రేవంత్ సర్కారు.. ఇక ఇంటికే
ABN, Publish Date - Oct 02 , 2024 | 06:35 AM
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లిందని.. రేవంత్ ప్రభుత్వం ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని బీజేపీ జాతీయ నేత, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తాము విస్తృత స్థాయిలో ఎండగట్టబోతున్నామని
ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లింది
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా.. ఎండగడతాం: బీజేపీ నేత అభయ్ పాటిల్
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం ట్యాక్స్ వసూళ్లు
పేదల ఇళ్లను కూల్చుతూ.. పెద్దలతో బేరాలు
రేవంత్‌ది అరాచక పాలన: మహేశ్వర్‌రెడ్డి
ప్రజలే రేవంత్ భరతం పడతారు: ఈటల
ముగిసిన బీజేపీ రైతు హామీల సాధన దీక్ష
హైదరాబాద్/కవాడిగూడ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లిందని.. రేవంత్ ప్రభుత్వం ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని బీజేపీ జాతీయ నేత, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తాము విస్తృత స్థాయిలో ఎండగట్టబోతున్నామని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ను తలపిస్తున్నారని, కుటుంబ ప్రయోజనాల కోసమే ఆయన సీఎం అయ్యారని విమర్శించారు. ధర్నాచౌక్‌లో బీజేపీ చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష మంగళవారం ముగిసింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి అభయపాటిల్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, అరాచక పాలన సాగిస్తూ, హామీల అమలును గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ఢిల్లీకి హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను కూలుస్తూ, పెద్దల ఇళ్లతో బేరాలు చేసుకుంటూ.. ఆ డబ్బులను ఢిల్లీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అందిస్తున్నారని ఆరోపించారు. బీట్యాక్స్ పేరు మీద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న వసూళ్లను ఢిల్లీకి కప్పం కడుతున్నారా..? లేదా జేబులో వేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను అసెంబ్లీ వేదికగా, ప్రజా క్షేత్రంలో ఎండగట్టామని తెలిపారు. సివిల్ సప్లయ్స్ కుంభకోణం, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్, ఎగ్జీమ్ బ్యాంక్ గోల్ మాల్, సుంకిశాల నిర్లక్ష్యం, అమృత్ నిధుల దుర్వినియోగం.. ఇలా ఎన్నో అవినీతి, అక్రమాలను ఆధారాలతో బయటపెట్టామని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రైతు దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులను గుర్తు చేసే మంచి సందర్భం వచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ‘‘రైతుల ఆదాయాన్ని మోదీ ఎక్కడ రెట్టింపు చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అడుగుతున్నారట. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు కనీస మద్దతు ధర ఎంత ఉందో.. ఇప్పుడు ఎంత ఉందో..? కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. మోదీ 22 పంటలను జాతీయ పంటలుగా గుర్తించారు. పసుపు ధర రెట్టింపు పలుకుతోంది’’ అని వివరించారు.
హైడ్రాతో కక్ష సాధింపు: కొండా
సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి మాటా వినని సైకో అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన చేసిన మోసానికి ప్రజలే భరతం పడతారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌సకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. రోజుకో మాటతో అధికారులు తప్పించుకుంటున్నారంటే.. హైడ్రా ఎంత పేలవంగా ఉందో అర్థమవుతోందన్నారు. హైడ్రా పేరిట బీజేపీ కార్పొరేటర్ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల జోలికి మాత్రం వెళ్లడం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. వ్యాపార సంస్థల ప్రకటనల్లాగే కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. రుణమాఫీ విషయంలో షరతులు పెట్టి.. రేవంత్ రైతులను ముంచారని మండిపడ్డారు. ఈ దీక్షలో ఎంపీలు నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పాల్వాయి హరీశ్, సూర్యనారాయణ గుప్తా, రామారావుపాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 06:35 AM