కల్యాణ వైభోగమే!
ABN, Publish Date - Apr 17 , 2024 | 03:45 AM
భద్రాచల క్షేత్రంలో మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కల్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. బుధవారమే సీతారాముల కల్యాణం! శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా
నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం
మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతికుమారి
వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం
భద్రాచలం, హైదరాబాద్, ఏప్రిల్ 16: భద్రాచల క్షేత్రంలో మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కల్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. బుధవారమే సీతారాముల కల్యాణం! శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కల్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లడం లేదు. కల్యాణం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కల్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని చక్కగా అలంకరించారు. ఎండలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణ వేడుకలో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ప్రభుత్వం తరఫున స్వామి వారికి శాంతి కుమారి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ తరఫున ముఖ్యకార్యదర్శి శైలజరామయ్యర్ పట్టువస్త్రాలు అందజేశారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం 2.50 లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 19 ప్రసాద విక్రయ కౌంటర్ల ద్వారా వీటిని విక్రయించనున్నారు. మిథిలా స్టేడియంలోనే గురువార ం శ్రీరామమహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణం, పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భద్రాద్రి తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ శాంతికుమారి భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కల్యాణం సందర్భంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ పర్యవేక్షణలో 1,800మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని భక్తులకు బుధవారం మూలవరుల దర్శనాన్ని ఉచితంగా కల్పించనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ప్రకటించారు. కాగా రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతించింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ ఈనెల 4న నిరాకరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భద్రాద్రి రామయ్యకు భక్తులు ఉన్నారని, కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌లో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారని, రేడియోలో వ్యాఖ్యానం ప్రసారమైందని గుర్తుచేసింది. ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఈసీ మంగళవారం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఽసీతక్క తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Apr 17 , 2024 | 03:45 AM