సర్వే సరే.. చదువులు ఎట్లా?
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:06 AM
టీచర్లకు రికాం లేకుండా పోయింది. విద్యాబోధన తోపాటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పనులు కూడా ప్రభుత్వం అప్పగించడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు తరగతుల నిర్వహణతోపాటు అటు సర్వేలో పాల్గొంటుండగా వీరిపై అదనపు భారం పడుతోంది.
ఉపాధ్యాయులకు ‘గణన’ డ్యూటీలు
ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనపై ప్రభావం
పాఠాలు సరిగా సాగక విద్యార్థులకు నష్టం
50 శాతం కూడా పూర్తికాని సిలబస్
భూపాలపల్లిటౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): టీచర్లకు రికాం లేకుండా పోయింది. విద్యాబోధన తోపాటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పనులు కూడా ప్రభుత్వం అప్పగించడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు తరగతుల నిర్వహణతోపాటు అటు సర్వేలో పాల్గొంటుండగా వీరిపై అదనపు భారం పడుతోంది. అంతేకాదు.. ఈ సర్వే నేపథ్యంలో ఒంటి పూట బడులను నిర్వహిస్తుండటంతో సర్కారు చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరిగా క్లాసులు నడవక విద్యాభ్యాసం కుంటుపడుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 242 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో సమగ్రసర్వే కొనసాగుతోంది. జిల్లాలో 319 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 630 మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. సుమారు 20రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని 600 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. దీంతో పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది. సిలబస్ వెనుకబాటుకు గురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే వారికి కూడా డ్యూటీలు వేయడంతో చదువులు పూర్తిగా కుంటుపడుతోందని తెలుస్తోంది.
మూడు నెలల్లో మూడు ఆటంకాలు
గడిచిన మూడు నెలల్లో మూడుసార్లు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగా సెప్టెంబరులో ఉపాధ్యాయుల డిమాండ్ మేరకు ప్రభుత్వం బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టింది. ఇలా దాదాపు 15 నుంచి 20రోజుల వరకు బోధనకు ఇబ్బంది కలిగిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే అక్టోబరు చివరి వారంలో నూతన ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ జరిగింది. దీనికి సుమారు 15 రోజులు పట్టింది. ఇలా దాదాపు నెలరన్న వరకు పాఠశాలలో బోధనా తరగతులకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 9 నుంచి సమగ్ర సర్వే ప్రారంభమైంది. దీనికి ప్రైమరీ తరగతులు బోధించే ఉపాధ్యాయులకు 600 మందికి విద్యా శాఖ అధికారులు బాధ్యతలు అప్పగించారు. 630 మందికి గానూ 600 మందికి అదనపు డ్యూటీలు కేటాయించడంతో పాఠశాలలు వెలవెలబోతున్నాయి.
ఇలాగైతే.. ఎలా?!
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్వే డ్యూటీ అప్పగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పాఠ శాలలు ప్రార ంభమై ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎస్‌ఏ 1 పరీక్షల వరకు మాత్రమే పాఠాలు కొనసాగాయి. విద్యాసంవత్సరం ముగి యడానికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఇంకా మిగిలిన 50శాతం సిలబస్ ఎలా పూర్తవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సి ఉండగా ఆ దిశలో అడుగులు కూడా పడటం లేదని తెలుస్తోంది. ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 10 , 2024 | 12:06 AM