గుంతలను పూడ్చేదెన్నడో?
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:01 AM
ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం రోడ్లపై గుంతలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేతల ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలు
గుంతల రోడ్లను పట్టించుకోని వైనం
వాహనదారులకు తప్పని తిప్పలు
మేడ్చల్ టౌన్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం రోడ్లపై గుంతలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై చూపడంలేదని పలువురు అంటున్నారు. మేడ్చల్‌లో అధికార పార్టీ కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరాన ఉన్న హౌజింగ్ బోర్డు మేయిన్ రోడ్డు మధ్య మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. వ్రివేకానంద చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయానికి వచ్చే నాయకులు, ప్రజా ప్రతినిధులందరూ ఈ గుంతను దాటి వస్తున్నా మ్యాన్ హోల్ వైపు కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు. దాదాపు 15రోజుల నుంచి మ్యాన్ హోల్ గుంత వద్ద ఒక కర్ర పాతి దానికి ఎర్ర బట్ట కట్టేసి వదిలేశారు. వివేకానంద చౌరస్తా నుంచి హౌజింగ్ బోర్డు మీదుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఈ రోడ్డును రెండు సంవత్సరాల కిందట మరమ్మతులు చేయగా కొద్ది రోజులకే మ్యాన్ హోల్‌లు కుంగిపోయాయి. అదేవిధంగాపట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో జాతీయ రహదారి నుంచి ఉమానగర్ వెళ్లే రోడ్డు మధ్య పెద్ద గుంత ఏర్పడింది. ప్రజాపాలన విజయోత్సవాల సంబురాలు జరుపుకుంటూ వీధులు శుభ్రం చేస్తూ, కాల్వలను శుభ్రం చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్న ప్రజా ప్రతినిధులు ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Dec 07 , 2024 | 12:01 AM