ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth : 8వ తేదీకి రైతు భరోసా పూర్తి

ABN, Publish Date - May 05 , 2024 | 05:49 AM

రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు ఇచ్చాం

మిగిలిన 4 లక్షల మందికి ఈ నాలుగు రోజుల్లో..

పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రైతు రుణమాఫీ

హామీ నిలబెట్టుకుంటే.. కేసీఆర్‌, హరీశ్‌

అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా?

కాంగ్రెస్‌ ఏమీ చెయ్యలేదంటున్న కేటీఆర్‌

చీర కట్టుకొని బస్సెక్కాలి.. టికెట్‌ అడిగితే ఒట్టు!

బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగాన్ని

మారుస్తామన్నారు.. చెప్పుతో ఎవరిని కొట్టాలి?

చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసం వాల్‌రైటింగ్‌ చేశా

70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం

పదవొస్తే అరుణమ్మకు కోపమెందుకు?

కొత్తగూడెం, వనపర్తి, సికింద్రాబాద్‌,

ముషీరాబాద్‌లో రోడ్‌షోలు, సభల్లో రేవంత్‌

కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత ఏడాది డిసెంబరు నెల నుంచే రైతుభరోసాను రైతన్నల అకౌంట్లలో వేయడం ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీ నాటికి మిగిలిన రైతులకు రైతుభరోసా డబ్బులు వేస్తామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7500 కోట్లు జమ చేసినట్లవుతుందని స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో కార్నర్‌ మీటింగ్‌లో, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా, పాలమూరు జిల్లా దైవం కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రైతుల .2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. లేకపోతే తన జన్మ ఎందుకని, ఈ సీఎం పదవి ఎందుకని పేర్కొన్నారు. సిద్దిపేటకు శనిలా పట్టుకున్న శనీశ్వరరావు రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఇచ్చిన మాట ప్రకారం నేను రైతు రుణమాఫీ చేస్తే కేసీఆర్‌, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? చెప్పిన గడువులోపు రుణమాఫీ చేయలేకపోతే ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం’ అని సీఎం సవాల్‌ విసిరారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు ఆమోదించారని తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని.. గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని చెప్పారు. అటువంటి మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి?

రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన వాళ్లను చెప్పుతో కొట్టాలని బీజేపీ నేత బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్‌ కుమార్‌ గౌతమ్‌.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ‘బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి?’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లాపడి బొక్కలు విరిగిన కేసీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి పూర్తిగా పక్కకు నెట్టాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రూ.వేల కోట్ల అప్పులకు ఇప్పుడు తాము వడ్డీలు కడుతూ, అందరికీ పథకాలు అందిస్తున్నామని, ఉద్యోగులకు 1న వేతనాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. 9లోపు ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు.

కేటీఆర్‌ చీర కట్టుకొని బస్సు ఎక్కాలి!

వందరోజుల్లో తాము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేయడం లేదని కేటీఆర్‌ అంటున్నారని, ఆయన మంచిగా చీర కట్టుకొని తయారై ఆర్టీసీ బస్సు ఎక్కాలని, ఒకవేళ నిన్ను టికెట్‌ అడిగితే మేమేమీ చేయనట్టేనని సీఎం ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌ నుంచి యాదగిరిగుట్టకైనా, జూబ్లీహిల్స్‌ నుంచి సిరిసిల్లకైనా, జూబ్లీహిల్స్‌ నుంచి మీ నాన్న సొంత ఊరు చింతమడకకైనా బస్సులో నిన్ను ఒక్కపైసా అడిగితే నా మీద ఒట్టే అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించలేదని, ముషీరాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్‌ గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని తెలిపారు. రాహుల్‌ గాంధీ, సోనియా, ఖర్గే నాయకత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, దానం నాగేందర్‌ను గెలిపిస్తే కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే బాధ్యత తనదని చెప్పారు.


రాజకీయాలకు దిక్సూచి ఖమ్మం

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ఒక దిక్సూచి అని, చైతన్యవంతమైన ప్రజలు ఈ జిల్లాలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలంటే ఆచితూచి వ్యవహరిస్తానని, ఈ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో తాను తలదూర్చబోనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు.. 23 జిల్లాలకుగాను 22 జిల్లాల వ్యవహారాలను స్వయంగా ఆయనే చూసుకునేవారని, ఖమ్మం జిల్లాను మాత్రం అక్కడి ప్రజాప్రతినిధులకే వదిలిపెట్టేవారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ముందే గమనించారని, అందుకే 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు మాత్రమే ఇచ్చారన్నారు. ఈసారి కూడా ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యరులను 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉంటే ప్రజాసేవలో ఉంటారు, లేదంటే పొలంలో ఉంటారని, వ్యవసాయం గురించి ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలుసని ప్రశంసించారు.


పాలమూరు బిడ్డను నేను

తాను ఏ అమెరికా నుంచో ఊడిపడలేదని, తాత తండ్రుల రాజకీయ వారసత్వంతో రాలేదని, వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ఇక్కడి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోనే ఇంటర్‌ చదివానని సీఎం తెలిపారు. తాను పదోతరగతి పూర్తి చేశాక.. అప్పటి యువనేత చిన్నారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే వనపర్తిలో, కొత్తకోటలో గోడలపై ఆయన తరుఫున నినాదాలు రాసి (వాల్‌ రైటింగ్‌ చేసి) ప్రచారం చేశానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావుకు సీఎంగా అవకాశమొచ్చిందని, మళ్లీ 70 ఏళ్ల తర్వాతే ఆ అవకాశం తనకు దొరికిందన్నారు. మల్లికార్జున్‌గౌడ్‌, జైపాల్‌రెడ్డి, మల్లు అనంతరాములు, మహేంద్రనాథ్‌, చిన్నారెడ్డి వంటి ఎందరో గొప్పనేతలు ప్రాతినిధ్యం వహించినా వారికి దక్కని అవకాశాన్ని సోనియమ్మ ఇచ్చారన్నారు. పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చొని 150 రోజులు కాకముందే.. కాకుల్లా, గద్దల్లా పొడుస్తున్నారని, దిగిపో, దిగిపో అంటున్నారని, అండగా ఉండాల్సివారే శత్రువులతో జతకట్టారని సీఎం ఆవేదన చెందారు. రేవంత్‌ని పడగొడతానని, కాంగ్రె్‌సని ఖతం చేస్తానని డీకే అరుణమ్మ అంటున్నారని చెప్పారు. ‘మోదీ చేతిలో చురకత్తిలా మారిన అరుణమ్మ కాంగ్రెస్‌ను పొడిచేందుకు వస్తున్నారు. నాయకురాలిగా ఆమె పేరు దేశమంతా తెలిసే స్థాయికి ఆమెకు కాంగ్రెస్‌ సహకరించింది.. అయినా, పార్టీని ఖతం చేస్తావా? రేవంత్‌ను అరెస్టు చేయడానికి అమిత్‌షాతో పైరవీ చేయించి మరీ ఢిల్లీ పోలీసులను తెప్పించారు.. అరుణమ్మా! నీకిది న్యాయమా?’ అని సీఎం ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తనపై పగబట్టారని అరుణమ్మ అంటోందని, తాను ఆమెపై ఎందుకు పగబడతానని, తమ మధ్య ఏమైనా ఆస్తి, గట్టు పంచాయితీలున్నాయా అని నిలదీశారు.

Updated Date - May 05 , 2024 | 05:49 AM

Advertising
Advertising