Youth Addiction : మృత్యు వలయం
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:14 AM
యువత.. గంజాయికి, బెట్టింగ్‌కు, ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ మత్తులో మానసిక రుగ్మతకు గురై ఒంటరి కావడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడం, అందుకోసం లోన్ యాప్‌లలో, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో
వ్యసనాల ఉచ్చులో యువతగంజాయి మత్తుకు బానిసై..
ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటు
అప్పులపాలై ఆత్మహత్యలు.. హత్యలు కూడా
లోన్ యాప్‌లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల
విష వలయంలో చిక్కుకుని బలవన్మరణాలు
ఏజెన్సీ ప్రజలే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు
రవాణాను అరికడుతున్నా గంజాయి లభ్యం
జూదాన్ని నిషేధించినా ఆన్‌లైన్‌లో అందుబాటు
జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడు పదో తరగతి చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. ఏళ్లు గడిచిన కొద్దీ దానికి బానిస అయ్యాడు. అనారోగ్యం పాలై.. రోజూ గంజాయి తీసుకోనిదే బతకలేని పరిస్థితికి చేరుకున్నాడు. అందుకోసం బీడీ ప్యాకర్‌గా పనిచేసే నిరుపేద తండ్రిపై, తల్లిపై నిత్యం చేయి చేసుకునే స్థితికి దిగజారాడు. చివరికి ఆరోగ్యం క్షీణించిన అతణ్ని (23).. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
యువత.. గంజాయికి, బెట్టింగ్‌కు, ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ మత్తులో మానసిక రుగ్మతకు గురై ఒంటరి కావడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడం, అందుకోసం లోన్ యాప్‌లలో, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేయడం, తరువాత ఆ అప్పులు తీర్చలేక.. లోన్ యాప్‌లు, ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడటం జరుగుతోంది. ఈ వ్యసనాల కారణంగా ఆత్మహత్యలతోపాటు హత్యలకూ పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. అయితే గతంలో నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం కొంతకాలంగా పల్లెలకూ పాకుతోంది. గ్రామీణ యువత లక్ష్యంగా.. చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సాంకేతికత పెరిగాక.. చేతిలో 5జీ స్పీడ్ సెల్‌ఫోన్ వచ్చాక.. పల్లె ప్రాంతాల్లోకీ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్, లోన్‌యా్‌పల ద్వారా సులువుగా డబ్బులు తీసుకోవడం లాంటి విష సంస్కృతి వచ్చేసింది. దాంతో గ్రామీణ యువత పక్కదారి పడుతున్నారు. పెళ్లికోసం ఇంట్లో ఉంచిన డబ్బును, ఇళ్లు కట్టుకోవడం కోసం బ్యాంకులో దాచిన బ్యాలెన్స్‌ను, ధాన్యం అమ్మగా వచ్చిన ధనాన్ని ఆన్‌లైన్ ఆటలకు అప్పగించేసి, విషయం తెలిశాక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు. యువత మాత్రమే కాకుండా.. వివాహమై కుటుంబాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వారు సైతం వ్యసనాలకు బానిసలై భారంగా తనువు చాలిస్తున్నారు. కుటుంబ సభ్యులపై మోయంలేని భారం మోపుతూ, వారికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.
అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్‌లు ఆడి మోసాలకు గురైన వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు ఆ అప్పులు తీర్చేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇలా దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులు ఇటీవల కాలం పెద్దసంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు తమ వాళ్లు చేసిన అప్పులను తీర్చే క్రమంలో కుటుంబ సభ్యులు తమ స్థిరాస్తులను సైతం అమ్మేస్తున్నారు. అయినా అప్పులు తీరే పరిస్థితి కనిపించక కుటుంబమంతా కలసి బలవన్మరణానికి పాల్పడుతున్న హృదయ విదారక ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.
ఆత్మహత్యకు పురిగొల్పుతున్న లోన్ యాప్‌లు!
గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వ్యసనాల బారిన పడినవారు.. తక్షణ అవసరం కోసం వెంటనే అప్పు ఇచ్చే లోన్ యాప్‌లు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తూ.. వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ‘ఎటువంటి పత్రాలతో పనిలేకుండా.. తక్షణమే రుణం పొందండి’ అంటూ లోన్ యాప్‌లు అదే పనిగా మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుండడం, బాధితులు అప్పటికే మైకంలో కూరుకుపోయి తక్షణ డబ్బు కోసం ఎదురుచూస్తుండడంతో.. సదరు లోన్ యాప్ నుంచి వచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తున్నారు. దీంతో అతని మొబైల్‌లోని వివరాలన్నీ లోన్ యాప్ నిర్వాహకులకు చేరిపోతాయి. ఇక ఇచ్చే రుణాన్ని ఎన్ని రోజుల్లో చెల్లించాలన్న దానిపైనా బాధితుడి నుంచి ఆమోదం తీసుకుంటారు. తీసుకునే మొత్తానికి దాదాపు రెట్టింపు సొమ్మును వాయిదాల్లో తిరిగి చెల్లించేలా ఆ ఒప్పందం ఉంటుంది. ఏ ఒక్క వాయిదా చెల్లించకపోయినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అప్పటికే బాధితుడి మొబైల్ నుంచి వివరాలను సేకరించిన యాప్ నిర్వాహకులు.. అతడి ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్న ఫొటోను తన కాంటాక్టు లిస్టులో ఉన్నవారికి పంపిస్తుంటారు. అంతేకాకుండా.. కాంటాక్టు లిస్టులో ఉన్నవారికి ఫోన్లు సైతం చేసి బాధితుడి అప్పు గురించి చెబుతారు. ఇలా పరువు బజారున పడడంతోపాటు వేధింపులకు తాళలేక బాధితుడు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. తొలుత లాభాలు రావడంతో బెట్టింగ్ కొనసాగిస్తూ వెళ్లాడు. అనంతరం డబ్బులు పోవడమే తప్ప.. తిరిగి రాలేదు. ఇలా అప్పులు చేసి మరీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు తమకున్న అర ఎకరం వ్యవసాయ భూమి అమ్మినా.. తీరలేదు. ఓవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, మరోవైపు అప్పులవారి వేధింపులు పెరగడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరికి చేసేదేమీ లేక తల్లిదండ్రు లు, కొడుకు కలిసి ఇంట్లోనే ఉరేసుకున్నారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్కపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. ఆన్‌లైన్ గేమ్ ఆడి సుమారు రూ.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. చివరికి విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి పురు గుల మందు తాగి ప్రాణాలు తీసు కున్నాడు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసముండే సింగరేణి ఉద్యోగి.. క్రికెట్ బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో రూ.60 వేలు అప్పుగా తీసుకు న్నాడు. రూ.50 వేలు తిరిగి చెల్లించగా.. మిగతా సొమ్ము విషయంలో లోన్ యాప్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. లోన్ యాప్ నిర్వాహకులు అతడి తల్లిదండ్రుల ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు షేర్ చేశారు. అవమానం భరించలేక ఆ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతిమ సంస్కారాల సమయం లోనూ యాప్ నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి వేధించారు.
గంజాయి దొరుకుతోంది ఇలా..
గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దానిని వినియోగిస్తున్న వారికి ఏదో రకంగా అది లభిస్తూనే ఉంది. తెలంగాణలో ఎక్కడా గంజాయి సాగు లేకుండా చేసి నా.. ఇటు ఏపఈ నుంచి, అటు మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి గంజాయి సరఫరా జరుగుతోంది. ఏపీలోని విశాఖపట్నం అటవీప్రాంతం నుంచి తెలంగాణలోకి కొందరు దీనిని సరఫరా చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకూ గంజాయి రవాణా అవుతోంది. నల్లమల ప్రాంతం నుంచి గంజాయి రవాణాకు సంబంధించి ఒక్క నాగర్‌కర్నూల్ పోలీ్‌సస్టేషన్‌లో ఏడాది వ్యవధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. రాష్ట్రంలోకి గంజాయి రవాణా జరగకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తుండడంతో.. గతంతో పోలిస్తే కొంత మేరకు గంజాయి వినియోగం కొంత మేరకు తగ్గింది. అయితే విక్రయ ముఠా లు వ్యూహం మార్చి కొత్తరూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నాయి. గతంలో క్వింటాళ్ల చొప్పున గంజాయిని వాహనాల్లో తరలించగా.. ఇప్పుడు దానిని తక్కువ పరిమాణంలో తరలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. ఒకవేళ పట్టుబడినా.. తక్కువ పరిమాణంలో ఉన్నందున కేసు నుంచి కూడా త్వరగా బయటపడతామన్న ఆలోచనతో వారు ఈ వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే కాకుండా.. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి ఒకటి రెండు లీటర్ల పరిమాణంలో తీసుకొస్తూ బస్సు ల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ పోలీసులకు దొరకకుండా వెళ్లిపోతున్నారు. అనంతరం దానిని ‘హ్యాష్ ఆయిల్’ పేరుతో అతి తక్కువ పరిమాణంలో 5గ్రాములు, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ట్యూబ్‌లలో విక్రయిస్తున్నారు. ఈ హ్యాష్ ఆయిల్‌ను పోలీసులు కనిపెట్టి అరికడుతున్నా.. గంజాయికి అలవాటు పడినవారు దీనిని కొనుగోలు చేస్తూ ఇతరులకు కూడా విక్రయిస్తున్నారు.
ప్రాణాలు తీసుకునేలా ‘మైక్రో’ల వేధింపులు
మైక్రో ఫైనాన్స్ సంస్థలు.. తిరిగి వాటిని వసూలు చేసుకునే క్రమంలో ఏజెంట్ల ద్వారా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. వాయిదాలు చెల్లించని వారిపై ఈ ఏజెంట్లు దాడులకూ తెగబడుతున్నారు. కుటుంబ సభ్యులనూ అందులోకి లాగుతూ నలుగురి ఎదుట పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పులు తీసుకున్నవాళ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలనే ఈ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వీరి దందా ఎక్కువగా సాగుతోంది. ఈ సంస్థల ప్రతినిధులు మారుమూల మండలాల్లో చిన్న గదులను అద్దెకు తీసుకుని తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రక రకాల మైక్రో ఫైనాన్స్ కంపెనీల పేర్లతో అమాయక ప్రజలకు రుణాలు ఇస్తున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని నూటికి 5 నుంచి 15 శాతం వరకు వడ్డీ వేస్తున్నారు. అత్యవసర సమయంలోనైతే 20 శాతం వడ్డీ కూడా విధిస్తున్నారు. రుణాలు ఇచ్చే సమయంలో ఇన్సూరెన్స్, డాక్యుమెంట్ చార్జీల పేరిటా అదనంగా వసూలు చేస్తున్నారు. ఏదైనా ఒక నెల వాయిదా చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ విధిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడి చనిపోయినా, ఇంటి ముందు శవం ఉన్నా వడ్డీ మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తెల్లవారు జామున,. సాయంత్రం వేళల్లో ఇంటికి వచ్చి వడ్డీ, అసలు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ లాంటి వ్యసనాలతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కొన్ని ఘటనలు..
కామారెడ్డికి చెందిన ఐదుగురు వ్యక్తులు గంజాయికి అలవాటు పడి.. ఆ మత్తులో ఓ యువకుడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకులు గంజాయి సేవించి విచక్షణ కోల్పోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడేనికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. టెలిగ్రామ్‌లో వచ్చిన ఓ లింకు ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ ఎంచుకొని కొన్ని టాస్క్‌లు పూర్తి చేశాడు. అందులో అతను రూ.200 పెడితే సైబర్ నేరగాళ్లు రూ.250 పంపారు. దీంతో అతడు అత్యాశకు పోయి విడతలవారీగా రూ.12 లక్షలు పెట్టాడు. ఆ డబ్బంతా తన చెల్లి పెళ్లి కోసం బ్యాంకులో దాచినవి. ఆ డబ్బుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావు పేటకు చెందిన ఓ వ్యక్తి.. తన తల్లిదండ్రులు ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేయగా.. ఆ ఖాతాను ఉపయోగించి ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. మొత్తం డబ్బు ఆన్‌లైన్ గేమ్‌కు పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన ఓ వ్యక్తి.. ఆ డబ్బులను తిరిగి సంపాదించేందుకు దొంగతనాన్ని ఎంచుకున్నాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 13 దొంగతనాలకు పాల్పడి.. చివరికి పోలీసులకు చిక్కాడు.
సిద్దిపేట జిల్లా రామునిపట్టకు చెందిన ఓ కానిస్టేబుల్.. ఆన్‌లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడి రూ. కోటి వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గంలేక తన భార్య, ఇద్దరు చిన్నపిల్లలను రివాల్వర్‌తో కాల్చి.. తాను కాల్చుకున్నాడు.
షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్, పేకాటకు బానిసై 25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం కూడబెట్టిన ఈ డబ్బులు మొత్తం పోవడంతో అప్పుల పాలై.. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంచిర్యాలకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ట్రేడింగ్ మార్కెట్లో పెట్టుబడుల కోసం లోన్ యాప్‌లో అప్పులు చేశాడు. నష్టాలు రావడం, వాటినితీర్చే మార్గం లేపోవడంతో భార్య, ఇద్దరు కుమారులకు విషమిచ్చి, తాను ఉరేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గణశ్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. తల్లిదండ్రులు వ్యవసాయం ద్వారా వచ్చిన రూ.6 లక్షలను బ్యాంకులో వేయగా.. అతడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఆ మొత్తం డబ్బును పోగొట్టాడు. చివరికి పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
మహబూబ్‌నగర్‌లో ఓ వ్యాపారి ఒక్కగానొక్క కొడుకు.. బెట్టింగ్‌ల్లో లక్షల రూ పాయలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడు మద్యానికి బానిసై.. తాగేందుకు డబ్బులివ్వడం లేదని 80 ఏళ్ల వృద్ధురాలైన సొంత అమ్మమ్మనే కొట్టి చంపాడు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురానికి చెందిన యువకుడు మద్యానికి బానిసై ...ఆ మత్తులోనే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లికి చెందిన ఓ వ్యక్తి.. కోళ్లు సరఫరా చేసే వాహనాన్ని నడుపుతూ ఆన్‌లైన్ పేకాటకు అలవాటు పడ్డాడు. ఏకంగా రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. చేసిన అపుల తీర్చేందుకు పొలం అమ్మాడు. అయితే అప్పులు తీరకపోవడంతో తప్పుదారి పట్టి చైన్ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. ఓ వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు దొరికాడు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ఓ రైల్వే ఉద్యోగటి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. గమనించిన అతని తండ్రి.. వాటిని మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా మానుకోకపోవడంతో అర్ధరాత్రి కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు.
Updated Date - Dec 18 , 2024 | 06:14 AM