ఈతకు వెళ్లి బాలుడి మృతి
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:40 AM
ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఘటన
నాగారం, ఆక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఖమ్మంపాటి నాగారాజు-ఉపేంద్ర దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు మనీశ్వర్‌గౌడ్(11) జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో వున్న బిక్కేరు వాగులో ఉన్న చెక్‌డ్యాంలో ఈత కొట్టడానికి వెళ్లారు. చెక్ డ్యాంలోకి దిగిన మనీశ్వర్‌కు ఈత సరిగా రానందున నీట మునిగి బయటికి రాలేదు. భయభ్రాంతులకు గురైన స్నేహితులు ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కూలి పనులకు వెళ్లిన మనీశ్వర్ తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కుమారుడు లేనందున, ఎక్కడికి వెళ్లాడని అతడి స్నేహితులను అడిగారు. భయంతో జరిగిన ఘటనను వారు వెల్లడించలేదు. కుమారుడి కోసం ఊరంతా వెదికినా కనిపించకపోవడంతో ఎస్‌ఐ ఐలయ్యకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుని మనీశ్వర్ స్నేహితులను వాకబు చేయగా, చెక్ డ్యాంలో ఈతకు వెళ్లామని, నీట మునిగి మునీశ్వర్ బయటకు రాలేదని ఓ స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. చెక్‌డ్యాం వద్దకు తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి వెళ్లి రాత్రి 12గంటల వరకు వెతికినా ఆచూకీ లభించకపోవటంతో తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో చెక్‌డ్యాం వద్దకు మనీశ్వర్ తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు వెళ్లి చూడగా చెక్ డ్యాం ముందు భాగంలో రాతి గుండు సమీపంలో మృతదేహం నీటిపై తేలాడుతూ కనిపించింది. మనీశ్వర్ మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీశారు. కుమారుడి మృతదేహన్ని చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. మనీశ్వర్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి నాగారాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. తలిదండ్రులు నిరుపేదలు కాగా కిరాయి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. దీంతో కుమారుడి అంతక్రియలు అమ్మమ్మ ఊరైన నాగారం బంగ్లాలో నిర్వహించారు.
Updated Date - Oct 22 , 2024 | 12:40 AM