల్ వచ్చింది. కారు ఇన్సూరెన్స్‌కు సంబంధించి మాట్లాడి.. మీరు రియల్‌ఎస్ట్టేట్ వ్యాపారం చేస్తారు కదా అని అడిగి బొంగులూరు దగ్గర తమ ప్లాట్లు ఉన్నాయి.. కొంటారా? అని అడిగారు. దాంతో ఆయన ఈనెల 21న మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో తన కారులో డ్రైవర్ ముజిబ్‌ఖాన్‌తో కలిసి బొంగులూరు దగ్గర ఉన్న మెట్రోసిటీ వెంచర్‌కు వెళ్లాడు. ఇంతలో నలుగురు వ్యక్తులు వచ్చి నారాయణతో పాటు డ్రైవర్‌ను కారులో ఎక్కించుకున్నారు. ఇద్దరి ముఖాలకు నల్లటి మాస్కులు, చేతులకు హ్యాండ్‌కప్స్ వేసి 45 నిమిషాల తర్వాత ఓ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో ఉంచారు. ఒకరు పోలీస్ యూనిఫాంతో ఉండగా మిగిలిన వ్యక్తులు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. పోలీస్ యునిఫాంలో ఉన్న అతను నారాయణ తలకు గన్‌పెట్టి రూ.కోటి రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు. తన దగ్గర అంత డబ్బు లేదని సమాధానమీయడంతో పది కాగితాలపై ఆస్తికి సంబంధించి సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొంగర కలాన్ ఏరియాలోని ఓపెన్ వెంచర్‌లో దించి కారు, సెల్‌ఫోన్ అప్పగించారు. దాంతో భయపడిపోయిన నారాయణ నల్లగొండ జిల్లా చండూరు లో ఉన్న అల్లుడికి ఫోన్‌చేసి కారులో చండూరు వెళ్లాడు. ఆదే సాయంత్రం ఆయనకు ధైర్యం చెప్పిన అల్లుడు.. ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి కుటుంబ సభ్యులను అప్పగించారు. శనివారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Nov 24 , 2024 | 12:13 AM