రెఫరెండమే!
ABN, Publish Date - Mar 27 , 2024 | 05:10 AM
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుని సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని రంగారెడ్డి
వంద రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే ఇందుకు గీటురాయి
6 లేదా 7న తుక్కుగూడలో శంఖారావం
5 గ్యారెంటీలకు రాహుల్ హామీ: సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుని సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని రంగారెడ్డి జిల్లా నుంచే పూరిస్తామని, ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి రేవంత్ గుర్తు చేశారు. మళ్లీ అక్కడే జాతీయ స్థాయిలో ఐదు గ్యారెంటీలను ప్రకటించుకోబోతున్నట్లు చెప్పారు. మంగళవారం సీఎం రేవంత్ నివాసంలో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లలో 14 సీట్లు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతేచేవెళ్లలో రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరిలో సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ని పార్టీ అభ్యర్థులుగా అధిష్ఠానం ప్రకటించిందని అన్నారు.
పదేళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారు?
గడిచిన పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ.. రాష్ట్రానికి, దేశానికి ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. ‘‘ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్థి చేసుకున్న ఆయన.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్థికి నిధులు ఇవ్వలేదు. రీజనల్ రింగు రోడ్డు రాకుండా.. బీజేపీ మోకాలు అడ్డుతోంది. ఇంక ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలి?’’ అంటూ బీజేపీ నేతలను నిలదీశారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు అభ్యర్థులను కాకుండా మోదీని చూపించి ఓటడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి అన్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి ఉందని వ్యాఖ్యానించారు.
ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం
రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి, సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.
దొంగలను తీసుకు రాకండి: రేవంత్‌కుకేఎల్‌ఆర్ విజ్ఞప్తి
‘‘మీరు డోర్ తెరుస్తం.. డోర్ తెరుస్తం అంటున్నరు. పార్టీని మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకువస్తే.. మా లాంటి నాయకులు మళ్లీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కార్యకర్తలూ చచ్చిపోయే ఛాన్స్ ఉంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివేదించారు. అక్కడక్కడా రేవంత్‌రెడ్డి, కేఎల్‌ఆర్‌కు పడదని అనుకుంటున్నారని, మనిద్దరం దగ్గర మిత్రులమన్న సంగతి మీరే చెప్పాలని సీఎంను కోరారు. ఈ విషయం తాను చెబితే జనం నమ్మేట్లు లేరన్నారు. చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో తన అభిప్రాయాలు వినిపిస్తూ కేఎఆల్‌ఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వీడియో క్లిప్పింగ్ మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జనజాతర ఏర్పాట్లపై 29న టీపీసీసీ భేటీ
జన జాతర పేరుతో తుక్కుగూడలో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 29న గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. ఇదే సమావేశంలో బూత్ స్థాయి నుంచి లోక్‌సభ స్థాయి వరకు మూడంచెల సమన్వయ కమిటీల వ్యవస్థ ఏర్పాటుపైనా కసరత్తు జరగనుంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముఖంగా నేతలు మాట్లాడకుండా ఈ సమావేశం వేదికగా ప్రకటన చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాల పైనా చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యవర్గం హాజరు కానుంది. ఈ సమావేశం ఏర్పాట్లపైన తనను కలిసిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Updated Date - Mar 27 , 2024 | 05:10 AM