దేవాలయాలే లక్ష్యంగా దొంగతనాలు
ABN, Publish Date - Apr 03 , 2024 | 11:56 PM
గతంలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 3: గతంలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తిరిగి ప్రసిద్ధ దేవాలయాలను టార్గెట్ రాత్రి సమయంలో దొంగతనాలు చేసేవాడు. నల్లగొండ సబ్ డివిజన్ పరిఽధిలో కొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడితో పాటు అతడి నుంచి సొత్తు కొనుగోలు చేసిన మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.50లక్షల విలువ చేసే 3.462 కేజీల వెండి, నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.41వేల నగదు, బైక్, ఇనుపరాడ్డు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన ఖమ్మంపాటి బుచ్చయ్య స్థానిక ఐకాన్ ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా పనిచేస్తుండేవాడు. అతనిపై గతంలో 2015 నల్లగొండ టూటౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది దొంగతనాల కేసులు నమోదు కావడంతో అప్పట్లో జైలుకు వెళ్లాడు. 2018 నవంబరులో జైలు బయటకు వచ్చాడు. కొన్నాళ్లు మంచిగానే ఉన్నాడు. తర్వాత తనలోని నేర ప్రవృత్తిని తిరిగి ప్రారంభించాడు. ప్రసిద్ధ దేవాలయాలను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా చండూరు మండలంలోని సంతాన సుబ్రమణ్య స్వామి దేవాలయం, ఉడుతలపల్లీ గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయం, తెరాట్‌పల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీగాంధే చేన్నకేశ్వర స్వామి గుడి, మునుగోడులో కనకదుర్గమ్మ గుడి, నల్లగొండ టౌన్‌లో గంధ వారిగూడెంలో గల కనక దుర్గమ్మ గుడి, కతాల్‌గూడలోని ఆంజనేయ స్వామిదేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆయా దేవాలయాల్లో మొత్తం 3.462 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని గొల్లగూడ ప్రాంతానికి చెందిని స్వర్ణకారుడు కూరెళ్ల సత్యనారాయణకు విక్రయించాడు. మరికొన్నింటిని ఇంట్లోనే దాచిపెట్డాడు. బుఽధవారం చండూరు ఎస్‌ఐ తన సిబ్బందితో కస్తాల ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటు వస్తున్న బుచ్చయ్యను అనుమానంతో ఆపారు. అతని వద్ద స్వామివారి ఆభరాణాలు లభించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దొంగలించిన ఆభరాణాలను కొనుగోలు చేసిన సత్యనారాయణను అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని వద్ద ఉన్న ఆభరాణాలతో పాటు బుచ్చయ్య ఇంట్లో ఆభరణాలను, రూ.41 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభకనబర్చిన డీఎస్పీ కె. శివరాంరెడ్డి, చండూరు సీఐ వెంకటయ్య, సీసీఎస్ సీఐ మహోలక్ష్మయ్య, ఎస్‌ఐ సురేష్, ఐటీకోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Updated Date - Apr 03 , 2024 | 11:56 PM