సన్నాలకే సై!
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:33 AM
జిల్లాలో యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడంతో యాసంగిలో సన్నాల వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు.
యాసంగి సాగుకు అన్నదాతల సన్నద్ధం
సాగు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు
జిల్లాలో 1.93 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
గతేడాది కంటే పెరగనున్న వరి విస్తీర్ణం
బోనస్ ప్రకటనతో సన్నాల సాగుకు మొగ్గు
ఆరుతడి పంటలపై రైతుల అనాసక్తి
జఫర్‌గడ్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడంతో యాసంగిలో సన్నాల వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ఆశించిన వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరింది. నీటి లభ్యతనుసరించి యాసంగి సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1.93 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసి.. ఇందుకనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించారు. పంటలతో పాటు అందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులతో కలిపి కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాలో యాసంగిలో అన్ని రకాల పంటలు కలిపి 1.93లక్షల ఎకరాల్లో సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రణాళికలను రూపొందించింది. అత్యధికంగా 1.79 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేసే అవకాశం ఉన్నట్లు వేసింది. గత ఏడాది కంటే ఈసారి స్వల్పంగా వరి సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రైతులు దుక్కులు దున్నడంతోపాటు వరి నారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో బోరు బావుల కింద రైతులు 60శాతం నార్లు పోయగా, జనవరి నాటికి నాట్లు వేసే అవకాశం ఉంది.
అందుబాటులోకి ఎరువులు ..
యాసంగిలో పంటల సాగుకు అనుగుణంగా ఎరువుల అవసరాలను అధికారులు అంచనా వేశారు. వరి సాగుకు 16,191 మెట్రిక్ టన్నుల యూరియా, 450 టన్నుల డీఏపీ, 360 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 400 మెట్రిక్ టన్నులు పొటాష్ అవసరమవుతుందని ప్రతిపాదించారు. మొత్తం పంటలకు 16,874 మెట్రిక్ టన్నులు యూరియా, 838 మెట్రిక్ టన్నుల డీఏపీ, 170 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 700 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1,595 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
బోనస్ ప్రకటనతో సన్నాలకే సై..
యాసంగిలోనూ రైతులు వరిలో సన్న రకం సాగువైపే మొగ్గుచూపుతున్నారు. వానాకాలంలో సన్నాలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడంతో ఈ సీజన్‌లో అత్యధిక శాతం రైతులు సన్నాల సాగుకే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్‌లో ఎక్కువగా రైతులు దొడ్డు రకం ధాన్యం సాగు చేసేవారు. అయితే బోనస్ ప్రభావంతో వరి సాగులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వానాకాలం సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలతో పాటు బోరు బావుల్లో సైతం నీరు ఉంది. అయితే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు మాత్రమే దొడ్డు రకం సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆరుతడి పంటలపై అనాసక్తి...
రైతులు అరుతడి పంటలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, మినుములు, పెసర, వేరుశనగ, వంటి పంటల సాగు నానాటికి తగ్గిపోతోంది. నీటి తడులు, పెట్టుబడులు తక్కువ అవసరమైనా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. అయితే పంటల చివరి దశలో నీటి ఇక్కట్లు ఎదురుకాకుండా రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఆరుతడి పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నారని, ఈసారి మినుములు, వేరుశనగ, పెసర పంటలను రైతులు సాగు చేసే అవకాశం ఉందంటున్నారు.
యాసంగి సాగుకు కార్యాచరణ
- డి.రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి, జనగామ
యాసంగి పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిం చాం. అన్ని పంటలు కలిపి జిల్లాలో మొత్తం 1,93,774 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశాం. ఇందులో వరి సాగు అధికంగా ఉంటుంది. సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పంటల చివరి దశలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆరు తడి పంటలుగా మొక్కజొన్న, వేరుశనగ, మినుములు వంటివి సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం వరి నార్లు పోసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Updated Date - Dec 15 , 2024 | 12:33 AM