అందరి అభిప్రాయాలు పరిగణిస్తాం
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:17 AM
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రజలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు అన్నారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు
రంగారెడ్డి అర్బన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రజలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం బహిరంగ విచారణను నిర్వహించింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ అభిప్రాయాలను కమిషన్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలను, సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు లోబడి రిజర్వేషన్ల అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బహిరంగ విచారణలో ప్రజల నుంచి ఎంతో విలువైన సమాచారం లభించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంతో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నెల రోజుల్లో ప్రభుత్వానికి సమగ్రనివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి సైదులు, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీపీఆర్వో వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
ఎవరేమన్నారంటే..
బీసీ కుల గణనలో విశ్వకర్మలైన (కమ్మరి, వడ్రంగి, కంచరం, శిల్పి, స్వర్ణకార) ఐదు వృత్తిదారులను ‘విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ’ పదాలను ఒకే కులంగా పరిగణించాలని విశ్వకర్మ సంఘం జిల్లా కార్యదర్శి పెద్దకొలిమి బ్రహ్మచారి, రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షుడు వెంకటాచారి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ‘బుసాని’ని కోరారు. పూసల కులానికి 17 శాతం రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయంగా గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, పూసల సంఘం నాయకుడు సదానందం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌ను కోరారు. తక్కువ కుటుంబాలున్న కులాలకు రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించాలని సీపీఐఎం నాయకుడు పడగాల యాదయ్య కోరారు. వడ్డెరులకు రానున్న స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని వడ్డెర సంఘం నాయకులు మాగయ్య, బి. రవి కోరారు. మేదరులకు వెదురు బొంగులు ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని, రాజకీయంగా గుర్తించాలని, చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని సంఘం నాయకులు గంగాధర్, ఉమ, హన్మంత్, శ్రీనివాస్ కోరారు. బీసీ లెక్కలు తేలాకే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం నాయకుడు మల్లేష్ యాదవ్ కోరారు. తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి స్వల్పచారి, మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, తెలంగాణ సంచార జాతుల సంఘం నాయకులు నరేందర్, రజక సంఘం నాయకులు సాంబరాజు కుమార్, వీరముష్టి కులానికి చెందిన నాయకుడు గండి స్వామి, వీరముష్టి కులానికి చెందిన నాయకుడు గండి స్వామి, ఎమ్మార్పీఎస్ నాయకుడు మదిలేటి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి అపోహలూ వద్దు:
కలెక్టర్ నారాయణరెడ్డి
సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. జిల్లాకు విచ్చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి సైదులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. పబ్లిక్ హియరింగ్ అనంతరం ఆయన మాట్లాడారు. సమగ్ర వివరాల కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు దగ్గర ఉంచుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సంచార జాతులు పనిచేస్తున్న చోటే వివరాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీసీ కులాలే కాదు.. అన్నికులాల వారి వివరాలను సమగ్ర కుటుంబ సర్వేలో సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Nov 14 , 2024 | 12:17 AM